గతంలో తమిళనాడులో జయలలిత ప్రభుత్వం ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వం లాగే ఆర్టీసి కార్మికులకు ఉద్వాసన పలికింది. సుప్రీంకోర్టులో జయలలిత ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఎన్నికల్లో కూడా అన్నాడియంకె మట్టికరిచింది.
తెలంగాణ లో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె వల్ల తెలంగాణ వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పండుగ సీజన్ కావడంతో ఊర్లకెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం, కార్మికులు అమీతుమీకి సిద్ధమయ్యాయి.
విధుల్లోకి రాకపోతే డిస్మిస్ చేస్తామని ప్రభుత్వం బెదిరిస్తుంటే, ఇలాంటి బెదిరింపులు మాకు కొత్త కాదని ఆర్టీసీ సంఘాలంటున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ తో పాటు మరో 26 డిమాండ్లపై ఆర్టీసీ జేఎసి నేతలు సమ్మెకు దిగారు.
undefined
విధుల్లోకి రాకపోతే ఉద్యోగులను తొలగిస్తానని కెసిఆర్ అనగానే, ఊరికే బెదిరిస్తున్నాడని అనుకున్నారు తప్ప నిజంగా తీసేస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. అన్నట్టుగానే దాదాపు 48వేలమందిని విధుల్లోంచి తొలిగిస్తున్నట్టు కెసిఆర్ ఆదివారం రాత్రి తెలిపారు.
తెలంగాణ ఏర్పాటు కోసం సకలజనుల సమ్మె నుండి తెరాస అధికారంలోకి రావడం వరకు ఈ ఆర్టీసీ కార్మికుల పాత్ర చాలా కీలకమైనది. ఇటువంటి కార్మికులపైన ఎటువంటి కనికరం చూపెట్టకుండా వారిని ఇలా ఉద్యోగాల నుంచి తొలగించడంతో అందరూ అవాక్కయ్యారు. కార్మికుల కుటుంబాలైతే కెసిఆర్ ని దుమ్మెత్తిపోస్తున్నాయి.
2003లో ఇలానే సమ్మె చేస్తున్న 1.70 లక్షల మంది తమిళనాడు ఉద్యోగులను అప్పటి సీఎం జయలలిత తొలగిస్తే సుప్రీంకోర్టు ఉద్యోగులకు ఉపశమనం కల్పించింది.వాళ్లను తిరిగి తీసుకోవాలని చెబుతూనే, బేషరతుగా ప్రభుత్వానికి క్షమాపణ చెబుతూ.. భవిష్యత్‌లో సమ్మెలు చేయబోమంటూ ప్రమాణపత్రం ఇవ్వాలని ఉద్యోగులను ఆదేశించింది.
కొద్దిసేపు ఇది చట్టబద్ధమా, న్యాయ సమీక్షకు నిలుస్తుందా వంటి ప్రశ్నలు పక్కన పెడితే, అసలు రాజకీయంగా ఈ చర్య కెసిఆర్ కు ఎమన్నా ఇబ్బందులు కలిగిస్తుందా, చరిత్ర ఏం సూచిస్తుంది, ఒకసారి తెలుసుకుందాం.
2003లో జయలలిత ఇలానే తొలగించినప్పుడు న్యాయపరంగా అది నిలవలేదు. కార్మికులను తిరిగి తీసుకోవాల్సొచ్చింది. ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి, ప్రజలు ప్రభుత్వం వైపే ఉన్నారనుకున్న జయలలిత అంచనాలు తప్పాయి.
2004లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో జయలలిత పార్టీ ఏఐఏడీఎంకే ఒక్కటంటే ఒక్క సీటును కూడా దక్కించుకోలేకపోయాయి. ప్రత్యర్థి డీఎంకే అన్ని సీట్లను క్లీన్ స్వీప్ చేసింది. జయ పార్టీ ఓటమికి ముఖ్య కారణంగా ఈ తొలగింపునే పేర్కొంటారు రాజకీయ విశ్లేషకులు.
ప్రజలకు ఇబ్బంది కలిగినప్పటికీ, వారు ఒకింత అసహనం వ్యక్తం చేసినా ఇంత భారీ స్థాయిలో తొలిగిస్తే హర్షించరనేది చరిత్ర చెబుతున్న పాఠం. దానికి తోడు ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికుల పాత్రను ఇంకా తెలంగాణ సమాజం మర్చిపోలేదు.
సకలజనుల సమ్మె కాలంలో ఉమ్మడి ప్రభుత్వం జీతాలు చెల్లించకుంటే, తెలంగాణ ప్రజలే చందాలేసుకొని దసరా పండగకు అవసరమైన నిత్యావసరాలను వారికి అందించారు. ఇప్పుడు మరోమారు మాకు జీతాలు లేవు అని గనుక వారు రోడ్లపైకి వస్తే బాగా ఎమోషనల్ గా పరిస్థితి మారి రాజకీయంగా కెసిఆర్ కు ఇబ్బందులు తలెత్తవచ్చు.
ఇప్పటికే విపక్షాలన్నీ కెసిఆర్ కు వ్యతిరేకంగా ఏకమై కార్మికులకు సంఘీభావం తెలుపుతున్నారు. ఇదే సమయంలో ఏదన్నా ఇతర కార్మిక సంఘం కూడా సంఘీభావం తెలుపుతూ సమ్మెకు దిగితే సమస్య మరింత జఠిలం అవుతుంది.
ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలైతే లేవు. కానీ, అత్యంత ప్రతిష్టాత్మకమైన హుజూర్ నగర్ ఉప ఎన్నిక జరుగుతోంది. కేవలం రెండు వారాల్లోనే హుజూర్ నగర్ ప్రజలు తమ నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. ఈ సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో తెరాస శ్రేణులు ఎన్నికల వేళ ఈ కార్మికుల తొలగింపు నిర్ణయం తమకేమన్నా వ్యతిరేకంగా పనిచేస్తుందా అని కలవరపడుతున్నారు.