బురద జల్లే ఎజెండాను కట్టిపెట్టండి: పాక్ అథ్లెట్‌పై ఆరోపణలు.. నీరజ్ చోప్రా ఎంట్రీ

By telugu teamFirst Published Aug 26, 2021, 4:20 PM IST
Highlights

టోక్యో ఒలింపిక్స్ ఫైనల్‌లో తన జావెలిన్‌ను పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ చేతపట్టాడని, వెంటనే ఆయన దగ్గర నుంచి వెనక్కి తీసుకున్నానని నీరజ్ చోప్రా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. దీంతో మళ్లీ ఆయనే కల్పించుకుని వ్యక్తిగత ఎజెండాల కోసం తనను, తన కామెంట్లను వినియోగించవద్దని అభ్యర్థించాడు. కామెంట్ చేసే ముందు స్పోర్ట్స్ రూల్స్ తెలుసుకోవాలని సూచించారు.

న్యూఢిల్లీ: భారత ‘బంగారు’ క్రీడాకారుడు నీరజ్ చోప్రా.. పాకిస్తాన్ జావెలిన్ అథ్లెట్ అర్షద్ నదీమ్‌పై చెలరేగుతున్న దుమారానికి చెక్ పెట్టారు. తమ బురద జల్లే ఎజెండాను కట్టిపెట్టాలని హితవు పలికారు. స్పోర్ట్స్ తామంతా కలిసి ఉండాలని చెబుతుందని తెలిపారు. తన వ్యాఖ్యలను దుర్వినియోగం చేస్తూ తప్పుడు ఎజెండాను ముందుకు తీసుకెళ్లవద్దని అభ్యర్థించారు. ఆయన ఇటీవలే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫైనల్‌కు ముందు తన బల్లెం పాక్ క్రీడాకారుడు అర్షద్ నదీమ్ చేతిలో కనిపించిందని, వెంటనే ఆయన నుంచి అడిగి తీసుకున్నట్టు తెలిపారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద రాద్ధాంతమే జరుగుతున్నది. తాజాగా, నీరజ్ చోప్రా కలుగజేసుకుని దుష్ప్రచారాన్ని కట్టిపెట్టాలని, ఆరోపణలను కామెంట్ చేసేముందూ క్రీడల నిబంధనలు తెలుసుకోవాలని సూచించారు.

నీరజ్ చోప్రా తన ఇంటర్వ్యూలో పాక్ క్రీడాకారుడు అర్షద్ నదీమ్ గురించి మాట్లాడారు. ‘...ఒలింపిక్స్ ఫైనల్‌కు ముందు నేను నా జావెలిన్ కోసం వెతుకుతూనే ఉన్నాను. కానీ, అది కనిపించలేదు. నా బల్లెన్ని అర్షద్ నదీమ్ పట్టుకుని అక్కడే అటూ ఇటూ తిరుగుతుండటాన్ని సడెన్‌గా చూశాను. ఆయన దగ్గరకు వెళ్లి.. భాయ్ అది నా జావెలిన్. నాకివ్వండన్నాను. దానినే నేను విసరాల్సి ఉన్నదన్నాను. నదీమ్ ఆ జావెలిన్‌ను నాకు ఇచ్చేశాడు. అందుకే బహుశా మీరు నా మొదటి త్రోను గాబరాలో వేస్తున్నట్టు గమనించవచ్చు’ అని వివరించారు.

ఈ వ్యాఖ్యలు పబ్లిష్ కాగానే, ఆయన అభిమానులు నదీమ్ అంతరంగమేంటని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు కుమ్మరించారు. ఇంకొందరైతే పాకిస్తానీ క్రీడాకారులు నీరజ్ చోప్రా జావెలిన్‌ను ట్యాంపర్ చేయాలని ప్రయత్నించారన్న కథనాలున్నాయని సెలవివ్వడం గమనార్హం. ఈ వివాదం ముదురుతుండటంతో నీరజ్ చోప్రా కలుగజేసుకోకతప్పలేదు.

‘దయచేసి నన్ను, నా కామెంట్లను మీ ప్రాపగాండ కోసం వినియోగించుకోవద్దు. స్పోర్ట్స్ మమ్మల్నందరినీ కలిసి ఉండాలని నేర్పుతుంది. నా రీసెంట్ కామెంట్స్‌పై వచ్చిన ప్రతిస్పందన నన్ను తీవ్రంగా కలిచివేసింది’ అని తెలిపారు. అంతేకాదు, ఇంటర్వ్యూలోని తన కామెంట్‌పై చిన్నపాటి వివరణా ఇచ్చారు. ‘నా ఇంటర్వ్యూలో ఓ మాట గురించి ఇక్కడ మాట్లాడాలనుకోవాలనుకుంటున్నాను. టోక్యో ఒలింపిక్స్‌లో నా ఫైనల్‌కు ముందు జావెలిన్‌ను అర్షద్ నదీమ్ నుంచి తీసుకున్నాను. ఈ వ్యాఖ్యనే ఇప్పుడు అకారణంగా పెద్ద సమస్యై కూర్చుంది. జావెలన్ త్రోయర్లు అందరూ ఆటకు ముందు తమ జావెలిన్లు అన్నీ ఒకే దగ్గర పెట్టాల్సి ఉంటుంది. అథ్లెట్లందరూ అందులో దేనినైనా వినియోగించవచ్చు. ఇదొక రూల్. కాబట్టి, ఆయన నా జావెలిన్‌ను తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు’ అని చెప్పుకొచ్చారు. 

click me!