గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా... ఏం తింటారో తెలుసా?

By telugu news teamFirst Published Aug 29, 2023, 11:44 AM IST
Highlights

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో అద్భుత ప్రదర్శనతో దేశానికి మరో బంగారు పతకం అందించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. 
 

నీరజ్ చోప్రా పరిచయం అవసరం లేని పేరు.  ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకం అందించిన జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా మరో చరిత్ర సృష్టించాడు. హంగేరీలోని బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో అద్భుత ప్రదర్శనతో దేశానికి మరో బంగారు పతకం అందించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. 

కాగా, ఈ  గోల్డెన్ బాయ్ తన ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో తెలుసుకుందాం.  నీరజ్ చోప్రా దాదాపు 10% శరీర కొవ్వు శాతాన్ని మెయింటెయిన్ చేయాలని చూస్తున్నాడట, ఇది జావెలిన్ త్రో అథ్లెట్లకు సరిగ్గా సెట్ అవుతుందట. కానీ, ఇంత తక్కువ శరీర కొవ్వు శాతాన్ని నిర్వహించడం అంత సులభం కాదు. హర్యానాకు చెందిన అథ్లెట్ తన ఆహార నియమాలను ఖచ్చితంగా పాటిస్తాడు, ఇందులో పండ్లు, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అతను కండరాల పెరుగుదలకు తోడ్పడే,  శరీర కొవ్వు శాతాన్ని ఆరోగ్యకరమైన స్థాయిలో నిర్వహించే తగినంత మాక్రోన్యూట్రియెంట్లను వినియోగించేలా చూసుకుంటాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ సీక్రెట్ ని బయటపెట్టాడు. నీరజ్ తనను తాను ఎలా పరిపూర్ణ ఆకృతిలో ఉంచుకుంటాడో వెల్లడించాడు. నీరజ్ తన రోజును జ్యూస్ లేదా కొబ్బరి నీళ్లతో ప్రారంభిస్తాడు. అతని అల్పాహారం తేలికగా ఉంటుంది కానీ చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. 25 ఏళ్ల అతను మూడు నుండి నాలుగు గుడ్డులోని తెల్లసొన, రెండు బ్రెడ్ ముక్కలు, ఒక గిన్నె డాలియా, పండ్లు తీసుకుంటాడు.

మధ్యాహ్న భోజనం విషయానికి వస్తే, నీరజ్ పప్పులు, గ్రిల్డ్ చికెన్ , సలాడ్‌తో పాటు పెరుగు , అన్నం తీసుకుంటారని చెబుతారు. భోజనాల మధ్య లేదా శిక్షణ సమయంలో, నీరజ్ డ్రై ఫ్రూట్స్, ముఖ్యంగా బాదంపప్పులు,  తాజా రసం త్రాగడానికి ఇష్టపడతాడు.

డిన్నర్ అంటే నీరజ్ తేలికగా ఉండటానికి ఇష్టపడే భోజనం. ఇది ఎక్కువగా సూప్, ఉడికించిన కూరగాయలు, పండ్లను కలిగి ఉంటుంది.

అథ్లెట్లకు ఆహారంలో ప్రోటీన్ చాలా ముఖ్యమైన అంశం. నీరజ్‌కి, ప్రొటీన్‌లో కొంత భాగం సప్లిమెంట్ల నుండి కూడా వస్తుంది. నీరజ్ 2016 వరకు కఠినమైన శాఖాహారిగా ఉండేవాడని, అయితే తర్వాత అతని శిక్షణకు మద్దతుగా అతని డైట్‌లో మాంసాహారాన్ని చేర్చుకున్నాడని కూడా నివేదించబడింది. ఇటీవల, అతను సాల్మన్ చేపలను తినడం ప్రారంభించాడు.

నీరజ్ తన ఆహారంలో కఠినమైన నియమావళిని ఉంచడానికి ఇష్టపడుతున్నప్పటికీ, అతను అరుదైన సందర్భాల్లో చీట్ మీల్స్ చేస్తూ ఉంటాడట. చుర్మా, స్వీట్లు, గొల్గప్పలు అతను సాధారణంగా చీట్ మీల్స్‌గా తీసుకుంటూ ఉంటాడు.

click me!