పిల్లల్లో సిగ్గు, బిడియం, మొహమాటం ఉండటం సహజం. కానీ ఈ అలవాటు వారిని అందరికీ దూరంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు కచ్చితంగా పిల్లల్లో ఉండే ఈ అలవాటును దూరం చేయాలి. అందుకోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి. చూసేయండి.
పిల్లల్లో సిగ్గు, బిడియం ఉండటం సాధారణం. కానీ పిల్లల్లో ఈ అలవాటు వారి నమ్మకాన్ని, సామాజిక సంబంధాలను దెబ్బతీస్తుంది. పిల్లల్లో ఉండే బిడియాన్ని పోగొట్టడం వారి ఎదుగుదలకు చాలా ముఖ్యం. మీ పిల్లల్లో ఉండే బిడియాన్ని పోగొట్టి సమాజంతో సఖ్యతగా మెలగడానికి సహాయపడే కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
1. కారణాలు తెలుసుకోండి:
మీ పిల్లలు ఎందుకు సిగ్గు పడుతున్నారో ముందుగా తెలుసుకోండి. దీనికి జన్యుపరమైన కారణాలు, గత అనుభవాలు లేదా వ్యక్తిత్వ లక్షణాలు కూడా కారణం కావచ్చు. వేర్వేరు పరిస్థితుల్లో వారి ప్రవర్తనను గమనించి, తగిన సూచనలు ఇవ్వండి. ఈ అవగాహన ఉంటే మీ పిల్లలు సిగ్గు, బిడియాన్ని సులభంగా ఎదుర్కోవచ్చు.
2. ఇతరులతో మాట్లాడటానికి ప్రోత్సహించండి
మీ పిల్లలను ఇతరులతో మాట్లాడటానికి ప్రోత్సహించాలి. వారు ఇతరులతో స్నేహంగా ఉన్నప్పుడు, వారిలో బిడియం కొంచెం కొంచెంగా తగ్గడం మొదలవుతుంది. ఇది వారి సామాజిక నైపుణ్యాలను, నమ్మకాన్ని పెంచడానికి సహాయపడుతుంది.
3. ఆదర్శంగా ఉండండి:
ప్రతి పిల్లవాడు తమ తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటాడు. కాబట్టి మీరు ఇతరులతో మాట్లాడే విధానం మీ పిల్లలకు మంచి మార్గదర్శకంగా ఉంటుంది.
4. సురక్షితమైన వాతావరణం:
పిల్లలు ఉండే ప్రదేశం ఎల్లప్పుడూ సురక్షితంగా, మద్దతుగా ఉండాలి. ఇది వారి కమ్యూనికేషన్ నైపుణ్యాలను ప్రోత్సహించడానికి, ఆందోళనలను తగ్గించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా వారి నమ్మకాన్ని పెంచేలా, సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల వారిలో బిడియం తగ్గుతుంది.
5. ప్రయత్నాన్ని మెచ్చుకోండి:
పిల్లలు చేసే ప్రతి చిన్న ప్రయత్నాన్ని మెచ్చుకోవడం మానకండి. నిజాయితీగా ప్రయత్నించడానికి వారిని ప్రోత్సహించండి. పిల్లల విజయంపై మాత్రమే దృష్టి పెట్టకుండా, వారు చేసే ప్రయత్నానికి కూడా ప్రాధాన్యత ఇవ్వండి.
6. సామాజిక నైపుణ్యాలను నేర్పించండి:
ఇతరులను పలకరించడం లాంటి ప్రాథమిక సామాజిక నైపుణ్యాలను మీ పిల్లలకు తప్పకుండా నేర్పించండి. ఇది వారికి చాలా సహాయపడుతుంది. ముఖ్యంగా వారి నమ్మకాన్ని పెంచడానికి ఈ నైపుణ్యం చాలా ఉపయోగపడుతుంది.
7. ఇది చేయకండి:
మా పిల్లవాడు బిడియస్తుడు అనే ముద్రను పిల్లలపై వేయకండి. ఇది వారి అభివృద్ధిని అడ్డుకుంటుంది. నమ్మకాన్ని తగ్గిస్తుంది. బదులుగా పిల్లల్లో ఉండే దయ, ఆసక్తి లాంటి సానుకూల లక్షణాలను ప్రోత్సహించాలి.
8. విజయానికి అవకాశాలను ఇవ్వండి:
మీ పిల్లలు సామాజికంగా విజయం సాధించడానికి వారికి అవకాశాలను ఇవ్వండి. అంటే వారు ఇష్టపడే పనులు చేయడానికి వారిని ప్రోత్సహించండి. దీనివల్ల వారి నమ్మకం పెరుగుతుంది.
9. ఓపిక అవసరం
మీ పిల్లల్లో ఉండే బిడియాన్ని పోగొట్టడానికి ఓపిక చాలా అవసరం. కాబట్టి వారితో కఠినంగా వ్యవహరించకుండా ఉండండి. వారు తమంతట తాముగా మారే వరకు మీరు వారికి మద్దతుగా ఉండి, మంచి మార్గంలో నడిపించండి.