ఏపీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల అన్నా జగన్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతున్నదని ఆగ్రహించారు. వచ్చే నెలలో లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ రావొచ్చని కిసన్ రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి బిల్కిస్ బానో కేసులోని 11 మంది దోషులు లొంగిపోయారు.
Top Stories: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాక వైఎస్ షర్మిల.. ఏపీ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు. ఏపీ ప్రభుత్వం పై విమర్శలు సంధించారు. ఎక్కడ చూసినా మైనింగ్, మద్యం, ఇసుక మాఫియానే ఉన్నదని ఆరోపించారు. దోచుకోవడం, దాచుకోవడమే ఉన్నదని అన్నారు. చంద్రబాబు, జగన్‌లు ఇద్దరూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఫైర్ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రభుత్వం ఆందోళన చేపట్టాలని, ఎంపీలు రాజీనామా చేయాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ అన్నారని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక మరిచిపోయారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో టీడీపీ, వైసీపీలు కంటికి కనిపించని పొత్తు పెట్టుకున్నాయని ఆరోపణలు చేశారు. ఈ రెండు పార్టీల ఎంపీలు ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారా? అని అడిగారు. ఏపీ అభివృద్ధి పట్ల రాహుల్ గాంధీ చిత్తశుద్ధితో ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారని అన్నారు.
వచ్చే నెలలో నోటిఫికేషన్?
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ నెలలో లోక్ సభ ఎన్నికలు జరగొచ్చని వివరించారు. క్రితం సారి ఎన్నికలను పరిశీలిస్తే ఏప్రిల్ నెల మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నదని తెలిపారు. ఇందుకు అనుగుణంగానే వచ్చే నెలలోనే నోటిఫికేషన్ వెలువడవచ్చునని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలోనే ఎన్నికలు ఉండే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. అలాగే.. ఎవరు బాధపడ్డా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు తీసుకోవడం ఖాయం అని అన్నారు. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ కనీసం ఒక్క ఎంపీ సీటును కూడా గెలుచుకునే స్థితిలో లేదని తెలిపారు.
Also Read: Ayodhya: రామ మందిర భక్తులకు అందించే మహా ప్రసాదం ఇదే.. ‘లడ్డూ, సరయూ నీరు సహా.. ’
లొంగిపోయిన బిల్కిస్ దోషులు
2002 బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులోని మొత్తం 11 మంది దోషులు ఆదివారం రాత్రి లొంగిపోయారు. గుజరాత్‌లోని పంచమహల్ జిల్లాలో సబ్ జైలులో వారు లొంగిపోయారు. సత్ర్పవర్తన పేరిట గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం వారిని విడుదల చేయడాన్ని సుప్రీంకోర్టు ఆగ్రహించింది. వెంటనే వారిని సరెండర్ కావాలని ఆదేశించింది. అయితే, పలు కారణాలు చెప్పి తమకు అదనంగా సమయం కావాలని దోషులు విజ్ఞప్తి చేశారు. కానీ, వారి వాదనలలో పస లేదని, వెంటనే వారు లొంగిపోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే బిల్కిస్ బానో దోషులు ఆదివారం రాత్రి జైలు వద్ద లొంగిపోయినట్టు క్రైం బ్రాంచ్ పోలీసు అధికారి వెల్లడించారు.
Also Read: Raja Singh: లోక్ సభ ఎన్నికల్లో రాజాసింగ్ ఆసక్తి.. హైదరాబాద్ సీటు వద్దని.. అక్కడి నుంచి పోటీకి సై
39 ముక్కలు చేస్తాం: మంత్రి వెంకట్ రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల కూడా గడవకముందే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ విమర్శలు మొదలు పె ట్టిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల తర్వాత ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని తాము ఎన్నికల కాలంలోనే ప్రకటించామని గుర్తు చేశారు. 40 రోజులు నిండాయో లేదో బీఆర్ఎస్ పార్టీ విమర్శలు మొదలు పెట్టిందని, ఇది తగదని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీని బొందపెడతామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్ నేతలు పిచ్చి కూతలు కూశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్‌కు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, వారిని 39 ముక్కలు చేస్తామని అన్నారు. పార్టీని ముక్కలు చేస్తామని తెలిపారు.
Also Read: Ayodhya: నీలకంఠ పక్షిని చూడటానికి తరలుతున్న రామ భక్తులు
రాహుల్ యాత్రలో మోడీ నినాదాలు
అసోంలో రాహుల్ గాంధీ జోడో యాత్ర కొనసాగుతుండగా.. కొందరు జై శ్రీరామ్, మోడీ అంటూ నినాదాలు చేశారు. దీంతో రాహుల్ గాంధీ వారికి కూడా ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చారు. ఆ తర్వాత బస్సు ఆపి కిందికి దిగారు. వారితో పాటుగా నడుచుకుంటూ వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ స్వయంగా ట్వీట్ చేశారు. అసోంలో రాహుల్ పర్యటనపై దాడులు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాల నిర్వహణకు ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం.