సెలవు పై అకున్ సభర్వాల్, డ్రగ్ మాఫియా దెబ్బ

First Published Jul 14, 2017, 1:50 PM IST
Highlights
  • అకున్ సభర్వాల్ కు డ్రగ్ మాఫియా దెబ్బ
  • పది రోజుల సెలవుపై వెళ్లిన అకున్ సబర్వాల్
  • సినీ పరిశ్రమకు చెడ్డపేరు రావొద్దని ఆయనపై సర్కారు చర్య
  • నయీం కేసు మాదిరిగానే డ్రగ్ కేసు మారుతుందా అన్న అనుమానాలు

డ్రగ్ మాఫియా తడాఖా ఏంటో ప్రపంచానికి మరోసారి చాటి చెప్పిన సంఘటన ఇది. ఎంత పెద్ద అధికారి అయినా డ్రగ్ మాఫియాకు జీ హుజూర్ అనాల్సిందే అని నిరూపిస్తోంది ఈ వ్యవహారం. చిల్లర బొల్లర కేసులు పెట్టకుండా బడా బాబులకే ఎసరు పడితే వారు ఊరుకోరని తేల్చి చెప్పిన పరిణామమిది. దీంతో డ్రగ్స్ పై హడావిడి చేసిన అధికారి అకున్ సబర్వాల్ సెలవు పెట్టేయాల్సి వచ్చింది. దీని వెనక చాలా బలమయిన రాజకీయాలున్నాయని చెబుతున్నారు.

 

డ్రగ్ మాఫియా కోరలు పీకుతాడనుకున్న అధికారి సల్లబడ్డారు. కీలకమైన ఈ సమయంలో సెలవు పెట్టి వెళ్లిపోయాడు. దీంతో ఇక డ్రగ్ ముఠాదారులు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ పదిరోజులు సెలవుపై వెళ్తున్నారు. తాను చెబుతున్న మాట ప్రకారం తన పర్సనల్ పనుల కారణంగానే సెలవు పెడుతున్నాడట. కానీ ఇప్పటికే దీనిపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

 

రాష్ట్రంలో డ్రగ్ మాఫియా ఎంతగా విస్తరించిందో బట్టబయలు చేశారు అకున్ సబర్వాల్. స్కూళ్లు, కాలేజీలు, సినీ పెద్దలు, సాఫ్ట్ వేర్ అన్ని రంగాల్లో ఎంతగా మాఫియా విస్తరించిందో దాన్ని పెకిలించే ప్రయత్నం మొదలు పెట్టారు. దీంతో డ్రగ్ ముఠాల జోలికి రావడంతో వారు తమ తడాఖా చూపించారని ప్రచారం సాగుతోంది. ఇక అకున్ సబర్వాల్ తిరిగి విధుల్లో చేరే సరికి ఈ కేసును ఏం చేస్తారన్న అనుమానాలు ఇటు రాజకీయ నేతల్లో అటు జనాల్లో నెలకొన్నాయి.

 

గతంలో నయీం కేసు పెద్ద దుమారం రేపింది. ఎంతో మంది రాజకీయ నాయకుల పేర్లు, పోలీసు బాసుల పేర్లు బయటకొచ్చాయి. వారందరినీ అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటారనుకున్నారు. అందుకోసం సిట్ వేశారు. కానీ తీరా అందరూ మంచివారేనన్నట్లు కేసును మూసేశారు. తీరా ఇప్పుడు డ్రగ్ మాఫియా పగబట్టడంతో ఈ అధికారి కూడా చేతులెత్తేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే అకున్ లీవ్ పెట్టినట్లు వార్తలొస్తున్నాయి.

 

ఇక రాష్ట్ర విభజన నేపథ్యంలో సినీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి తరలివెళ్తుందన్న ప్రచారం గతంలో జోరుగా సాగింది. కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం సినీ పెద్దలతో సత్సంబంధాలను ఏర్పాటు చేసుకుంది. దీంతో సర్కారు అండదండలు ఉన్నాయని నమ్మిన సినీ పెద్దలు ఇక్కడే స్థిరంగా ఉంటామని కూడా పలుమార్లు స్పష్టం చేశారు. గతంలో టిఆర్ ఎస్ నాయకులు ద్వేషించిన వారంత ఇపుడు స్నేహితులయ్యారు.  ఈ స్నేహబంధం దృఢపడేందుకే  సర్కారు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారైనప్పటికీ సినీ పెద్దలెవరైనా మరణించిన సందర్భాలలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించిన దాఖలాలున్నాయి.

 

ఈ నేపథ్యంలో డ్రగ్స్ మాఫియాను పెకిలించే పనికి ఒక అధికారి పూనుకోవడాన్ని సినీ పెద్దలు జీర్ణించుకోలేకపోయారు. సినీ పరిశ్రమ అభాసుపాలయ్యే పరిస్థితి ఉంటే ఇక్కడి నుంచి వెళ్లిపోతారన్న భయంతోనే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగిందన్న ప్రచారం ఉంది. సినీ పెద్దలకు, ప్రభుత్వ పెద్దలకు మధ్య సత్సంబంధాలు చెడిపోకుండా ఉండేందుకే అడ్డుగోడగా ఉన్న పోలీసు అధికారి అకున్ సబర్వాల్ సెలవుపై వెళ్లడం జరిగిపోయిందని అంటున్నారు.

click me!