RTC Strike: ఇదేం వాదన, 'కులం' దొడ్డి దారిలో...

By telugu team  |  First Published Nov 4, 2019, 1:16 PM IST

ఆర్టీసీ సమ్మె సాగుతున్న ప్రస్తుత తరుణంలో కులాన్ని ముందుకు తెస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు రెడ్డి నాయకత్వాల్లో ఉన్నాయని, ఈ రెడ్డి నాయకులు కార్మికులను ముంచుతారో, తేలుస్తారో చూడాలని అంటున్నారు.


ఆర్టీసీ సమ్మె ప్రారంభమై దాదాపు నెల రోజులు కావొస్తోంది. అది తెగడం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దానికి ముగింపు పలకడానికి అనుసరిస్తున్న వైఖరి ఏమిటనేది ప్రశ్న. అదే విధంగా ఆర్టీసీ కార్మిక నేతలు అవలంబిస్తున్న వైఖరిపై కూడా ప్రశ్నలు వేసుకోవాల్సిందే. ఆ ప్రశ్నలకు లభించే సమాధానాన్ని బట్టి మేధావులు గానీ ప్రజలు గానీ ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. 

కార్మికులకు ఇప్పటి వరకు కేసీఆర్ మూడు డెడ్ లైన్లు ఇచ్చారు. విధుల్లో చేరాలంటూ కార్మికులకు పిలుపునిస్తూ ఆ డెడ్ లైన్ పెట్టారు. మూడో డెడ్ లైన్ గడువు మంగళవారం అర్థరాత్రికి ముగుస్తుంది. ప్రస్తుతానికి విధుల్లో చేరిన కార్మికులు ఎంత మంది అనేది లెక్క తేలాల్సి ఉంటుంది. 48 వేల మంది కార్మికుల్లో విధుల్లో చేరుతున్న కార్మికుల సంఖ్య నామమాత్రంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. 

Latest Videos

undefined

Also Read: RTC Strike: మెట్రోకు క్రాస్ సబ్సిడీ, ఆర్టీసీ ఏం చేసింది?

కొద్ది మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కొంత మంది కార్మికుల గుండెలు ఆగిపోయాయి. ఇందుకు కార్మిక నాయకులది, ప్రతిపక్షాల నేతలదే బాధ్యత అని కేసీఆర్ అంటున్నారు. కేసీఆర్ కార్మికులకు గడువు ఇస్తూనే బెదిరించే పద్ధతిలో మాట్లాడుతున్నారు. కార్మికులు విధుల్లో చేరకపోతే ఆర్టీసీయే ఉండదని అంటున్నారు. ఏమవుతుంది, ఆర్టీసీ ఉండదు అని ఆయన బాహాటంగానే చెప్పారు. అయినా కూడా కార్మికులు విధుల్లో చేరే విషయంలో ఎందుకు వెనకంజ వేస్తున్నారనేది ప్రశ్న.

గత నెల రోజులుగా కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించని ప్రస్తుత తరుణంలో కులం ఎజెండా మీదికి వస్తోంది. కార్మిక సంఘాలకు నాయకులు రెడ్డి కులానికి చెందినవారున్నారు. రెడ్డి నాయకత్వంలో ఉన్న కార్మిక సంఘాలు కార్మికులను ముంచుతాయా, తేలుస్తాయా, చర్చలు జరగనిస్తాయా అనే ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. ఈ ప్రశ్నలు వేయడంలో తప్పేమీ లేదు. ఆ ప్రశ్నలను వేసే ముందు ఆర్టీసీ సమ్మె ప్రారంభమైనప్పటి నుంచి సంభవించిన పరిణామాలను పరిశీలించాల్సి ఉంటుంది. ఆ పరిణామాలు ఎటు దారి తీస్తున్నాయని కూడా ఆలోచించాల్సి ఉంటుంది. 

Also Read: RTC Strike: కేసీఆర్ సెల్ఫ్ డిస్మిస్ లోని డొల్లతనం ఇదే..

ఆర్టీసీలో జనాభా నిష్పత్తి ప్రకారమే కార్మికులు ఉన్నారు. బీసీలు 25,342 (51 శాతం), ఎస్సీలు 9,495 మంది (19 శాతం), ఎస్టీలు 3,180 మంది (6.5 శాతం), ఓసీలు 4,577 మంది (9.5 శాతం) ఉన్నారు. మొత్తం 49,494 మంది కార్మికులు ఉన్నట్లు తేలింది. ఇంత మంది కార్మికులు ఉన్న సంఘాలకు రెడ్లు నాయకత్వం వహిస్తున్నారు. (ఎందుకు రెడ్లు మాత్రమే నాయకత్వం స్థానాల్లో ఉన్నారనేది వేరే చర్చ, ఇక్కడ అప్రస్తుతం).

