14 మంది సూక్తులతో డూడుల్.. ‘నారీశక్తి‌’కి గూగుల్ వందనం

By Siva KodatiFirst Published Mar 8, 2019, 2:12 PM IST
Highlights

14 మంది ప్రముఖ మహిళల సూక్తులతో సెర్జింజన్ ‘గూగుల్’ నారీశక్తికి వందనం తెలుపుతూ స్లైడ్ షోతో కూడిన డూడుల్‌ను ఆవిష్కరించింది. 

ప్రముఖ సెర్చింజన్ ‘గూగుల్’ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  ప్రత్యేక డూడుల్‌తో నారీశక్తికి వందనం పలికింది. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన 14 మంది ప్రముఖ మహిళల స్ఫూర్తి వ్యాఖ్యలతో స్లైడ్‌ షో ఏర్పాటుచేసింది.

డూడుల్‌పై ‘మహిళ’ అనే పదాన్ని ఆంగ్లం, హిందీ, అరబిక్‌, ఫ్రెంచ్‌, బంగ్లా, రష్యన్‌, జపనీస్‌, జర్మన్‌, ఇటాలియన్‌, స్పానిస్‌, పోర్చుగీస్‌.. ఇలా 11 భాషల్లో రాశారు. మధ్యలో వీడియో బటన్‌ ఏర్పాటుచేశారు.

ఈ బటన్‌ను క్లిక్‌ చేస్తే స్లైడ్‌ షో ప్లే అవుతుంది. మన దేశానికి చెందిన ప్రముఖ బాక్సర్‌, ఒలింపిక్‌ పతక విజేత మేరీకోమ్‌, అమెరికన్‌ వ్యోమగామి డాక్టర్‌ జెమిసన్‌ సహా 14 మంది మహిళావిజేతల సూక్తులు ఉన్నాయి. మెక్సికో ఆర్టిస్ట్ ఫ్రిడా కాల్హో, బ్రిటన్ ఇరాకీ ఆర్కిటెక్ జాహా హదీద్ తదితరుల సూక్తులు చేర్చారు. 

119 ఏండ్ల కిందట తొలిసారి న్యూయార్క్‌లో 1909, ఫిబ్రవరి 28న మహిళలు పెద్దసంఖ్యలో సమావేశమై తమ హక్కుల కోసం గళమెత్తారు. సామాజిక కట్టుబాట్లు, లింగ వివక్ష, వేతనాల్లో కోతను ధిక్కరిస్తూ కొదమసింహాలై వారు గర్జించారు. అమెరికా సోషలిస్టు పార్టీ మార్గనిర్దేశకత్వంలో జరిగిన ఈ సభకు థెరెసా మల్కిల్ అధ్యక్షత వహించారు.

తర్వాత 1910లో జరిగిన అంతర్జాతీయ మహిళా కాన్ఫరెన్స్‌లో మార్చి 8న ప్రతి ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. 1975 నుంచి ఐక్యరాజ్యసమితి అధికారికంగా ప్రతి ఏటా మార్చి 8న మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. 

మహిళా దినోత్సవం సందర్భంగా క్యూబా, అర్మేనియా, మంగోలియా, రష్యా, ఉగాండా, ఉక్రెయిన్ దేశాలు అధికారికంగా సెలవుల్ని ప్రకటించాయి. దక్షిణాఫ్రికాలో మాత్రం ప్రతి ఏటా ఆగస్టు 9న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
 

click me!