యాపిల్‌తో అమెజాన్‌ జట్టు: ఇక నేరుగా ఐఫోన్లు, ఐపాడ్స్ సేల్స్

By rajesh yFirst Published Nov 10, 2018, 12:52 PM IST
Highlights

టెక్నాలజీ దిగ్గజం ఆపిల్, ఆన్ లైన్ రిటైల్ మేజర్ అమెజాన్ జట్టు కట్టాయి. తమ మార్కెట్ విస్తరణ లక్ష్యంగా భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం అమెజాన్ స్టోర్లలో యాపిల్ సంస్థ తయారు చేసే ఐఫోన్లు, ఐప్యాడ్లు కొనుగోలు చేయొచ్చు.

ఇటీవల శామ్ సంగ్, చైనా మొబైల్ దిగ్గజాలు వన్ ప్లస్, జియామీ వంటి సంస్థల నుంచి వస్తున్న పోటీతో తన నూతన ఉత్పత్తులు ఐఫోన్, ఐపాడ్స్ విక్రయాలు తగ్గిన సంగతి పరిగణనలోకి తీసుకున్నది టెక్నాలజీ దిగ్గజం ఆపిల్. తన విక్రయాలను పెంచుకునేందుకు అవసరమైన నూతన మార్గాలన్నీ అన్వేషిస్తోంది. ఈ క్రమంలో ఆన్ లైన్ రిటైల్ దిగ్గజం ‘అమెజాన్‌’తో ఆపిల్ కీలక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది. 

రానున్న హాలిడే షాపింగ్‌ సీజన్‌ దృష్ట్యా తమ మధ్య వైరాన్ని సైతం పక్కన బెట్టి మరీ ఒక  ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ మేరకు నవంబర్ 9న అమెజాన్‌ ఒక ప్రకటన జారీ చేసింది.  రానున్న వారాల్లో ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ ఉత్పత్తులను తమ ప్లాట్‌ఫాంలో విక్రయిస్తామని తెలిపింది. దీని ప్రకారం ఐఫోన్ ఎక్స్‌ఆర్‌, ఎక్స్‌ఎస్‌,  ఎక్స్‌ఎస్‌ మాక్స్‌లాంటి  తాజా ఆపిల్ ఉత్పత్తులతో పాటు ఐప్యాడ్‌, ఆపిల్‌ వాచ్‌, ఆపిల్‌ టీవీలను అమెజాన్‌ ద్వారా  అందుబాటులోకి తెస్తుంది.

ఇప్పటివరకు థర్డ్‌పార్టీ సెల్లర్‌గా మాత్రమే ఆపిల్‌ ఉత్పత్తులను విక్రయించిన అమెజాన్‌ తాజా ఒప్పందం ప్రకారం నేరుగా వీటిని అమ్మనుంది. దీంతో 2019, జనవరి 4 నుంచి ప్రస్తుతం అమెజాన్లో ఆపిల్ ఉత్పత్తులను విక్రయిస్తున్న ఇతర కంపెనీలు తమ లిస్టింగ్‌లను తొలగించనున్నాయి. అయితే ఇందులో చిన్న మినహాయింపు కూడా ఉంది. ఆపిల్‌ హోం ప్యాడ్‌ స్మార్ట్‌ స్పీకర్‌ మాత్రం అమెజాన్‌ సైట్‌లో లభ్యం కాదు. అమెజాన్ అంతర్జాతీయంగా తన మార్కెట్‌ను నిరంతరం విస్తరించడమే లక్ష్యంగా ఆపిల్ సంస్థతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. 

భారత్‌తోపాటు అమెరికా,  బ్రిటన్‌, జపాన్‌, ఫ్రాన్స్‌, జర‍్మనీ,  ఇటలీ, స్పెయిన్‌ దేశాల్లో ఐఫోన్లు, ఐప్యాడ్లు తదితర ఆపిల్‌ లేటెస్ట్‌ ఉత‍్పత్తులను విక్రయించనున్నట్టు చెప్పింది.  విక్రయాలను పెంచుకునే లక్ష‍్యంతో ఈ డీల్‌ కుదుర్చుకున్నట్టు ఆపిల్‌ వెల్లడించింది.  ఆపిల్ కస్టమర్లకు  మరింత దగ్గరయ్యేందుకు అమెజాన్‌తో కలిసి పనిచేస్తున్నామని ఆపిల్ ప్రతినిధి నిక్ లీ తెలిపారు. ఐఫోన్, ఐప్యాడ్, ఆపిల్ వాచ్, మాక్ తదితర తమ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు యూజర్లకు మరో గొప్ప అవకాశాన్ని అందిస్తున్నట్టు చెప్పారు.
 

click me!