DGP Ravi Gupta: "పెరిగిన క్రైం రేటు.. అన్నిట్లో ఆ కేసులే ఎక్కువ.. "

By Rajesh Karampoori  |  First Published Dec 30, 2023, 4:08 AM IST

Telangana Crime Rate Annual Report 2023: గతేడాది కంటే 2023లో క్రైం రేటు పెరిగిందని, ప్రధానంగా 2023లో సైబర్ నేరాల సంఖ్య 16,339కి పెరిగిందని, అంతకుముందు ఏడాది 13,895గా ఉందని రాష్ట్ర పోలీసు వార్షిక నివేదికను విడుదల చేసిన తెలంగాణ డీజీపీ రవిగుప్తా తెలిపారు.


Telangana Crime Rate Annual Report 2023: 2023 ముగుస్తున్న వేళ తెలంగాణ పోలీస్ శాఖ వార్షిక నివేదికలు విడుదల చేసింది. గతేడాది కంటే ఈ ఏడాది నేరాల సంఖ్య పెరిగిందని రాష్ట్ర పోలీసుల వార్షిక నివేదిక వెల్లడించింది. వార్షిక క్రైమ్ రిపోర్ట్ 2023ని విడుదల చేసిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) రవి గుప్తా మాట్లాడుతూ..  అసెంబ్లీ ఎన్నికలు, వివిధ పండుగల కోసం బందోబస్త్ ను ప్రశాంతంగా నిర్వహించామని.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు సజావుగా సాగయని తెలిపారు.

అయితే.. గతేడాదితో పోలిస్తే..రాష్ట్రవ్యాప్తంగా 2 శాతం నేరాల రేటు పెరిగింది. అంటే.. రాష్ట్రవ్యాప్తంగా 8.97 శాతం క్రైమ్ రేట్ పెరిగిందని తెలిపారు. గత ఏడాది 1,95,582 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 2,13,121 కేసులు నమోదు చేశామని డీజీపీ పేర్కొన్నారు. సైబర్ నేరాలు కూడా ఈ ఏడాది గణనీయంగా పెరిగాయి, 2022లో 13,895 కేసులకు గాను 2023లో మొత్తం 16,339 కేసులు నమోదయ్యాయి.
 
నివేదిక ప్రకారం..హత్యలు, దోపిడీ, హత్య, అల్లర్లు, కిడ్నాప్, హింస, చీటింగ్ వంటి కేసులు 2022 కంటే 2023లో పెరిగాయి. హత్య కేసుల విశ్లేషిస్తే.. ఎక్కువ శాతం కేసుల్లో ఆస్తి తగాదాలు, కుటుంబ వివాదాలు, లైంగిక వేధింపులు, అక్రమ సంబంధాలను సంబంధించిన కేసులు నమోదయ్యాయని తెలిపారు.

Latest Videos

స్వలాభం కోసం జరిగిన హత్యల్లో 65 శాతం నిందితులు బాధితులకు తెలిసినవారే. 1,362 కిడ్నాప్ కేసుల్లో కేవలం తొమ్మిది మాత్రమే డబ్బు కోసం చేసినట్లు కనుగొనబడింది. ఈ క్రమంలో అత్యాచారం కేసులకు సంబంధించిన ఓ షాకింగ్ విషయం వెల్లడించారు. 2,284 అత్యాచార కేసుల్లో లైంగిక నేరస్థుడు సన్నిహిత కుటుంబ సభ్యులు, ప్రేమికుడు, స్నేహితుడు లేదా సహోద్యోగి అని తేల్చారు.  

మహిళలపై వేధింపుల కేసులు కూడా పెరిగాయని, ఈ ఏడాది 19013 కేసులు నమోదైనట్టు డీజీపీ వివరించారు. ఇందులో 2,284 రేప్ కేసులుండగా.. 33 వరకట్న హత్యలు, 132 వరకట్న మరణాలు, 9458 వరకట్న వేధింపులు, 213 మహిళ హత్యలు , 884 మహిళ కిడ్నాప్ కేసులు నమోదైనట్టు వెల్లడించారు.

అలాగే.. ఈ ఏడాది 2,426 పోక్సో యాక్స్ కింద కేసులు నమోదయ్యాయనీ, ఇందులో ఒక నిందితుడికి మరణ శిక్ష, 104 మందికి జీవిత ఖైదీ శిక్షలు పడినట్టు డీజీపీ తెలిపారు. అలాగే.. ఈ ఏడాది రోడ్డు ప్రమాద కేసులు కూడా పెరిగాయనీ. ఈ ఏడాది 20,699 కేసులు నమోదు కాగా.. ఇందులో 6,788 మంది మరణించగా.. 19,137 మంది గాయాలబారిన పడినట్టు తెలిపారు.  

ఈ ఏడాది ఎన్‌డిపిఎస్ కింద మొత్తం 1360 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయనీ, గతేడాదితో పోలిస్తే డ్రగ్స్ కేసులు 15.6 శాతం పెరిగాయని తెలిపారు. డ్రగ్స్ కేసుల్లో 2,583 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు 25,260 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. 2023లో రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ/ఎస్టీలపై అట్రాసిటీల నిరోధక కేసులు 1877 నమోదయ్యాయి. 2022తో పోలిస్తే 1.68 శాతం పెరిగాయని తెలిపారు. 

click me!