జుకర్ బర్గ్ శక్తిమంతుడే.. ఫేస్‌బుక్‌ విభజించాలన్న హ్యూస్.. బట్

By rajesh yFirst Published May 11, 2019, 11:05 AM IST
Highlights

ఫేస్ బుక్ పై దాని సహ వ్యవస్థాపకుడు క్రిస్ హ్యూస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లను కంపెనీ నుంచి వేరు చేయాలని సూచించారు. ఫేస్ బుక్ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ అపర శక్తిమంతుడయ్యాడన్నారు. పోటీతత్వం, ఇన్నోవేషన్ ను ఆహ్వానించాలంటే కొత్త సోషల్ మీడియా వేదికలను ఫేస్ బుక్ యాజమాన్యం కొనుగోలు చేయొద్దన్నారు. కానీ క్రిస్ హ్యూస్ వాదనను ఫేస్ బుక్ కొట్టి పారేసింది. 
 

న్యూయార్క్‌: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ను విభజించాల్సిన సమయం ఆసన్నమైందని ఆ కంపెనీ సహ-వ్యవస్థాపకుల్లో ఒకరైన క్రిస్‌ హ్యూస్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంలో గానీ, ప్రైవేట్ రంగంలో గానీ ఫేస్‌బుక్‌ సారథి మార్క్‌ జుకర్‌బర్గ్‌ అత్యంత శక్తిమంతమైన వ్యక్తిగా మారారని ఆయన హెచ్చరించారు.

మంచికి, మర్యాదకు మారుపేరుగా ఉన్న జుకర్ బర్గ్ కంపెనీ అభివృద్ధి కోసం భద్రతను, క్లిక్స్‌ కోసం మర్యాదను త్యాగం చేశారని న్యూయార్క్‌ టైమ్స్‌లో రాసిన వ్యాసంలో హ్యూస్‌ పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌ మాత్రమే కాదు, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సైతం జుకర్‌బర్గ్‌ నియంత్రణలోనే ఉన్నాయన్నారు.

ఫేస్‌బుక్‌ బోర్డు జుకర్ బర్గ్ అధికారాలను సరిచూడడానికి బదులు సలహా కమిటీలా మాత్రమే పనిచేస్తోందని క్రిస్ హ్యూస్ అన్నారు. ప్రభుత్వ నియంత్రణ సంస్థలు ఫేస్ బుక్ ఇతర సోషల్ మీడియా వేదికలను విభజించేందుకు చర్యలు చేపట్టాలని క్రిస్ హ్యూస్ సూచించారు.

సోషల్‌ మీడియా ప్రపంచంలో ఫేస్‌బుక్‌ గుత్తాధిపత్యం కొనసాగుతోందని.. వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లను కంపెనీ నుంచి వేరు చేయాలని క్రిస్ హ్యూస్ అభిప్రాయపడ్డారు. అంతేకాక మరికొన్నాళ్లపాటు మరే ఇతర సోషల్‌ మీడియా కంపెనీని కొనుగోలు చేయకుండా నిషేధం విధించాలని అన్నారు. 

జుకర్‌బర్గ్‌, క్రిస్‌ హ్యూస్‌లు హార్వర్డ్‌ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు 2004లో ఫేస్‌బుక్‌ను కలిసి ప్రారంభించారు. బరాక్‌ ఒబామా తరఫున ప్రచారం చేసేందుకు 2007లో ఫేస్‌బుక్‌ నుంచి వైదొలిగారు.

ఫేస్ బుక్ దాని అనుబంధ సోషల్ మీడియా వేదికలపై నియంత్రణ అవసరమని వాదిస్తున్న టెక్ దిగ్గజాల్లో హ్యూస్ ఒకరు. ప్రత్యేకించి వ్యక్తిగత స్వేచ్ఛ (ప్రైవసీ) అంశానికి సంబంధించి స్కాండల్స్ వెలుగు చూస్తున్నాయని హ్యూస్ వాదన. టెక్ సంస్థల నియంత్రణకు అమెరికా ప్రభుత్వం ప్రత్యేక సంస్థను సూచించాలన్నారు.

ఫేస్ బుక్ సీఈఓ జుకర్‌బర్గ్ సైతం నియంత్రణకు అనుకూలమేనని మార్చిలో వాషింగ్టన్ పోస్టులో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. ఫేస్ బుక్ టీం ప్రారంభంలోనే న్యూస్ ఫీడ్ ఆల్గోరిథమ్‌తో కల్చర్‌లో మార్పు తేవడం ఎలా? ఎన్నికల్లో ప్రభావం చూపడం ఎలా? జాతీయ వాద నేతలకు సాధికారత కల్పించడం ఎలా? అన్న అంశాలపైనే కేంద్రీకరించడం తనను అసంత్రుప్తికి గురి చేసిందని హ్యూస్ పేర్కొన్నారు.

ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ తదితర ఇతర సోషల్ మీడియా వేదికలను స్వాధీనం చేసుకోవడం వల్ల ఈ రంగంలో పోటీకి అవకాశం లేకుండా పోయిందని హ్యూస్ వాదన. ఫేస్ బుక్ ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నదని, ఫలితంగా ఇన్నోవేషన్ కు అవకాశం లేకుండా పోయిందని చెబుతున్నారు. ఫేస్ బుక్ మాత్రమే కాదు అమెజాన్, ఆపిల్, గూగుల్ సంస్థలను విభజించాల్సిన అవసరం ఉన్నదని హ్యూస్ అభిప్రాయ పడ్డారు.

జుకర్ బర్గ్ తన టీం మధ్య చిక్కుబడి పోయారేమోనని సందేహం వ్యక్తం చేశారు. కానీ క్రిస్‌ హ్యూస్‌ వాదనను ఫేస్ బుక్ యాజమాన్యం తోసిపుచ్చింది. ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియా వేదికలను విభజించాల్సిన అవసరమే లేదని శనివారం న్యూయార్క్ టైమ్స్ ఓపెన్ ఎడ్ పేజీ వ్యాసంలో పేర్కొంది. సంస్థ పనితీరులో మరింత పారదర్శకతను స్వాగతిస్తున్నామని ఫేస్ బుక్ గ్లోబల్ అఫైర్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం ఉపాధ్యక్షుడు నిక్ క్లెగ్ తెలిపారు.

click me!