వేధింపుల ‘అమిత్’:గెంటేయకుండా ప్యాకేజీ.. గూగుల్‌పై రిట్!

By ramya NFirst Published Mar 13, 2019, 10:52 AM IST
Highlights

మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని తక్షణం ఉద్వాసన పలుకకుండా ప్యాకేజీ ఇచ్చారని ఆరోపిస్తూ ఓ డైరెక్టర్ దాఖలు చేసిన పిటిషన్‍పై గూగుల్ స్పందించింది. బలవంతంగా ఉద్యోగం నుంచి తొలిగించినందుకు గూగుల్ సెర్చ్ ఆపరేషన్స్ సీనియర్ ఉపాధ్యక్షుడిగా ఉన్న అమిత్ సింఘాల్ కు 4.5 కోట్ల డాలర్ల ప్యాకేజీ ఇచ్చి పంపినట్లు అంగీకరించింది. గూగుల్ నుంచి బయటకు వచ్చిన ఏడాదికి ఉబెర్‌లో చేరినా.. వేధింపుల ఆరోపణలు సంగతి ముందే వెల్లడించనందుకు అక్కడ అమిత్ సింఘాల్ రాజీనామా చేసి ఇంటి బాట పట్టాల్సి వచ్చింది. 

శాన్‌ఫ్రాన్సిస్కో: గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం గూగుల్.. లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ భారత సంతతికి చెందిన గూగుల్ సెర్చ్ ఆపరేషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ సింఘాల్‌ను కోట్లాది రూపాయలిచ్చి వదిలించుకున్నది. ఏకంగా 4.5 కోట్ల డాలర్లు (దాదాపు రూ.315 కోట్లు) చెల్లించింది. లైంగిక వేధింపుల ఆరోపణలపై 2016లో అమిత్ సింఘాల్ రాజీనామా చేశారు.

సంస్థ నుంచి బయటకు వెళ్లేందుకు ఆయనకు ఈ మొత్తాన్ని గూగుల్ ఇస్తామని అంగీకరించిందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లపై ఓ భాగస్వామి వేసిన దావాతో సోమవారం ఈ సంగతి బయటపడింది.

కాగా, తనపై సింఘాల్ అనుచితంగా ప్రవర్తించారని ఓ మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేయగా, దీనిపై విచారణ చేస్తే ఆ సమయంలో సింఘాల్ మద్యం సేవించి ఉన్నట్లు తేలిందని గూగుల్ తెలిపింది.  దీనిపై అంతర్గత దర్యాప్తు జరిపిన గూగుల్‌ ఆమె ఆరోపణలు వాస్తవమేనని తేల్చింది. సింఘాల్‌ను కూడా రాజీనామా చేయమని ‘గూగుల్’ కోరింది.

ఆ సమయంలో నిష్క్రమణ ప్యాకేజీ నిమిత్తం సింఘాల్‌, గూగుల్‌ మధ్య ఒప్పందం కూడా కుదిరింది. ఎంత మేరకు ప్యాకేజీ ఇవ్వనుందనే వివరాలు అప్పట్లో బయటకు రాలేదు. సంస్థలో లైంగిక వేధింపులకు ఏ రకంగానూ తావు లేకుండా చూస్తున్నామని, ఇలాంటి ఘటనలకు కారణమైనవారిని వదిలించుకోవడానికి గూగుల్ వెనుకాడబోదని, అందుకు ఈ భారీ ఎగ్జిట్ ప్యాకేజే నిదర్శనమని చెబుతున్నది.

అయితే తప్పుడుగా ప్రవర్తించిన ఉన్నతోద్యోగులను తొలగించడానికి బదులు వాళ్లకు ప్యాకేజీలు చెల్లించేందుకు అంగీకరించడం ద్వారా బాధ్యతలను విస్మరిస్తున్నారని ఆరోపిస్తూ గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ బోర్డు డైరెక్టర్లపై ఓ వాటాదారు దావా వేశారు. దీంతో సింఘాల్‌ ప్యాకేజీ వివరాలను గూగుల్ బయటపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

బలవంతంగా రాజీనామా చేయించినందున సోమవారం కోర్టుకు గూగుల్ సమర్పించిన అఫిడవిట్, ఇతర పత్రాల ప్రకారం.. పోటీ సంస్థలో ఉద్యోగిగా నియమితులు కానంతవరకు తొలి రెండేళ్లు ఏడాదికి 15 మిలియన్‌ డాలర్లు, మూడో ఏడాది 5 నుంచి 15 డాలర్లు చెల్లించేందుకు గూగుల్‌ అంగీకరించింది. 

2016 వరకు గూగుల్ సెర్చ్ ఆపరేషన్స్‌ను సీనియర్ ఉపాధ్యక్షుడి హోదాలో సింఘాల్ చూసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. గూగుల్ నుంచి ఊబర్‌లో చేరిన సింఘాల్.. అక్కడ కూడా రాజీనామా చేశారు. దానికి కారణం గూగుల్ లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగు చూడటమే.

అయితే గూగుల్‌లో రాజీనామా చేశాక ఏడాదికే ఉబర్‌లో సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (ఇంజినీరింగ్‌) చేరారు. కానీ కొన్ని వారాలకు గూగుల్‌లో లైంగిక వేధింపుల వ్యవహారం బహిర్గతం కావడంతో, ఉద్యోగంలో చేరేముందు ఆ విషయాన్ని వెల్లడించలేదన్న కారణంగా ఉబర్‌ నుంచి కూడా సింఘాల్‌ వైదొలగాల్సి వచ్చింది.

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన సింఘాల్.. ఐఐటీ రూర్కీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచ్‌లర్ ఆఫ్ ఇంజినీరింగ్ డిగ్రీని అందుకున్నారు. మిన్నెసోటా డులుత్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్ డిగ్రీనీ పొందారు. మరోవైపు ఈ వ్యవహారంపై స్పందించేందుకు సింఘాల్ నిరాకరించారు.
 

click me!