దటీజ్ ‘భాగ్యనగరి’స్పెషల్: ప్రపంచంలోనే అతిపెద్ద వన్‌ప్లస్ స్టోర్ ఫెసిలిటీ

By rajesh yFirst Published May 16, 2019, 11:08 AM IST
Highlights

భాగ్యనగర శిఖలో మరో కలికితురాయి చేరనున్నది. చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ ‘వన్ ప్లస్’ మన హైదరాబాద్ నగరంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద స్టోర్ రూమ్ నిర్మించనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి వస్తుందంటూ భవన డిజైన్లను విడుదల చేసింది.
 

 హైదరాబాద్‌: చైనా స్మార్ట్‌ఫోన్‌​ దిగ్గజ  బ్రాండ్‌ వన్‌ప్లస్‌ ప్రపంచంలోనేఅతిపెద్ద వన్‌ప్లస్‌ స్టోర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది.  ఈ విషయాన్ని చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ స్వయంగా వెల్లడించింది. ఈ సంస్థ మంగళవారం వన్‌ప్లస్‌ 7, 7 ప్రో ఫోన్లను మార్కెట్లో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ స్టోర్‌ ఏర్పాటు సంగతి కంపెనీ సీఈఓ పెటె లావ్‌ తెలిపారు.

ఈ ఏడాది చివరి నాటికి ఈ స్టోర్‌ను ఏర్పాటుచేయనున్నట్లు కంపెనీ తెలిపింది. స్టోర్‌ డిజైన్‌కు సంబంధించిన ఓ ఫోటోను వన్‌ప్లస్‌ ఇండియా ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. 16వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు అంతస్తుల భవనంలో ఈ స్టోర్‌ను నిర్మించనున్నారు. 

నాటి, నేటితరం టెక్నాలజీతో ఈ స్టోర్‌ను డిజైన్‌ చేస్తున్నట్లు పెటె లావ్‌ తెలిపారు. గోడలను రెండు లేయర్లలో నిర్మించనున్నారట. లోపలి లేయర్‌ను ఎరుపురంగు ఇటుకలతో, బయటి లేయర్‌కు పూర్తిగా వైట్‌ ఫినిషింగ్‌ చేయిస్తామని వన్ ప్లస్ తెలిపింది.  అధునాతనంగా కనబడటంతో పాటు హైదరాబాద్‌ సంప్రదాయం కూడా భవనంలో ప్రతిబింబిస్తుందని పెటె లావ్‌ అన్నారు. 

‘హైదరాబాద్‌ ఉన్నత సంప్రదాయాలకు నెలవు. అంతేగాక.. టెక్నాలజీ, ఐటీ కేంద్రాలకు ఈ నగరం హబ్‌గా మారుతోంది. అందుకే వన్‌ప్లస్‌కు హైదరాబాద్‌ ఎంతో ప్రాముఖ్యమైన నగరం’ అని పెటె లావ్‌ చెప్పారు. 

ముంబై, పుణేలలో రెండు  ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్లను ప్రారంభించినట్టు వన్ ప్లస్ తెలిపింది. స్టోర్ నిర్మాణ పనులను ఇప్పటికే ప్రారంభించినట్టు వన్ ప్లస్ సీఈఓ పెటెలావ్ తెలిపారు. గొప్ప సాంస్కృతిక కేంద్రంగానే కాకుండా ఐటీ, టెక్నాలజీ హబ్‌గా హైదరాబాద్‌కు పేరుందన్నారు.

పాత కొత్త టెక్నాలజీల మధ్య వారధిగా వన్‌ప్లస్‌ నిలుస్తుందన్నారు పీట్‌.  సంప్రదాయ హైదరాబాద్‌ ఎర్ర ఇటుకలతో, దుమ్మును ఆకర్షించని శ్వేత సౌధాన్ని అద్భుతమైన డిజైన్‌, సహజకాంతితో తీర్చిదిద్దునున్నట్టు ఆయన వెల్లడించారు. కాగా వన్‌ప్లస్‌కు ఇప్పటికే హైదరాబాద్‌లో ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ కూడా ఉంది.

click me!