పాపులర్ బ్రాండ్ మన ‘జియో’.. బట్ గూగుల్ ఫస్ట్

By telugu teamFirst Published Jun 8, 2019, 9:15 AM IST
Highlights

ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ జియో కీర్తి కిరీటంలో మరో రికార్డు వచ్చి చేరింది. అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్‌గా  రిలయన్స్‌ జియో​ నిలిచింది. కాకపోతే సెర్చింజన్ గూగుల్ మొదటి స్థానంలో నిలిచింది. ఎయిర్ టెల్ ఫేస్ బుక్ లను జియో పక్కకు నెట్టేసింది.

ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో మరో రికార్డును  సొంతం చేసుకుంది. జియో భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్లలో  రెండవ స్థానాన్ని పొందింది. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది.

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ను వెనక్కి  నెట్టి మరీ జియో ఈ ఘనతను సాధించింది​.  ఐపోసిస్ 2019 సర్వే  లెక్కల ప్రకారం  మరో టెలికాం దిగ్గజం, జియో ప్రధాన పోటీదారు భారతి ఎయిర్‌టెల్‌  8వ స్థానంతో సరిపెట్టుకున్నది. 

గత ఏడాది సర్వేలో భారత్‌లోని మోస్ట్ పాపులర్ బ్రాండ్‌ జాబితాలో రిలయన్స్ జియో మూడో స్థానంలో నిలిచింది. తొలి రెండు స్థానాల్లో గూగుల్, ఫేస్‌బుక్ నిలిచాయి.2016 టెలికాం మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన జియో మూడేళ్లలోనే పలు రికార్డులు సృష్టించింది.

30 కోట్లకు పైగా యూజర్లతో  జియో సంచలనం సృష్టించగా,  తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కాగా టాప్ టెన్‌  టెక్నాలజీకి సంస్థల్లో ఒకటిగా జియో నిలిచింది.

విజయ్ శేఖర్ శర్మ నేతృత్వంలోని డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎం మూడవ స్థానం, మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని ఫేస్‌బుక్‌ నాలుగు, జెఫ్ బెజోస్ నేతృత్వంలోని అమెజాన్ ఐదవ స్థానం దక్కించుకున్నాయి. లోకల్ బ్రాండ్స్ టాప్ 10లో చోటు దక్కించుకోవడం విశేషమని  ఐపోసిస్ మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ గుప్తా చెప్పారు.  

ఇక టాప్ 5లో గ్లోబల్ బ్రాండ్స్‌ తో పోటీపడి  దేశీయ బ్రాండ్స్ తమ ప్రత్యేకతను చాటుకున్నాయి. టాప్ 10లో నాలుగు దేశీయ బ్రాండ్స్ నిలిచాయి. రిలయన్స్ జియో, పేటీఎంలతో పాటు ఎయిర్‌టెల్, ఫ్లిప్‌కార్ట్ ఉన్నాయి. శాంసంగ్ 6వ స్థానంలో, బిల్‌గేట్స్ నేతృత్వంలోని మైక్రోసాఫ్ట్ 7వ స్థానంలో, యాపిల్ ఐఫోన్ 9వ స్థానంలో నిలిచాయి. ఎయిర్‌టెల్ 8వ స్థానంలో, ఫ్లిప్‌కార్ట్ 10వ స్థానంలో ఉన్నాయి. 

click me!