క్రీడా సంఘానికి జాతీయ అధ్య‌క్షుడైన తొలి తెలంగాణ వ్య‌క్తి

By team teluguFirst Published Nov 2, 2020, 1:58 PM IST
Highlights

జాతీయ హ్యాండ్‌బాల్‌ ఫెడరేషన్‌ (హెచ్‌ఎఫ్‌ఐ) ఎన్నికల్లో తెలంగాణకు చెందిన అరిశెనపల్లి జగన్‌ మోహన్‌రావు విజయ దుందుభి మోగించారు.

జాతీయ హ్యాండ్‌బాల్‌ ఫెడరేషన్‌ (హెచ్‌ఎఫ్‌ఐ) ఎన్నికల్లో తెలంగాణకు చెందిన అరిశెనపల్లి జగన్‌ మోహన్‌రావు విజయ దుందుభి మోగించారు. ఈనెల 18న ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవగా అధ్యక్ష పదవికి జగన్‌ ఒక్కరే నామినేషన్‌ వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

లక్నో లోని హెచ్‌ ఎఫ్‌ ఐ ప్రధాన కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడిగా జగన్‌ మోహన్‌ రావు ప్రమాణ స్వీకారం చేశారు.జాతీయ కార్యవర్గంలోని ఇతర పదవులకు ముందు ఒకటి కంటే ఎక్కువే నామినేషన్లు వచ్చినా.. ఏకగ్రీవమయ్యేలా జగన్‌ మంత్రాంగం నడిపారు. 

భారత ఒలింపిక్‌ సంఘం కోశాధికారి, హ్యాండ్‌బాల్‌ ప్రధాన కార్యదర్శి ఆనందీశ్వర్‌ పాండే సహకారంతో అసోసియేషన్‌ పై పట్టు సంపాదించిన జగన్‌ స్వల్ప కాలంలోనే అధ్యక్ష స్థాయికి ఎదిగారు. ఈ సంఘం మాజీ అధ్యక్షుడు రామసుబ్రమణ్యం నుంచి జగన్‌కు తొలుత గట్టి పోటీ ఎదురైంది. 

ఐసీసీ మాజీ చైర్మన్‌ శ్రీనివాసన్‌కు సన్నిహితుడైన రామసుబ్రమణ్యం సంఘంపై తన పట్టును నిలుపుకోవడానికి న్యాయస్థానాల చుట్టూ కూడా తిరిగారు. ప్రత్యర్థి వర్గాల వ్యూహాలన్నింటినీ సమర్థవంతంగా ఛేదించిన జగన్‌ రెండేళ్లలోనే ఫెడరేషన్‌లో చక్రం తిప్పే స్థాయికి చేరుకున్నారు. 

"టార్గెట్‌ ఒలింపిక్స్‌గా పనిచేస్తాం: జగన్‌ ముందుగా నా మీద ప్రేమ, ఆప్యాయతలతో హ్యాండ్‌బాల్‌ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న 29 రాష్ట్ర సంఘాలకు హదయపూర్వక కతజ్ఞతలు తెలుపుతున్నా. నా మీద నమ్మకం ఉంచి ఇంతటి గురుతర బాధ్యతలను అప్పగించినందుకు శక్తి వంచన లేకుండా హ్యాండ్‌బాల్‌ అభివృద్ధికి కృషి చేస్తా. మన దేశంలో గ్రామీణ స్థాయి నుంచి హ్యాండ్‌బాల్‌కు మంచి క్రేజ్‌ ఉంది. అయితే, వాణిజ్యపరంగా పోలిస్తే క్రికెట్‌, బ్యాడ్మింటన్‌ కంటే చాలా వెనకపడి ఉండటంతో ఒక లెవల్‌ వద్ద్ఱ నిలిచిపోయింది. అక్కడ నుంచి ఉన్నత స్థితికి చేర్చేందుకు హ్యాండ్‌ బాల్‌ ప్రీమియర్‌ లీగ్‌కు శ్రీకారం చుట్టాం. ఇండోర్‌ గేమ్‌ అయిన హ్యాండ్‌బాల్‌ మౌలికవసతుల లేమి కారణంగా మెట్రో నగరాలు మొదలు గ్రామాల వరకూ అవుట్‌డోర్‌ స్పోర్ట్‌లా మారిపోయింది. కాబట్టి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ, భారత ఒలింపిక్‌ సంఘం, సారు సహకారంతో తొలుత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివద్ధిపై దష్టి సారిస్తాం. అనంతరం నిష్ణాతులైన కోచ్‌ల ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా టాలెంట్‌ హంట్‌ నిర్వహించి మెరికల్లాంటి క్రీడాకారులను జల్లెడపట్టి సానపెడతాం. టోక్యో తదుపరి జరిగే ఒలింపిక్స్‌లో మెడల్‌ టార్గెట్‌గా భారత క్రీడాకారులను తయారు చేయడమే నా ధ్యేయం" అని జగన్‌ మోహన్‌ రావు తెలిపారు.  

click me!