ధర్మపురి శ్రీనివాస్ వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్ధానం... సామాన్య కార్యకర్త నుండి పిసిసి చీఫ్ వరకు.. 

By Arun Kumar P  |  First Published Jun 29, 2024, 8:59 AM IST

వృద్దాప్యంలో అనారోగ్యంతో బాధపుడుతున్న ధర్మపురి శ్రీనివాాస్ ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఆయన వ్యక్తిగత జీవితం,  రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం....  


Dharmapuri Srinivas Passed Away : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూసారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డి.శ్రీనివాస్ పరిస్థితి ఇవాళ తెల్లవారుజామున మరింత విషమించింది. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆయనను హాస్పిటల్ కు తరలించారు... అయినప్పటికీ ఆయన ప్రాణాలు దక్కలేదు. తెల్లవారుజామున 3 గంటలకు డి.శ్రీనివాస్ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు ప్రకటించారు. 

డి. శ్రీనివాస్ వ్యక్తిగత జీవితం : 

Latest Videos

undefined

భారత  దేశానికి  స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతి ఏడాదే అంటే 1947 సెప్టెంబర్ 27న డి. శ్రీనివాస్ జన్మించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూరు ఆయన స్వస్ధలం. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా స్వస్థలంలోనే సాగింది. ఉన్నత విద్యాభ్యాసం కోసం హైదరాబాద్ చేరుకున్నారు... నిజాం కాలేజీలో డిగ్రీలో చేసారు. 

విద్యాభ్యాసం అనంతరం రాజకీయాలపై మక్కువతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సుదీర్ఘకాలం అందులోనే కొనసాగి అంచెలంచెలుగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ పిసిసి అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. ఎమ్మెల్యేగాను, మంత్రిగానూ, రాజ్యసభ ఎంపీగాను వివిధ పదవుల్లో పనిచేసారు. 

డి.శ్రీనివాస్, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు సంజయ్ తండ్రితో పాటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. గతంలో అతడు నిజామాబాద్ మేయర్ గా పనిచేసారు. ఇక చిన్నకొడుకు ధర్మపురి అరవింద్ బిజెపి లో కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆయన రెండోసారి నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. 

డిఎస్ రాజకీయ ప్రస్థానం :

ధర్మపురి శ్రీనివాస్ రాజకీయ జీవితం సామాన్య కార్యకర్త స్థాయినుండి ప్రారంభమయ్యింది. పార్టీకోసం అహర్నిశలు పాటుపడుతూ తన పొలిటికల్ కెరీర్ ను కూడా నిర్మించుకున్నారు డిఎస్. ఇలా 1989 నాటికి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. మొదటిసారి నిజామాబాద్ అర్భన్ అసెంబ్లీకి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన డిఎస్ టిడిపి అభ్యర్థి డి.సత్యనారాయణను ఓడించారు. ఇలా మొదటిసారి రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టారు... గ్రామీణాభివృద్ది, ఆర్ ఆండ్ బి మంత్రిగా పనిచేసారు.

ఇక 1998 లో అనూహ్యంగా డి.శ్రీనివాస్ కు  ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు దక్కాయి. ఆ తర్వాత 2004 లో మరోసారి ఏపి పిసిసి అధ్యక్షులుగా పనిచేసారు. ఈయన హయాంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది...  వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.   

1999, 2004 లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన డిఎస్  వైఎస్సార్ కేబినెట్ లో ఉన్నత విద్య, అర్బన్ ల్యాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా పనిచేసారు. ఇలా మంత్రిగా పాలనలో, పిసిసి అధ్యక్షుడిగా పార్టీలో కీలక పాత్ర పోషించారు డి.శ్రీనివాస్. ఈయన పిసిసి అద్యక్షుడిగా వుండగానే 2004,2009 లో కాంగ్రెస్ అద్భుత విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. 

అయితే పిసిసి అధ్యక్షుడిగా వుండగానే 2009 అసెంబ్లీ ఎన్నికల్లో డిఎస్ ఓటమిపాలయ్యారు. బిజెపి అభ్యర్థి యెండెల లక్ష్మీనారాయణ ఆయనను ఓడించారు.  తెలంగాణ ఉద్యమంలో యెండెల రాజీనామా చేయగా 2010 లో ఉపఎన్నిక జరిగింది... ఇందులోనూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన డిఎస్ కు ఓటమి తప్పలేదు.  ఇక 2014 లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసారు... ఇందులో బిఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చేతిలో ఓటమిపాలయ్యారు.   

అయితే 2013లో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన డి.శ్రీనివాస్ 2014 లో తెలంగాణ  రాష్ట్ర ఏర్పాటుతర్వాత శాసనమండలి విపక్ష నేతగా పనిచేసారు. 2015లో ఆనాటి సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ తో అనుబంధాన్ని వదిలి బిఆర్ఎస్ (అప్పటి టిఆర్ఎస్) లో చేరారు.  2016 నుండి 2022 వరకు బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులుగా పనిచేసారు. బిఆర్ఎస్ పార్టీతో విబేధాల కారణంగా ఇటీవలే సొంతగూటికి చేరారు డి.శ్రీనివాస్. 

   

 
 
 

click me!