మరొకసారి కార్మిక సంఘాల నేతల గురించి చేస్తున్న వ్యాఖ్యల దగ్గరకు వెళ్దాం. చర్చలను ఎవరు ముందుకు సాగనీయడం లేదని మొదట ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత చర్చల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఏమిటనేది గమనంలోకి తీసుకోవాలి. రెడ్ల నాయకత్వాలను దాటేసి ఇతర కులాలకు చెందినవారు ఎందుకు నాయకత్వంలోకి రావడం లేదని కూడా ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది. ఇంతకు ముందే చెప్పనట్లు ఇది ఇక్కడ చర్చనీయాంశం కాదు. మొత్తంగా చర్చలు ముందుకు సాగకపోవడానికి గానీ, చర్చల్లో ఫలితం తేలకపోవడానికి గానీ ప్రభుత్వం కారణమా, కార్మిక సంఘాల నాయకత్వం కారణమా అనే ప్రశ్న వేసుకోవాలి. అప్పుడు గానీ అసలు విషయం బోధపడదు.

సమ్మె ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం కార్మిక సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించింది ఒక్కసారి మాత్రమే. సమ్మెకు ముందు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. విఫలం కావడం వల్లనే కార్మికులు సమ్మెకు దిగారు. సమ్మె జరుగుతున్న కాలంలో జరిగిన చర్చలు కూడా ఆర్టీసీ యాజమాన్యం లేదా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం  వల్ల జరిగినవి కావు. హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో కమిటీ సభ్యులు కార్మిక నేతలతో చర్చలు జరిపారు. అంటే హైకోర్టు ఆదేశాలను పాటించామని చెప్పుకోవడానికి లేదా చర్చల్లో కార్మిక నేతలు సహకరించలేదని కోర్టుకు నివేదించడానికి లాంఛనంగా మాత్రమే చర్చలు జరిగాయని ఎవరికైనా అర్థమవుతుంది. 

Also Read: RTC Strike: ప్రభుత్వం కాకి లెక్కలు, ఆర్టీసీ ఆర్థిక స్థితిపై వాస్తవాలు ఇవీ..

ఒక వేళ, నేతలు ముంచుతారనే భావిస్తే కార్మికులు ఎందుకు సమ్మెలో కొనసాగుతున్నారనేది ప్రశ్న. దినమొక గండంగా సంసారాలను వెళ్లదీస్తూనే కార్మికులు నాయకత్వాల వెంట ఎందుకు ఉన్నారనేది నిజాయితీగా వేసుకోవాల్సిన ప్రశ్న. కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని చెప్పినా కూడా కార్మికులు బెదిరినట్లు కనిపించలేదు. తమ మహిళా కార్మికులు ఆర్టీసీ లెక్కలపై చర్చకు వస్తారని ఆర్టీసీ జేఎసి కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి అన్నారంటే, కార్మికులు ఆర్టీసీ పరిస్థితిపై ఎంతగా అవగాహనతో ఉన్నారో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 

ఆత్మహత్యలు చేసుకున్న కార్మికుల్లో బహుశా రెడ్డి కులానికి చెందినవారు కూడా ఉన్నారు. గుండె పోటుతో మృత్యువాత పడినవారిలో కూడా రెడ్డి కులానికి చెందినవారున్నారు. ఈ స్థితిలో కులం ప్రస్తావన తీసుకుని వచ్చి ఆర్టీసీ సమ్మెపై వ్యాఖ్యానించడం ఎంత వరకు సమంజసం.

బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు నాయకత్వ స్థానాల్లోకి రావాలనేది వేరే చర్చ. నిజానికి, ఆర్టీసీ సమ్మె విషయంలో కార్మిక సంఘాల నేతలు కార్మికుల ఉద్దేశ్యాలకు భిన్నంగా వ్యవహరించి ఉంటే సంఘాలు చీలేవి కావా, ఇలా సంఘాలు చీలిన సందర్భాలు ఎన్ని ఉద్యమాల్లో లేవు? నాయకత్వాల్లోకి ఇతర కులాల వాళ్లు ఎందుకు రావడం లేదనే ప్రశ్నకు, ప్రస్తుతం నడుస్తున్న ఆర్టీసీ సమ్మెకు నాయకత్వంపై వేస్తున్న ప్రశ్నకు అసలు పొంతన లేదు. కులం పేరు తీసుకుని వచ్చి ఆర్టీసీ సమ్మెపై వ్యాఖ్యానించడం, ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలదే బాధ్యత అన్నట్లు వ్యాఖ్యానించడం ఏ మేరకు సమంజసమని ఆలోచించుకోవడం ఇప్పటి అవసరం. 

ఆర్టీసీ కార్మికుల్లో 90.5 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఉన్నారు. తాము నాయకత్వాల వల్ల చిక్కులు ఎదుర్కుంటున్నామని భావిస్తే, విధుల్లో చేరడానికి కేసీఆర్ కల్పించిన అవకాశాన్ని వాడుకోవడానికి వీలుంది. అలా ఎందుకు చేయడం లేదనే ప్రశ్న మొత్తం సమ్మె విషయంలో అత్యంత ప్రధానమైంది.

click me!