పిల్లల ఫోన్ అలవాటు: ఈ కాలంలో పిల్లల ఫోన్ అలవాటుతో బాధపడని తల్లిదండ్రులు ఉండరు. వారికోసం కొన్ని ఉపయోగపడే చిట్కాలు చెబుతున్నాం. వెంటనే పాటించండి. స్క్రీన్ టైం తగ్గించండి, బయట ఆటలు ఆడించండి, వాళ్లకు ఆదర్శంగా ఉండండి. ఇలాంటివెన్నోన..
స్మార్ట్‌ఫోన్ అలవాటు: పిల్లలు అతిగా ఫోన్ చూడటం ఆందోళన కలిగించే విషయం. మొబైల్ అతిగా చూస్తుంటే కళ్లు పాడవుతాయి. ఏకాగ్రతా లోపం వస్తుంది. నిద్రలేమి సమస్యలు వస్తాయి. సమయం వేస్ట్ అవడమే కాకుండా.. వాళ్లు చూసే కంటెంట్ ఆధారంగా మొత్తం వ్యక్తిత్వం కూడా మారిపోయే ప్రమాదం ఉంటుంది. తల్లిదండ్రులుగా, మీ పిల్లల ఫోన్ అలవాటుని తగ్గించడానికి వెంటనే చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. మీ పిల్లల ఫోన్ అలవాటు తగ్గించడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.
ఫోన్ వాడకంపై పరిమితి విధించడం మొదటి అడుగు. ఎప్పుడు, ఎక్కడ ఫోన్ వాడాలో పరిమితి నిర్ణయించండి. ఉదాహరణకు, భోజనం చేసేటప్పుడు, పడుకునేటప్పుడు ఫోన్ వాడకూడదు అని చెప్పండి. రోజులో ఇంత సమయం మాత్రమే వాడాలనే షరతు పెట్టండి. ఇది వాళ్లను ఫోన్ నుంచి దూరం చేయడంలో మొదటి అడుగుగా ఉపయోగపడుతుంది. ఒకేసారి ఫోన్ మానేయమంటే కష్టం కాబట్టి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది.
కొన్నిరకాల ఆటలు పిల్లలు బాగా ఇష్టపడతారు. అవి అందుబాటులో ఉండే వాతావరణం పిల్లలకు పేరెంట్స్ కల్పించాలి. ఏదైనా గేమ్ లో చేర్పించడం.. వాళ్లతో కలిసి ఆడుకోవడంలాంటివి చేయాలి. బయట ఆటలు ఆడటం, చదవడం, బొమ్మలు గీయడం, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆటలు ఆడటం వంటి వాటిని ప్రోత్సహించాలి.
మనం పిల్లలు ముందు ఎక్కువ సమయం ఫోన్ చూస్తూ వాళ్లని ఫోన్ పట్టుకోవద్దు అని చెప్పడంలో అర్థం ఉండదు. ఫోన్ తో ఎంత అర్జెంట్ పని ఉన్నా వాటిని బయటే పూర్తి చేయాలి. లేదంటే పిల్లలు మనల్ని చూసే నేర్చుకుంటారు. ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ సమయం వాళ్లతోనే గడపాలి. గేమ్స్ ఆడటం, నడకకు వెళ్లడం వంటి కార్యకలాపాల్లో పిల్లలతో పాల్గొనండి. ఇలా చేయడం వల్ల పిల్లలు మంచి అలవాట్లు నేర్చుకుంటారు.
ఇంట్లో భోజనాల గది, బెడ్‌రూమ్ వంటి కొన్ని ప్రదేశాల్లో ఫోన్, టీవీ వంటివి ఉపయోగించకూడదని నియమం పెట్టండి. దీనివల్ల పిల్లలు ప్రశాంతంగా ఉండటం, ఇతరులతో మాట్లాడటం నేర్చుకుంటారు. ఫోన్ లోకం నుంచి బయట పడతారు.