ప్రణయ్ హత్య, మాధవిపై తండ్రి దాడి: వాటి పునాదులేమిటి?

By pratap reddy  |  First Published Sep 20, 2018, 12:40 PM IST

ప్రస్తుతం తెలంగాణ కులాంతర వివాహాలను వ్యతిరేకిస్తూ తండ్రులే దాడుల చేయడం వెనక ఉన్న నేపథ్యం ఏమిటనేది ఆసక్తికరమైన విషయంగా మారింది. నిజానికి, తెలంగాణ సమాజం కమ్యూనిస్టు ఉద్యమాలతో ప్రభావితమై కులరహిత సమాజంగా ఎదుగుతూ వచ్చింది.


ఒకప్పుడు ఆంధ్రలో కారంచేడు, పదిరికుప్పం సంఘటనలు జరిగినప్పుడు ప్రజాస్వామిక సమాజం తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది. దళితులపై దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమాలు కూడా చెలరేగాయి. అయితే, ఒక కుల సమూహం మరో కుల సమూహంపై జరిగిన దాడులుగా ముందుకు వచ్చాయి. అటువంటి పరిస్థితులు ఆ కాలంలో తెలంగాణలో లేవు.

ప్రస్తుతం తెలంగాణ కులాంతర వివాహాలను వ్యతిరేకిస్తూ తండ్రులే దాడుల చేయడం వెనక ఉన్న నేపథ్యం ఏమిటనేది ఆసక్తికరమైన విషయంగా మారింది. నిజానికి, తెలంగాణ సమాజం కమ్యూనిస్టు ఉద్యమాలతో ప్రభావితమై కులరహిత సమాజంగా ఎదుగుతూ వచ్చింది. క్రమంగా ఆ పరిస్థితులు మారిపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, అందుకు కమ్యూనిస్టు ఉద్యమాలు బలహీనపడడమే కారణమా అని ప్రశ్నిస్తూ అందులో పూర్తి సత్యం లేదని అర్థమవుతోంది. 

Latest Videos

undefined

బ్రిటిషాంధ్ర పాలనలో వచ్చిన సంస్కరణల వల్ల, దళితులకు విద్య అందుబాటులోకి రావడం వల్ల అక్కడి దళితులు ఎదుగుతూ వచ్చారు. దళిత సమాజం మధ్య తరగతిగా ఎదుగుతూ వచ్చింది. ఈ క్రమంలో అగ్రవర్ణాలతో మమేకం కావడానికి ప్రయత్నించింది. ఆ క్రమంలోనే అగ్రవర్ణ కులాల యువతులు, దళిత వర్గాల యువకులు పరస్పరం ఆకర్ణణకు లోనై వివాహాలు చేసుకోవడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. 

నిజాం పాలనలో ఉన్న తెలంగాణ సమాజంలో దళితులు ఎదగడానికి తగిన అవకాశాలు లేకుండా పోయాయి. బ్రిటిషాంధ్ర సంభవించిన పరిణామాలు తెలంగాణలో 70 దశకం తర్వాత గానీ చోటు చేసుకోలేదు. దళితులు చదువుకోవడం, సమాజంలో గౌరవనీయమైన స్థానాలను పొందడం ప్రారంభమైందని చెప్పాలి. ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతున్న క్రమంలో అగ్రవర్ణ యువతులతో వారు పరస్పరం ప్రేమలోకి వచ్చి, కులాంతర వివాహాల దాకా వచ్చింది. 

తెలంగాణ సాయుధ పోరాట కాలంలోనూ ఆ తర్వాత నక్సలైట్ ఉద్యమం బలంగా ఉన్న కాలంలోనూ కులాంతర వివాహాలు చాలానే జరిగాయి. కులాంతర వివాహాలు చేసుకున్న దంపతులు ఇప్పటికీ సఖ్యంగా ఉన్న సంఘటనలే అధికంగా ఉన్నాయి. కానీ అకస్మాత్తుగా కుల రాకాసి తెలంగాణలో తలెత్తింది. 

అలా తలెత్తడానికి దళితులు మధ్య తరగతిలో చేరిపోయే క్రమం ప్రారంభం కావడాన్ని బలమైన కారణంగా చెప్పవచ్చు. సమాజం ఎదుగుతున్న క్రమంలో, కులవృత్తులు నశించి అన్ని కులాల వాళ్ల వేర్వేరు రంగాల్లోకి ప్రవేశిస్తున్న ప్రస్తుత తరుణంలో కులం రద్దవుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ దాని పునాదులు బలంగానే ఉన్నాయి. కంచం కలుపుకోవడానికి ముందుకు వచ్చిన అగ్రవర్ణాలు మంచాన్ని పంచుకోవడానికి సిద్ధంగా లేరనేది తాజా సంఘటనలు తెలియజేస్తున్నాయి. 

దళితుల కుటుంబంలోకి తమ ఆడపిల్లలు వెళ్లడాన్ని అగ్రవర్ణాలు సహించలేని స్థితి. కులం అనేది కేవలం భౌతికమైందే కాకుండా మానసికమైంది కూడా. అందువల్ల దాని పునాదులు సంస్కృతిలో ఉంటాయి తప్ప ఆర్థికవ్యవస్థలో ఉండవు. ఆర్థికంగా బలమైన దళిత కుటుంబాలకు చెందిన కుటుంబాల్లోకి తమ పిల్లలు వెళ్లడాన్ని అగ్రవర్ణాలు వ్యతిరేకించడం వెనక బలమైన కారణం అదే. 

తాజాగా జరిగిన ప్రణయ్ హత్య సంఘటన గానీ, హైదరాబాదులో బీసీ కులానికి చెందిన వ్యక్తి కులాంతర వివాహం చేసుకున్న తన కూతురిపై, ఆమె భర్తపై దాడి చేయడం వెనక ప్రధాన కారణం దళితులను తమలోకి తీసుకోలేని సంస్కృతిని అలవరుచుకోలేకపోవడమే. 

కులం పునాదులను గుర్తిస్తే గానీ తెలంగాణలో పరువు హత్యలు ఎందుకు జరుగుతున్నాయనేది అర్థం కాదు. ప్రణయ్ భార్య అమృతవర్షిణి చెప్పినట్లు అగ్రకులాల్లో దళితుల పట్ల ద్వేషం పెరగడానికి రిజర్వేషన్లు కూడా కారణవుతున్నాయా అనేది పరిశీలించాల్సిన విషయమే. రిజర్వేషన్లు ఎందుకు అవసరమనే విషయంపై మొత్తం సమాజానికి అవగాహన కల్పించడంలో విఫలమైనట్లే భావించాలి. 

- కె. నిశాంత్

click me!