Beijing Winter Olympics: బీజింగ్ వేదికగా వచ్చే ఏడాది జరుగబోయే వింటర్ ఒలింపిక్స్ జరుగడం అనుమానంగానే ఉంది. తాజాగా అమెరికా తీసుకున్న నిర్ణయమే దీనికి కారణం. మరోవైపు ఆటను ఆటగా మాత్రమే చూడాలని, రాజకీయాలు చేయాలని చూస్తే తగిన బదులు చెప్తామని చైనా హెచ్చరించింది.
వచ్చే ఏడాది చైనాలో జరుగబోయే వింటర్ ఒలింపిక్స్ లో ‘దౌత్య బహిష్కరణ’ (Diplomatic Boycott) చేసిన అగ్రరాజ్యం అమెరికా పై చైనా అగ్గిమీద గుగ్గిల్లమైంది. ఇటువంటి చర్యలు ఉపేక్షించరానివని, USA భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. ఆటను ఆటగా మాత్రమే చూడాలని, రాజకీయాలు చేయాలని చూస్తే తగిన బదులు చెప్తామని చెప్పకనే చెప్పింది. China టెన్నిస్ క్రీడాకారిణి Peng Shuai ఉదంతంతో ఇప్పటికే చైనాలో జరగాల్సిన టెన్నిస్ టోర్నీలను.. అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య (IOC) రద్దు చేసిన నేపథ్యంలో.. తాజాగా యూఎస్ కూడా ఇదే నిర్ణయం తీసుకోవడంతో చైనాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
2022 లో Beijing Winter Olympics జరుగనున్నాయి. అయితే వీటిని దౌత్య బహిష్కరణ చేయాలని JOe Biden నేతృత్వంలోని America తీర్మానించింది. అంటే.. ఈ క్రీడల్లో అమెరికా అథ్లెట్లు తప్ప రాజకీయ వేత్తలు గానీ, దౌత్యవేత్తలు గానీ పాల్గొనరు. ఇందుకు సంబంధించి గత వారం ఐక్యరాజ్యసమితి జనరల్ (UNO) అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని 173 దేశాలు కోస్పాన్సర్ చేయగా.. 193 దేశాలు ఆమోదించాయని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) వెల్లడించింది.
undefined
వీఘర్ (Uyghur) ముస్లింల విషయంలో చైనా అనుకరిస్తున్న వైఖరే అమెరికా నిర్ణయం వెనుక కారణమని తెలుస్తున్నది. జింజియాంగ్ ప్రావిన్స్ లోని వీఘర్ ముస్లింలపై చైనా కొంతకాలంగా దారుణంగా వ్యవహరిస్తున్నది. అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందన్నది యూఎస్ ప్రధాన ఆరోపణగాఉన్నది. ఈ నేపథ్యంలోనే యూఎస్ఎ ఈ డిప్లామాటిక్ బాయ్కాట్ ను ప్రయోగించింది. ఇక అమెరికా నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు ఐవోసీ కూడా పేర్కొంది.
ఈ నేపథ్యంలో చైనా కూడా గట్టిగానే స్పందించింది. ఈ మేరకు చైనా విదేశాంగ ప్రతినిధి జావో లిజైన్ (Zhao Lijian) మాట్లాడుతూ.. ‘చూస్తూ ఉండండి.. మీరు (యూఎస్ ను ఉద్దేశిస్తూ) భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ లో డిప్లామాటిక్ బాయ్కాట్ చేయాలన్న యూఎస్ నిర్ణయం, మాపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. ఎప్పటిలాగే అవి అవాస్తవాలు, పుకార్లు. మీ దుష్ట రాజకీయాలకు బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ వేదిక కారాదు...’ అని అన్నాడు.
అయితే యూఎస్ తీసుకున్న ఈ నిర్ణయంతో క్రీడాకారులు కూడా వింటర్ ఒలింపిక్స్ లో పాల్గొంటారా..? లేదా..? అనే అనుమానాలు చైనాలోనూ మొదలయ్యాయి. అంతేగాక.. అథ్లెట్లను రాకుండా యూఎస్ అడ్డుకుంటుందని కూడా చైనా ఆరోపిస్తున్నది. కానీ తాము దౌత్య బహిష్కరణ మాత్రమే చేశామని, క్రీడాకారులు స్వేచ్ఛగా వెళ్లొచ్చని యూఎస్ చెబుతున్నది.
ఇదిలాఉండగా.. యూఎస్ నిర్ణయంపై చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ వ్యంగ్యంగా స్పందించింది. ‘నిజంగా చెప్పాలంటే ఇది మన (చైనా)కు గుడ్ న్యూస్. కొంతమంది యూఎస్ దౌత్యవేత్తలే వస్తే తక్కువ వైరసే తీసుకొస్తారు..’ అని వ్యాఖ్యానించింది. ఇన్ని గందరగోళాల నడుమ అసలు బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ జరుగుతాయా..? లేదా..? అనేది అనుమానంగా మారింది.