దేశంలో గణనీయంగా పెరుగుతున్న గృహహింస కేసులు.. రెండో స్థానంలో తెలంగాణ..!

By Sumanth KanukulaFirst Published Mar 24, 2023, 12:18 PM IST
Highlights

దేశంలో గృహ హింస కేసులు రోజురోజుకు గణనీయంగా పెరిగిపోతున్నాయి. అయితే గృహ హింస కేసుల్లో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలవడం గమనార్హం. 

హైదరాబాద్‌: దేశంలో గృహ హింస కేసులు రోజురోజుకు గణనీయంగా పెరిగిపోతున్నాయి. అయితే గృహ హింస కేసుల్లో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలవడం గమనార్హం. ఈ జాబితాలో అస్సాం మొదటి స్థానంలో నిలువగా, ఢిల్లీ మూడో స్థానంలో ఉన్నాయి. కేంద్ర గణాంకా మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన ఉమెన్‌ అండ్‌ మెన్‌ ఇన్‌ ఇండియా-2022 సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ సర్వే ప్రకారం.. గృహహింసలో 75 శాతంతో అస్సాం, 50.4 శాతంతో తెలంగాణ రెండో స్థానం, 48.93 శాతంతో ఢిల్లీ మూడో రెండో స్థానంలో ఉన్నాయి. 

దేశంలో మహిళలపై జరుగుతున్న దాడుల్లో మూడోవంతు భర్తలు, బంధువుల నుంచి జరుగుతున్నవే. చాలా మంది మహిళలపై ఉద్దేశపూర్వకంగా దాడులు జరుగుతున్నాయి. కిడ్నాప్, అత్యాచారయత్నం తదితర ఘటనలు మహిళలు ఎదుర్కొంటున్నారు. 2015-16లో ఈ వేధింపులు 33.3 శాతంగా ఉన్నాయి. 2020-21 సంవత్సరంలో ఇది 31.9 శాతానికి స్వల్పంగా తగ్గింది. ఆ తర్వాత మహిళలపై దాడులు మరింతగా పెరిగాయి. దీంతో మహిళా భద్రతపై ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. 

 ఇక, 2021-22 నాటికి దేశవ్యాప్తంగా మహిళలపై దాడులకు సంబంధించిన 21 లక్షల కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు 83,536 కేసులు పరిష్కరించారు. ఇలాంటి కేసులను కోర్టులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని సర్వే పేర్కొంది. మరోవైపు 2005లో 40,998 మంది మహిళలు ఆత్మహత్యలు చేసుకోగా.. 2011లో ఆ సంఖ్య 47,746కు పెరిగింది. అయితే 2021లో ఆ సమఖ్య 45,026కు తగ్గినట్లు సర్వే నివేదిక వెల్లడించింది. నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో దృష్టికి రాని కేసులు చాలా ఉన్నాయని సర్వే తెలిపింది. ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలని సర్వే సూచించింది.

దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులను గమనిస్తే.. ముఖ్యంగా ఇంట్లోవారి నుంచే వేధింపులకు గురవుతున్నట్లు స్పష్టమవుతోంది. 2016లో 1,10,378 మంది మహిళలు భర్తలు, వారి బంధువుల నుంచి సమస్యలను ఎదుర్కొన్నారు. 2021లో ఆ సంఖ్య 1,36,234కి పెరిగింది. మరోవైపు 2016లో రేప్ కేసుల సంఖ్య 38,947గా ఉంటే.. 2021లో 31,677కి తగ్గింది. 

మరోవైపు దేశంలో వరకట్న వేధింపుల ఘటనలు కూడా పెరుగుతున్నాయి. 2016లో 9,683 కేసులు నమోదయ్యాయి. ఇది 2021లో 13,568కి పెరిగింది. మహిళలపై మొత్తం దాడులు 2016లో 3,38,954 నుంచి 2021 నాటికి 4,28,278కి పెరిగాయి. సర్వే ప్రకారం.. బీహార్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతున్నాయి.
 

click me!