తెలంగాణలో కాంగ్రెస్ బొటాబొటీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నది. 39 స్థానాలతో బీఆర్ఎస్ కూడా బలమైన ప్రతిపక్షంగా అసెంబ్లీలో ఉండనున్నది. ప్రజాస్వామ్యంలో సుపరిపాలనకు బలమైన ప్రతిపక్షం చాలా ముఖ్యం. ఇది ఇప్పుడు తెలంగాణ ఓటర్ల డెసిషన్. బీఆర్ఎస్‌ను ప్రజలు పూర్తిగా వ్యతిరేకించలేదు.. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ పార్టీకి ప్రధానమైన పాత్రను అప్పగించారు. కాంగ్రెస్‌నే కాదు.. బీఆర్ఎస్‌ను అంతిమంగా తెలంగాణను గెలిపించే తీర్పును రాష్ట్ర ప్రజలు ఇచ్చారు.
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు గెలుచుకుని మ్యాజిక్ మార్క్‌ను దాటింది. 2018లో 88 స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ ఈ సారికి 39 స్థానాలకు పరిమితం అయింది. 65 మంది ఎమ్మెల్యేల(సీపీఐ మద్దతు) మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంలోనూ బీఆర్ఎస్ గెలిచిందనే వాదన ఏమిటీ? అనే కదా మీరు ఆలోచిస్తున్నది.
ఉభయ పార్టీలకూ ప్రాధాన్యత:
undefined
తెలంగాణలో కాంగ్రెస్ హవా బలంగా వీసిందని చెప్పలేం. ఆ పార్టీ మ్యాజిక్ మార్క్ కంటే నాలుగు స్థానాలు అధికంగా గెలుచుకుంది. బీఆర్ఎస్ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదు. 39 స్థానాలతో బలంగానే అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నది. ప్రత్యేక తెలంగాణ సిద్ధించిన తర్వాత తొలి రెండు సార్లు అధికారాన్ని చేపట్టిన బీఆర్ఎస్‌కు ప్రజలు విరామం ఇవ్వాలని అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి సాదాసీదా మెజార్టీ ఇచ్చారు. దీంతో ఉభయ పార్టీలనూ విర్రవీగకుండా అదుపులో పెట్టారు.
Also Read : Janasena Party: అన్ని స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు.. తెలంగాణలో జనసేన ఫ్లాప్ షో
తెలంగాణ విజయం:
ప్రజాస్వామ్యంలో అధికార పక్షంతోపాటు బలమైన ప్రతిపక్షం చాలా అవసరం. అలాగైతేనే ప్రభుత్వాన్ని తప్పిదాలు చేయకుండా కట్టడి చేయడం, దారి తప్పకుండా సరైన పద్ధతిలో నడిపించడం వీలవుతుంది. తద్వార ప్రజాస్వామ్యంలో ప్రజలు విజేతలు అవుతారు. పాలకులు సేవలకు అవుతారు. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతున్నది. కొత్త రాష్ట్రంలో రెండు సార్లు అధికారాన్ని చేపట్టిన బీఆర్ఎస్‌కు రాష్ట్రం గురించి సమగ్రమైన అవగాహన ఉంటుంది. ఆదాయవనరులు, రాబడులు, సంక్షేమం, ఇతర అంశాల గురించి తెలిసి ఉంటుంది. కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టినా కొత్త రాష్ట్రం కావడం, కొత్త నాయకత్వం కావడం, బొటాబొటీ మెజార్టీ రావడంతో దుస్సాహసాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు దాదాపు ఉండవు. ఒక వేళ ప్రయత్నించినా బీఆర్ఎస్ బలంగా అడ్డుకోగలుగుతుంది.
Also Read: Kothagudem Election Results 2023:తెలంగాణ అసెంబ్లీలో మరోసారి కమ్యూనిస్టు గళం
బీఆర్ఎస్ విజయం ఎలా?:
నిజానికి ఇది బీఆర్ఎస్ విజయం కూడా. ప్రత్యేక తెలంగాణ కోసం పుట్టిన బీఆర్ఎస్.. రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికీ కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు తెలంగాణ సంక్షేమం, అభివృద్ధే తమకు ప్రాధాన్యం అని చెబుతారు. సాదాసీదా మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వం, బలమైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ అసెంబ్లీలో ఉండటం తెలంగాణ ప్రజలకు ఉపకరించేదే. ఇది పరోక్షంగా బీఆర్ఎస్ చెబుతున్న లక్ష్యాలను కూడా నెరవేర్చేదే.. కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ గెలుపు కూడా అని చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్‌ను ప్రజలు తృణీకరించలేదు. ఆ పార్టీని మెజార్టీకి ఆమడ దూరంలో నిలిపి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే మార్గాన్ని ప్రజలు తెరిచే ఉంచారు. రెండు పర్యాయాలు ప్రభుత్వాన్ని చేపట్టినా.. ఆ పార్టీకి ప్రజలు కీలక పాత్రనే అప్పగించారు.