
NOTA Votes in telangana assembly elections 2023 : తెలంగాణ ప్రజలందరూ ఉత్కంఠ భరితంగా ఎదురుచూసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన విధంగానే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించింది. అధికార బీఆర్ఎస్ ఇక నుంచి ప్రతిపక్ష పాత్ర పోషించనుంది. అధికారం చేపట్టాని శాయశక్తులా ప్రయత్నించిన బీజేపీ మూడో స్థానానికి పరిమితం అయ్యింది. ఎంఐఎం ఎప్పటిలాగే తన సీట్లను పోగొట్టుకోకుండా నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.
ఈ ఎన్నికల్లో పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. కొన్ని చోట్ల ఓటమే ఎరుగని నేతలను సామాన్యులు ఓడించారు. రెండు చోట్ల సీఎం అభ్యర్థులు ఓడిపోయారు. ఎన్నడూ లేని విధంగా బీజేపీ ఈ సారి 8 స్థానాలను గెలుచుకుంది. అలాగే తన ఓటు శాతాన్ని కూడా పెంచుకుంది. ఉమ్మడి ఏపీ చరిత్రలో ఇంత ఎవరూ ఎప్పుడూ రానన్ని సీట్లు ఈ సారి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.
ఇదిలా ఉండగా.. ఈ సారి ఎన్నికల్లో నిలబడ్డ నాయకులెవరూ తమకు నచ్చలేదని దాదాపు 1.68 లక్షల మంది తీర్పు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సారి ఎన్నికల్లో 1,68,256 ఓట్లు నోటా ఓట్లు పోలయ్యాయి. ఇందులో అత్యధికంగా కుత్బుల్లాపూర్ లోనే ఉన్నాయి. ఇక్కడ నోటాకు 4,079 నోటా ఓట్లు నమోదు కాగా, అత్యల్పంగా జుక్కల్ నియోజకవర్గంలో 469 ఓట్లు పడ్డాయి.
ఉత్కంఠభరితంగా సాగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులపై తమ అసంతృప్తిని తెలియజేసేందుకు అనేక నియోజకవర్గాల్లో పలువురు ఓటర్లు నోటా ఆప్షన్ ను ఎంచుకున్నారు. దాదాపు 26 నియోజకవర్గాల్లో నోటా నాలుగో స్థానంలో నిలిచింది.
25 నియోజకవర్గాల్లో ఐదో స్థానంలో నిలిచింది. మేడ్చల్ లో 3,737, అచ్చంపేటలో 2,419, బోథ్ లో 2,313, నిజామాబాద్ రూరల్ లో 2,268, దుబ్బాకలో 2,252 ఓట్లు పోలయ్యాయి.
అచ్చంపేట, అంబర్ పేట, ఆర్మూర్, బోథ్, దుబ్బాక, ఖైరతాబాద్, ఖానాపూర్, కూకట్ పల్లి, ఎల్బీనగర్, మల్కాజిగిరి, మేడ్చల్, ముషీరాబాద్, నర్సాపూర్, నిర్మల్, నిజామాబాద్ అర్బన్, పాలకుర్తి, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, సనత్ నగర్, సికింద్రాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, శేరిలింగంపల్లి, ఉప్పల్, వరంగల్ తూర్పు, వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో నోటా నాలుగో స్థానంలో నిలిచింది. అలంపూర్, బెల్లంపల్లి, భువనగిరి, చెన్నూర్, చేవెళ్ల, దేవరకొండ నియోజకవర్గాల్లో నోటాకు ఐదో అత్యధిక ఓట్లు వచ్చాయి. కాగా.. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 2,24,709 ఓట్లు నోటాకు పడ్డాయి.