హైకోర్టు మొట్టికాయలు: అయినా జగన్ ప్రభుత్వం తీరు మారలేదు

By Sree SFirst Published Apr 25, 2020, 3:33 PM IST
Highlights

తాజాగా ఆంధ్రప్రదేశ్ లో మరో సారి రంగుల రాజకీయం తెరమీదకు వచ్చింది. కొన్ని రోజుల కింద  ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగుల తొలగింపు కేసులో ఏపీ ప్రభుత్వానికి హై కోర్టులో చుక్కెదురయ్యింంది.  

ప్రపంచమంతా కరోనా వైరస్ తో పోరాడుతూ... ఆ మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలి అనే ఆలోచనలు చేయడంలో తలమునకలై ఉంటే.... ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మనకు రాజకీయ అంశాలకు, వార్తలకు కొదవ లేకుండా పోయింది. 

నిమ్మగడ్డఫ రమేష్ కుమార్ వ్యవహారం నుంచి మొదలు, ఇంగ్లీష్ మీడియం జీవోల కొట్టివేత, ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగుల వరకు ఇలా అనేక అంశాలు రాష్ట్రంలో కావలిసినంత రాజకీయ వేడిని రేపుతున్నాయి. 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ని కూడా రాజకీయాలకోసం వాడుకోవడం మరీ విడ్డురంగా ఉంది. అక్కడి ట్రాక్టర్ ర్యాలీలు, పూలు జల్లడాలు ఎన్ని వివాదాలకు కారణమయ్యాయో వేరుగా చెప్పనవసరం లేదు. 

అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ లో మరో సారి రంగుల రాజకీయం తెరమీదకు వచ్చింది. కొన్ని రోజుల కింద  ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగుల తొలగింపు కేసులో ఏపీ ప్రభుత్వానికి హై కోర్టులో చుక్కెదురయ్యింంది.  

రాష్ట్రంలోని పంచాయతీ భవనాలకు వేసిన పార్టీ రంగులు తొలగించేందుకు మూడు నెలల సమయం కావాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. మూడు నెలల గడువు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. కేవలం మూడు వారల సమయాన్ని మాత్రమే ఇచ్చింది. 

ఇలా ఈ భవనాలకు పార్టీ రంగులు వేయడానికి దాదాపుగా 1400 కోట్ల రూపాయలు ఖర్చయినట్టు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. హైకోర్టు తన తీర్పులో భవనాలకు పార్టీ రంగులను తీసేసి, ఎటువంటి రాజకీయ పార్టీకి సంబంధం లేని రంగులు వేయమని చెప్పింది. 

ఇలా చెప్పినప్పటికీ కూడా వైసీపీ వారు ఒక నూతన థియరీని తెరమీదకు తెచ్చారు. వారు తాజాగా రైతు భరోసా కేంద్రాలకు పార్టీ రంగులనే వేశారు. కాకపోతే చిన్న ట్విస్టు ఇచ్చి రైతు భరోసా కేంద్ర భవనం కింద భాగాన ఒక రకమైన ఎర్ర మట్టి (టెర్రా కోట ) రంగును వేశారు. దానిపైన గ్రామీణ నేపథ్యం ఉట్టిపడే బొమ్మలను పెయింటింగులుగా వేశారు. 

మిగితా రంగులన్నీ కూడా వైసీపీ పార్టీ రంగులు అలానే యథాతథంగా ఉన్నాయి. పార్టీ రంగులను మార్చలేదేందుకు అనే ప్రశ్నకు వైసీపీ వారు సరికొత్త రీతిలో ఒక తెలివైన సమాధానం చెబుతున్నారు. 

కింద ఉన్న మట్టి రంగు పంటలను పండించే భూమికి చిహ్నమని, మిగిలిన రంగులకు వైసీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వారంటున్నారు. నీలం రంగు నీలి విప్లవానికి(చేపల ఉత్పత్తికి సంబంధించింది), ఆకుపచ్చ రంగు హరిత విప్లవానికి (పంటల పెంపకానికి సంబంధించినది), తెలుపు రంగు క్షీర విప్లవానికి (పాల ఉత్పత్తికి) చిహ్నాలని వారు చెబుతున్నారు. 

హై కోర్టు క్లియర్ గా ఏ రాజకీయా పార్టీతో సంబంధం లేని రంగులను వేయమని చెప్పినప్పటికీ కూడా ఇలా వారి పార్టీ రంగులకే ఒక కొత్త నిర్వచనం చెప్పి వాటిని అలాగే ఉంచడం నిజంగా విడ్డూరం. 

ఇది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందా రాధా అనేది కోర్టు నిర్ణయిస్తుంది. దాంట్లోని న్యాయపరమైన అంశాలను పక్కనుంచితే... ఇలా కరోనా వైరస్ తో రాష్ట్రమంతా కుదేలై ఉన్న వేళ , రాష్ట్రంలో కేసుల సంఖ్య వెయ్యి దాటాక కూడా ఇంకా ఇలాంటి రాజకీయ విషయాలకే అత్యంత ప్రాముఖ్యతను ఇవ్వడం నిజంగా శోచనీయం. 

హై కోర్ట్ తీర్పుకు ఇలా ఏకంగా అధికార పార్టీయే డొంకతిరుగుడు మార్గంలో తూట్లు పొడవడం నిజంగా శోచనీయం. వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఎన్నికలు, భవనాలకు రంగులు లాంటి విషయాలను పక్కకు పెట్టి, వైరస్ ని ఎలా అరికట్టాలని ప్రయత్నిస్తే నిజంగా ఎంతో ఉపయుక్తకరంగా ఉంటుంది. 

click me!