నిన్నటి దాకా తెలంగాణలో.. ఏపీలో అభివృద్ధి గురించి ఎలా తెలుస్తుంది : షర్మిలకు వైవీ సుబ్బారెడ్డి కౌంటర్

By Siva Kodati  |  First Published Jan 21, 2024, 9:31 PM IST

వైసీపీ, ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. రాష్ట్రంలో కనీసం పర్యటించకుండానే బిల్డింగ్‌లు, రోడ్లు లేవని షర్మిల చెబుతున్నారా అంటూ ఆయన ప్రశ్నించారు.


వైసీపీ, ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. రాష్ట్ర అభివృద్ధి గురించి షర్మిలకు ఏం తెలుసు.. మాతో పాటు వస్తే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూపిస్తామన్నారు. వైఎస్సార్‌కు నిజమైన వారసులు ఎవరో ప్రజలే నిర్ణయిస్తారని ఆయన పేర్కొన్నారు. షర్మిల తొలిసారి రాష్ట్రానికి వచ్చారని, అందువ్ల ఇక్కడి పరిస్ధితులు తెలియదని సుబ్బారెడ్డి దుయ్యబట్టారు. వైఎస్సార్ పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చిన కాంగ్రెస్‌లో , వైఎస్ జగన్‌ను అక్రమంగా జైలులో పెట్టిన కాంగ్రెస్‌లో షర్మిల చేరారని సుబ్బారెడ్డి ఎద్దేవా చేశారు. 

నిన్న మొన్నటి వరకు తెలంగాణ బిడ్డగా ఆ రాష్ట్రంలో తిరిగారని, మరి అక్కడేందుకు పోటీ చేయలేదో తెలియడం లేదన్నారు. షర్మిలే కాదు ఎవరొచ్చినా మా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టలేరని, ఢిల్లీ కాంగ్రెస్‌లో చేరి మమ్మల్ని టార్గెట్ చేయడం సరికాదని సుబ్బారెడ్డి హితవు పలికారు. అవినీతికి పాల్పడిన చంద్రబాబును షర్మిల ప్రశ్నించాలని.. వైసీపీ ఎప్పుడూ బీజేపీతో కాంప్రమైజ్ కాలేదని ఆయన స్పష్టం చేశారు. జనవరి 27న భీమిలో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూర్తిస్తారని, ఈ సభకు 2 లక్షల మంది హాజరవుతారని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. 

Latest Videos

సభను విజయవంతం చేసేందుకు కమిటీల నియామకం, స్థల పరిశీలన పూర్తి చేశామని ఆయన పేర్కొన్నారు. షర్మిల ఎన్ని విమర్శలు చేసినా ఏపీ ప్రజలు జగన్ వెంటే వుంటారని సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కనీసం పర్యటించకుండానే బిల్డింగ్‌లు, రోడ్లు లేవని షర్మిల చెబుతున్నారా అంటూ ఆయన ప్రశ్నించారు. అభివృద్ధి అంటే రోడ్లు, బిల్డింగ్‌లేనా అని వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. 

click me!