స్మార్ట్‌ఫోన్ లేకుండా సెకను ఉండలేకపోతున్న భారతీయులు

By sivanagaprasad kodati  |  First Published Jan 27, 2019, 11:50 AM IST

ఒకప్పుడు ఫోన్ వాడాలంటేనే భయం. కానీ ఇప్పుడు ఇంట్లో ఎన్ని స్మార్ట్ ఫోన్లు ఉన్నాయన్నఅంశం ప్రధానంగా మారింది. అంతగా భారతీయులు స్మార్ట్ ఫోన్లకు, టెక్నాలజీకి దగ్గరవుతున్నారు. దీనికి తోడు వివిధ స్మార్ట్ ఫోన్ల తయారీ దారులు రకరకాల ఫీచర్లతో అందుబాటులోకి తెస్తున్న నూతన మోడల్ ఫోన్లను భారతీయులు కొనేస్తున్నారు.


భారత స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌ జోరుగా వృద్ధి చెందుతోంది. పలు స్మార్ట్ ఫోన్ల కంపెనీలు విభిన్న మోడళ్లను అందుబాటులోకి తెస్తుండటంతో మొబైల్స్‌ కొనుగోలుదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా 2017తో పోలిస్తే 2018లో స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు 10 శాతం మేర పెరిగి 14.5 కోట్లకు చేరుకున్నాయి. 

గత ఏడాదిలో మొత్తంగా అమ్ముడయిన 33 కోట్లకు పైగా మొబైల్‌ ఫోన్లలో స్మార్ట్‌ఫోన్ల వాటా దాదాపు 44 శాతంగా ఉంది. గత ఏడాదిలో చైనా, అమెరికా మార్కెట్లలో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు తగ్గాయి. అందుకే ప్రధాన మార్కెట్లలో భారత స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌ శరవేగ వృద్ధిని నమోదు చేసుకుందని  కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ నివేదిక వెల్లడించింది. .
 
స్మార్ట్‌ఫోన్ల హవాతో ఫీచర్‌ ఫోన్లకు గిరాకీ తగ్గుతోందని చాలా మంది భావించారు. కానీ గత ఏడాదిలో స్మార్ట్‌ఫోన్లకన్నా ఫీచర్‌ ఫోన్ల అమ్మకాల్లో ఒక శాతం అధికంగా (11 శాతం) వృద్ధి నమోదైంది. ఏడాదిలో 18.5 కోట్లకన్నా ఎక్కువగా ఫీచర్‌ ఫోన్లు అమ్ముడయ్యాయి. 

Latest Videos

undefined

4జీ స్మార్ట్‌ఫోన్‌ జియోఫోన్‌ను తక్కువ ధరలో అందిస్తున్న రిలయన్స్‌ జియో వల్ల ఫీచర్‌ ఫోన్ల మార్కెట్లో వృద్ధి కొనసాగుతోంది. గత ఏడాదిలో ఈ కంపెనీ మార్కెట్‌ వాటా 38 శాతం. ఫీచర్‌ ఫోన్లను విక్రయిస్తున్న అగ్రస్థాయి కంపెనీల్లో శామ్‌సంగ్‌, లావా, ఐటెల్‌, హెచ్‌ఎండీ (నోకియా) ఉన్నాయి. ఫీచర్‌ ఫోన్ల మార్కెట్‌ విషయంలో భారత్‌ ప్రపంచ మార్కెట్లలో అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. 

పశ్చిమాసియా దేశాల్లోనూ ఫీచర్‌ ఫోన్లకు ఎక్కువగా గిరాకీ ఉంది. గత ఏడాదిలో ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడై ఫీచర్‌ ఫోన్లలో భారత్‌, పశ్చిమాసియా దేశాల వాటాయే నాలుగింట మూడొంతులు ఉండటం విశేషం. దీన్ని బట్టి భారత్‌లో ఇంకా ఫీచర్‌ ఫోన్లకు మార్కెట్‌ అవకాశాలు ఉన్నాయని స్పష్టమవుతున్నట్టు పరిశ్రమ పరిశీలకులు చెబుతున్నారు.
 
స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో చైనా కంపెనీ జియోమీ దూకుడుగా వెళుతోంది. గత ఏడాదిలో ఈ కంపెనీ మార్కెట్‌ వాటా 28 శాతంగా ఉండటంతో నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచింది. 24 శాతం వాటాతో శామ్‌సంగ్‌ రెండో స్థానంలో నిలిచింది.

వివోకు 10 శాతం, ఒప్పోకు 8 శాతం, మైక్రోమాక్స్‌కు 5 శాతం వాటా ఉంది. 2018 డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో జియోమీ మార్కెట్‌ వాటా 27 శాతం, శామ్‌సంగ్‌ వాటా 22 శాతం, వివో వాటా 9 శాతం, రియల్‌ మీ వాటా 8 శాతం, ఒప్పో వాటా 7 శాతంగా ఉంది.

కంపెనీల రాబడిపరంగా చూస్తే గత ఏడాదిలో వృద్ధి 19 శాతంగా నమోదైంది. రాబడి విషయంలో సామ్‌సంగ్‌, షామీ, వివో, ఒప్పో, యాపిల్‌ ముందు వరుసలో ఉన్నాయి. 58 శాతం వృద్ధితో వన్‌ప్లస్‌ శరవేగంగా వృద్ధి చెందిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌గా నిలిచింది.

ఇక రూ.20,000-రూ.30,000 మధ్య ధరల్లో ఉన్న స్మార్ట్‌ఫోన్లకు ఎక్కువ గిరాకీ ఉంది. ఈ విభాగంలో వృద్ధి 53 శాతంగా నమోదైంది. వివో, ఒప్పో, సామ్‌సంగ్‌ వంటి కంపెనీలకు ఈ విభాగంలో మంచి పట్టుంది. రూ.10,000-రూ.15,000 మధ్య ధర విభాగంలో వేగవంతమైన వృద్ధి నమోదైంది. 

దేశీయంగా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్ల ద్వారా స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు జోరుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే గత ఏడాదిలో ఆన్‌లైన్‌ వాటా 36 శాతానికి చేరుకుంది. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ వంటి కంపెనీలు పెద్ద ఎత్తున ఆఫర్లను ఇస్తూ స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు పెరిగేందుకు దోహదపడ్డాయి.
 
స్మార్ట్‌ఫోన్లలోని అప్లికేషన్ల ద్వారా అనేక రకాల పనులు చక్కబెట్టుకునే అవకాశం ఉండటంతోనే వీటి అమ్మకాలు పెరిగేందుకు అవకాశం ఏర్పడుతోంది. ఇంటర్నెట్‌, నగదు బదిలీ, రీచార్జ్‌లు, సినిమా టికెట్ల బుకింగ్‌, సోషల్ మీడియా, ఆడియా, వీడియోలు తదితరాలకు స్మార్ట్‌ఫోన్ల వినియోగం తప్పనిసరిగా మారిపోతోంది.

ఇక దేశంలో యువతరం శాతం అధికంగా ఉండటంతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి రాగానే దాన్ని కొనేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మరోవైపు ఫీచర్‌ ఫోన్లను వాడుతున్న వారూ స్మార్ట్‌ఫోన్లకు మారిపోతున్నారు. ఒక్కో ఇంట్లో మూడు నాలుగు స్మార్ట్‌ఫోన్లు ఉంటున్నాయి. ఇదే స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌ వృద్ధికి దోహదపడుతోందని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.

click me!