జియో నుండి స్మార్ట్ పోన్...అగ్రస్థానమే లక్ష్యంగా

By Arun Kumar PFirst Published Dec 15, 2018, 3:56 PM IST
Highlights

స్మార్ట్ ఫోన్ల రంగంలోకి అడుగు పెట్టాలని రిలయన్స్ జియో సంకల్పించింది. ఇందుకోసం అమెరికా సంస్థ ఫ్లెక్స్ మేనేజ్మెంట్‌తో సంప్రదింపులు జరుపుతోంది. అదే జరిగితే 2022 నాటికి సబ్ స్క్రైబర్ల వినియోగంలో రిలయన్స్ రారాజు కానున్నది.
 

న్యూఢిల్లీ: ఒకటి తర్వాత మరొకటి సాధిస్తూ లక్ష్య సాధనలో ముందుకు వెళుతున్న రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.. ఆ దిశగా మరో అడుగు ముందుకేయనున్నారు. జియో ఇన్ఫో కమ్యూనికేషన్స్ నుంచి స్మార్ట్ ఫోన్  ఆవిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం అమెరికా కాంట్రాక్ట్ ఉత్పాదక సంస్థ ‘ఫ్లెక్స్’తో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సంప్రదిస్తోంది. 10 కోట్ల స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తి కోసం ఇరు సంస్థలు చర్చించినట్లు సమాచారం. 

టెలికం రంగంలో సేవలు ప్రారంభించిన అనతి కాలంలోనే శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్న ముకేశ్ అంబానీ రిలయన్స్ జియో.. సారధ్యంలోని వినియోగదారులంతా దాదాపు ఫీచర్ పోన్లనే వాడుతున్నారు. శరవేగంగా దూసుకెళుతున్న మార్కెట్లో పూర్తిగా పాగా వేసేందుకు తమ పేరిట స్మార్ట్ ఫోన్ల కోసం భారీ ఆర్డర్ ఇచ్చేందుకు రిలయన్స్ జియో సన్నద్ధమవుతోంది. 

అయితే ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి పన్ను రాయితీ కోసం ఫ్లెక్స్ ప్రయత్నిస్తున్నది. దీనిపై స్పందించేందుకు ఫ్లెక్స్ గానీ, రిలయన్స్ జియో ప్రతినిధులు గానీ ప్రతిస్పందించలేదు. కానీ చెన్నైలోని ప్రత్యేక ఎకనమిక్ జోన్ (సెజ్)లో గల యూనిట్ నుంచి నెలకు 40-50 లక్షల ఫోన్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉన్నది ఫ్లెక్స్. 

డ్యూటీలు విధించకుండా దేశీయ ధరలకు అనుగుణంగా ఈ స్మార్ట్ ఫోన్లను విక్రయించ తలపెట్టింది ఫ్లెక్స్. డీటీఏలోని సెజ్‌లో ఉత్పత్తి చేసే వస్తువులు, హ్యాండ్ సెట్ల ధరలు చౌకగా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సుంకాలు విధించొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ ఫ్లెక్స్ సంస్థతో ఒప్పందం కుదిరితే జియో ఫీచర్ ఫోన్ వినియోగదారులైన 50 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ల వైపు మళ్లే అవకాశం ఉన్నది. 

శరవేగంగా మార్కెట్ వాటా పెంపొందించుకోవాలన్నదే రిలయన్స్ జియో వ్యూహం అని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డేటా పేర్కొంది. దీని ప్రకారం 2016లో 118 మిలియన్ల స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేస్తే, 2017లో అది 134 మిలియన్లకు చేరుకున్నది. ఇది కూడా భారతదేశంలోనే కావడం గమనార్హం. 

ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక ప్రకారం వొడాఫోన్ ఆదాయంలో అతిపెద్ద సంస్థ. దాని వాటా 32.8 శాతం కాగా, ఎయిర్ టెల్ఆదాయం 30.9 శాతం, మూడో స్థానంలో ఉన్న రిలయన్స్ జియో వాటా 26.1 శాతం మాత్రమే. కానీ జియో శేరవేగంగా లబ్ది పొందాలని భావిస్తోంది. 

ప్రత్యర్థి సంస్థలతో పోలిస్తే రిలయన్స్ గ్రామీణ మార్కెట్, ట్రి టైర్ పట్టణాల్లో విస్తరిస్తోంది. ఇటీవల ప్రకటించిన రిలయన్స్ జియో మాన్ సూన్ హంగామా ఆరు నెలలకు రూ.1000 రీచార్జి కూడా సక్సెస్ అయింది. 

సెప్టెంబర్ నాటికి 252 మిలియన్లకు పైగా సబ్ స్క్రైబర్లను  కలిగి ఉన్న జియో.. ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా ఖాతాదారుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2021 నాటికి జియో అగ్రస్థానంలోకి చేరుతుంది. 2022లో సబ్ స్క్రైబర్లతో జియో మొదటి స్థానానికి చేరుకుంటుంది.

రిలయన్స్ జియో ప్రస్తుతం 28 శాతం రెవెన్యూ కలిగి ఉన్నదని భావిస్తున్నారు. ప్రస్తుతం ఫీచర్ ఫోన్ వినియోగదారులు రూ.2000-రూ.2,500 సెగ్మెంట్లోకి మారతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫీచర్ ఫోన్ వినియోగదారుల్లో 60 శాతం మంది తమను తాము అప్ గ్రేడ్ చేసుకునే అవకాశం ఉన్నదని చెబుతున్నారు. 

click me!