యమునా ఎక్స్‌ప్రెస్ వేపై ‘వివో’ నూతన ప్రాజెక్ట్

By rajesh yFirst Published Nov 26, 2018, 10:28 AM IST
Highlights

భారతదేశంలో పూర్తిస్థాయిలో సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ వివో. ఇందుకోసం యమునా ఎక్స్ ప్రెస్ వే ఇండస్ట్రీయల్ అథారిటీ పరిధిలో 169 ఎకరాల భూమిని సదరు అథారిటీ కేటాయించింది. దీనివల్ల 25 వేల మందికి, రెండో దశలో మరో 15 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. 

న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘వివో’ భారత్ అనుబంధ సంస్థ వివో ఇండియా సేవలు భారతదేశంలో పూర్తిస్థాయిలో త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. యమునా ఎక్స్‌ప్రెస్ వే ఇండస్ట్రీయల్ అథారిటీ (వైఈఐడీఏ) పరిధిలో 169 ఎకరాల భూమిని కేటాయించారు. ఇది ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం గౌతం బుద్ధ నగర్ జిల్లాలో ఉంది. దీని విలువ రూ.3,500 కోట్లు ఉంటుందని అంచనా.  చైనాలోని డోంగువాన్ నగరం కేంద్రంగా ప్రధానంగా కార్యకలాపాలు సాగిస్తున్న వివో.. భారతదేశంలో గ్రేటర్ నొయిడా పరిధిలో గల 50 ఎకరాల విస్తీర్ణంలోని కార్యాలయం వేదికగా కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ సంస్థ ఏటా 24 లక్షల మొబైల్ ఫోన్లను తయారు చేస్తోందని వైదా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అరుణ్ వీర్ సింగ్ తెలిపారు. 

భారతదేశంలో ఉత్పత్తి సామర్థ్యం పెంచుకునేందుకు, తన పరిధిని విస్తరించుకునేందుకు భూమి కేటాయించాలని దరఖాస్తు చేసుకున్నదని వైదా సీఈఓ అరుణ్ వీర్ సింగ్ చెప్పారు. దీంతో 169 ఎకరాలు కేటాయించడం జరిగింది. తొలి దశలో రూ.3500 కోట్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. తొలి ఏడాదిలోనే 25 వేల కొత్త కొలువులు రానున్నాయి. 30 శాతం మంది స్థానికులకే ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత సంస్థ యాజమాన్యానిదే. అయితే నైపుణులు, విద్యార్హతలు ఉన్న వారికే అవకాశాలు లభించనున్నాయి. రెండో దశలో సంస్థ విస్తరణకు మరో 200 ఎకరాలు అవసరం. దీనికి మరో రూ.3,500 కోట్లు పెట్టుబడి పెడుతుండగా, అదనంగా 15 వేల ఉద్యోగాలు లభిస్తాయి. 

యమునా ఎక్స్ ప్రెస్ వే ఇండస్ట్రీయల్ అథారిటీ (వైదా) పరిధిలో ఇంకా ఒప్పోతోపాటు కనీసం 12 మొబైల్ ఫోన్లకు సంబంధించిన కంపెనీలు, సాఫ్ట్ వేర్ సంస్థలు, విడి భాగాల సంస్థలు భూమి కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఆయా సంస్థలు సమర్పించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)లను పరిశీలించి, తనిఖీ చేసిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. 

ఎంటీ అండ్ టీ, రాజ్ కార్పొరేషన్‌ చెరో ఐదేసి ఎకరాలు, కేసర్వానీ కండక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 1.25 ఎకరాల భూమి కేటాయించడం జరిగింది. 100 కంపెనీలతో కూడిన హ్యాండ్లూమ్ క్లస్టర్ కూడా వైదా పరిధిలో కొలువు దీరనున్నది. ఇందుకోసం 200 ఎకరాల భూమికి కేటాయించడం జరిగింది. మరో 100 ఎకరాల విస్తీర్ణంలో 50 కంపెనీలతో కూడిన హ్యాండీ క్రాఫ్ట్ క్లస్టర్ ఏర్పాటు కానున్నదని వైదా సీఈఓ అరుణ్ వీర్ సింగ్ తెలిపారు. 

click me!