Feroz Khan : తెలంగాణ కాంగ్రెస్ లో యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా పేరున్న ఫిరోజ్ ఖాన్ కు కొత్త మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన నాంపల్లి స్థానం నుంచి ఎంఐఎం అభ్యర్థి చేతిలో ఓడిపోయినప్పటికీ.. కాంగ్రెస్ ఆయనను మంత్రి వర్గంలోకి ఎందుకు తీసుకుంటుందంటే ?
telangana election results 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. సీఎం ఎవరవుతారనే విషయంలో చర్చ జరుగుతోంది. దీని కోసం ప్రస్తుతం సీఎల్పీ సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో సీఎల్పీ నాయకుడిగా ఎన్నికైన నేతనే సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే కేబినేట్ ఎవరెవరు ఉంటారనే విషయం కూడా త్వరలోనే ఓ కొలిక్కి రానుంది.
కాగా.. ఈ కేబినెట్ లోకి కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ ను తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందలేదు. నాంపల్లి నుంచి పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్.. ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ మాజిద్ హుస్సేన్ చేతిలో 2037 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినప్పటికీ ఆయనకు తెలంగాణ మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
undefined
హైదరాబాద్ పాతబస్తీలో పరిధిలో కాంగ్రెస్ యంగ్ లీడర్ గా పేరు పొందిన ఫిరోజ్ ఖాన్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ఎన్నికల సంఘం సమన్వయ కమిటీ చైర్మన్ జి.నిరంజన్ సూచించారని తెలుస్తోంది. మంత్రి పదవి ఇవ్వడానికి కూడా ఆయన హేతుబద్దమైన కారణాలను ఎత్తి చూపారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలో జయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్, సికింద్రాబాద్ ల పరిధిలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.
దీంతో ఫిరోజ్ ఖాన్ కు మంత్రి పదవి ఇస్తే ఈ రెండు జిల్లాలతో పాటు ముఖ్యంగా పాతబస్తీలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకునే అవకాశం ఉంది. అనేక సమస్యలపై పోరాడే ఆయనను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుని మైనారిటీ వర్గంలో పార్టీ ప్రతిష్టను బలోపేతం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాగా.. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నాంపల్లి స్థానం తమకే దక్కుతుందని ధీమాగా ఉంది. కానీ ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ మాజిద్ హుస్సేన్ చేతిలో 2037 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఎన్నికల ఫలితాల్లో మాజిద్ హుస్సేన్ కు 62,185 ఓట్లు రాగా, మహ్మద్ ఫిరోజ్ ఖాన్ కు అనుకూలంగా 60,148 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో ఎంఐఎం, బీఆర్ఎస్ చెరో 7 స్థానాలను గెలుచుకోగా, బీజేపీ ఒక స్థానాన్ని గెలుచుకుంది. అయితే మెజారిటీ సీట్లను సాధించి తెలంగాణలో తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న కాంగ్రెస్ పార్టీ.. ఫిరోజ్ ఖాన్ కు మంత్రి పదవి ఇస్తుందా అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం దొరకనుంది.