ఒలింపిక్స్ వాయిదా: భారత జిమ్నాస్ట్ దీప కర్మాకర్ కు అంది వచ్చిన అవకాశం, కుదిరితే పతకమే!

By Sree sFirst Published Apr 2, 2020, 6:03 PM IST
Highlights

విశ్వ క్రీడలు.... టోక్యో  2020 ఒలింపిక్స్‌ కూడా ఏడాది పాటు వాయిదా పడ్డాయి. 2021 జులైలో ఒలింపిక్స్ ప్రారంభమవనున్నాయి. ఈ ఏడాది ఒలింపిక్స్‌కు సర్వ సన్నద్ధమైన అథ్లెట్లకు ఈ వాయిదా నిర్ణయం నిరాశ కలిగిస్తుండగా.... గాయాలతో పోరాటం చేస్తోన్న కొందరు అథ్లెట్లకు మాత్రం ఈ వాయిదా వరంగా మారింది. 

కరోనా మహమ్మారి దెబ్బకి ప్రపంచం అంతా  లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. ఏ దేశంలో చూసినా నిషేదాజ్ఞలే. అన్ని దేశాలు కూడా తమ సరిహద్దులను మూసేసి ఈ మహమ్మారిని తమ దేశం నుంచి బయటకు వెళ్ళగొట్టాలని కంకణం కట్టుకున్నాయి. 

ఈ నేపథ్యంలోనే విశ్వ క్రీడలు.... టోక్యో  2020 ఒలింపిక్స్‌ కూడా ఏడాది పాటు వాయిదా పడ్డాయి. 2021 జులైలో ఒలింపిక్స్ ప్రారంభమవనున్నాయి. ఈ ఏడాది ఒలింపిక్స్‌కు సర్వ సన్నద్ధమైన అథ్లెట్లకు ఈ వాయిదా నిర్ణయం నిరాశ కలిగిస్తుండగా.... గాయాలతో పోరాటం చేస్తోన్న కొందరు అథ్లెట్లకు మాత్రం ఈ వాయిదా వరంగా మారింది. 

ఈ కోవలోకే వస్తుంది భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్. దీప కర్మాకర్‌కు ఒలింపిక్స్‌ వాయిదా మరో అవకాశం కల్పించినట్టయింది. గాయంతో 2020 ఒలింపిక్స్‌పై ఆశలు వదులుకున్న ఈ స్టార్ అథ్లెట్ ఇప్పుడు 2021పై ఫోకస్‌ పెట్టింది. 

రియో ఒలింపిక్స్‌లో పతకానికి అడుగు దూరంలో మాత్రమే ఆగిపోయిన దీప కర్మాకర్‌.. ఇప్పుడు టోక్యోలో సైతం పోటీపడేందుకు సిద్ధమవుతోంది. గాయం కారణంగా ఈ ఒలింపిక్స్ లో బెర్త్ దక్కించుకోలేకపోయింది ఈ అమ్మాయికి ఇప్పుడు అవకాశం అందివచ్చినట్టయింది. 

అత్యంత ప్రమాదకర ప్రోడునోవా విన్యాసం ప్రదర్శించే దీప కర్మాకర్‌ టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం ఆశలు కల్పించింది. కానీ మోకాలి గాయంతో 2019లో పూర్తిగా ఆటకు దూరమైంది. 

గత సంవత్సరం శస్త్రచికిత్స చేయించుకున్న దీప కర్మాకర్‌ ఏడాది పాటు రిహాబిలిటేషన్ సెంటర్లో కొనసాగుతోంది. మధ్యలో మళ్లీ గాయం తిరగబెట్టి ఆటకు దూరమై కోలుకుంటుంది.  దీప కర్మాకర్‌ ఇప్పడికి కూడా పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ సాధించలేదు. 

అత్యధిక ఫిట్నెస్ అవసరమయ్యే జిమ్నాస్టిక్స్ లో పూర్తిస్థాయి ట్రాక్ ఫిట్నెస్ సాధించడం అంత తేలికైన విషయం కాదు. పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించేందుకు దీపకు మరో నాలుగు నెలల సమయం పడుతుంది. 

ఇప్పుడు మరో నాలుగు నెలల్లో ఎటువంటి క్రీడలు నిర్వహించే అవకాశం కనిపించటం లేదు. దీంతో కోచ్‌ బిశ్వేశ్వర్‌ నందితో కలిసి దీప కర్మాకర్‌ కఠోర సాధన చేస్తోంది. నెమ్మదిగా విన్యాసాలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. 

ఒలింపిక్స్‌ వాయిదా దీప కర్మాకర్‌కు ఓ అవకాశం కల్పించినా.... టోక్యో బెర్తు సాధించటం దీపకు అంత సులువు కాదు. ఎనిమిది ఒలింపిక్స్ అర్హత టోర్నీల్లో ఇప్పటికే ఆరు ప్రపంచకప్‌లు ముగిసిపోయాయి. కేవలం రెండు ప్రపంచకప్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. 

ఈ రెండు వరల్డ్‌కప్‌ల ద్వారానే టోక్యో బెర్త్‌ ఆశిస్తున్న దీప కర్మాకర్‌ అపూర్వ ప్రదర్శన చేయాల్సిందే. కనీసం రెండు రజతాలు లేదా ఓ స్వర్ణం ఓ రజతం సాధిస్తేనే ఒలింపిక్స్‌ బెర్త్‌ దక్కుతుంది. 

అత్యంత ప్రమాదకర, చూసేందుకు రెండు కండ్లు సరిపోవనే ప్రోడునోవా విన్యాసం దీప కర్మాకర్‌ అద్భుతంగా చేయగలదు. టోక్యో ఒలింపిక్స్‌లోనూ దీప కర్మాకర్‌కు ప్రోడునోవా విన్యాసమే ప్రధాన కానుంది!.

click me!