రామకథ ఇంకా జాతిని ఎందుకు ఉత్తేజపరుస్తూ ఉంది?

First Published Apr 4, 2017, 2:24 PM IST
Highlights

ఈ దేశములో శ్రీరాముడు, పాండవులు సంచరించని  పల్లె  ఉండదు! ఊరూర దానికి సాక్షాధారాలు చూపుతారు. అది ఎంతవరకు చారిత్రకమో గాని, దేశ ప్రజలలోఐక్యతా భావం కల్పించడములొ రామాయణం కృతకృత్యమైన నిజాన్ని తోసి వెయ్యలేము. శ్రీరామచంద్రుడు భద్రాచలములొ అరణ్యవాసం జరిపినట్లు, అక్కడే మారీచిక సంహారం జరుపినట్లు, ఆయన పాద పద్మముల అచ్చు ఇంకా ఉన్నట్లు చూపుతారు. భద్రాచలం రామదాసు ”చరిత్ర” తెలియని వాడు ఆంధ్ర దేశములోనే కాదు, మొత్తం భారతావనిలో చాలా తక్కువ మంది ఉంటారు.

 "హిందువుల పండుగలు" 1931 లొ సురవరం ప్రతాప రెడ్డిగారు, హైదరాబాద్ నవాబ్ గారి అపేక్షించగా, కొత్వాల్ పింగళి వెంకటరామి రెడ్దిగారి ఆదేశం మెరకు, రాజా ధనరాజ గిర్జిగారి ధనసహాముతొ రచించిన పరిశోధనా గ్రంథం. దానికి పరిచయ వాక్యములు సర్వేపల్లి రాధాకృష్ణన్ పండితులవారివి.  ఇతర భాషల గురించి నాకు తెలియదు గాని, తెలుగులో మాత్రం అది తొలి ప్రయత్నం; ఈ నాటికి సమగ్రమైన గ్రంథం. శ్రీరామనవమి గురించి రాస్తూ రెడ్దిగారు: 

చైత్ర మాసె నవమ్యాంతు జాతొ రామ్ స్వయమ్ హరి: 

పునర్వసృక్షత్ర సంయుక్తా సా తిథి స్వర్వ్ కామదా.

 

వారే దీనిని తెనుగించారు:  చైత్ర మాస శుక్ల నవమి నాడు పునర్వసు నక్షత్రమందు శ్రీ మహా విష్ణువే స్వయముగా శ్రీ రామావతామెత్తెను. ఈ దినము సమస్థకామముల నొనగూర్చునట్టిది. 

            ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయములొ ప్రాచీన భారత చరిత్ర ప్రాచార్యుడైన వింసెట్ స్మిత్ మహాశయుడు, ఏ మాత్రము అతిశయము లేకుండా: Innumerable anecdotes in Ramayana and Mahabharata are more popular in rural India, than the fables of Bible and preachings of Koran in their respective lands." 1906 లో అన్నారు.  ఈ దేశములొ శ్రీరామ మరియు పాండవులు సంచరించని ఒక చిన్న పల్లె కూడా ఉండదు! ఆగ్రామ వాసులు ఆబాల గోపాలం, తరతమ భేదాలు లేకుండా దానికి సాక్షాధారాలు చూపుతారు. అది ఎంతవరకు చారిత్రకమో గాని, దేశ ప్రజలలొ ఐక్యతా భావం కల్పించడములొ కృతకృత్యమైన నిజాన్ని మనం తోసి వెయ్యలేము.

               శ్రీరామచంద్రుడు భద్రాచలములొ అరణ్యవాసం జరుపినట్లు, అక్కడే మారీచిక సంహారం జరుపినట్లు, ఆయన పాద పద్మముల అచ్చు ఇంకా ఉన్నట్ళు చూపుతారు. భద్రాచలం రామదాసు ”చరిత్ర” తెలియని వాడు ఆంధ్ర దేశములోనే కాదు, మొత్తం భారతావనిలొ చాలా తక్కువ మంది ఉంటారు. ఆ నాటి నవాబు మొదలు, ఈ నాటి ప్రజాస్వామ్యములోని ముఖ్యమంత్రుల వరకు, ప్రతి రామనవమి నాడు ప్రభుత్వం తరపున సీతారాముల వారికి, సరిగా మధ్యాహ్నం 12 గం. కు  ముత్యాల తలంబరాలు, పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. రాముడు పుట్టిన, చైత్ర శుక్ల, నవమి, పునర్వసు నక్షత్రములోనే ఆయనకు సీతమ్మతొ కల్యాణం జరిగిందని, అదే , రోజే పట్టాభిషేకం అని కొందరు పెద్దల అభిప్రాయం. కొంతవరకు ఈ అభిప్రాయం సమర్థనీయం. శ్రీ కృష్ణ జయంతిని, కేవలం జయంతిగానే, శ్రావణ బహుళ గుణాష్టమి, రోహిణి యందు, అర్ధ రాత్రి దాటిన తరువాత (కంసుని కారాగారములొ శ్రీకృష్ణుని జన్మ దినము, సమయం) జరుపుకొంటాము. ఆరోజు, ఇతర భక్ష భోజ్యాలతొ పాటు, బాలింతల మందులు దేవునికి నైవేద్యం. ఏది, ఏమైన శ్రీరామ నవమి పవిత్రత అసామాన్యం. ఆ రోజు ఇంటికి ఎవరు వచ్చినా బెల్లం, మిరియాలు, యాలకులతొ కలిపిన పానకం, పచ్చిమెరుపకాయి, అల్లం, కొబ్బరితొ కూడిన పెసర బ్యాడల పన్యారం; అతిథి సత్కారం.

 

నా తుంగభద్రా నది అధ్యయన  కాలములో అవగాహనకు వచ్చిన కొన్ని ఉదంతాలను పాఠకుల ముందు ఉంచుతాను. కర్ణాటక రాష్ట్రం,  చిక్కమగళూరు జిల్లా, కొప్ప తాలుకాలో, శృంగేరికి పది కీ.మీ. దూరములొ, తుంగా నది ఒడ్డున "ఆర్డికొప్ప" అనె గ్రామములో సుమారు రెండు వందల సంవత్సరాల పురాతమైన ఒక దేవాలయముంది. దాని శిల్పం నూటికి నూరు పాలు భద్రాచలం పోలిక.  అది శ్రీరామ చంద్రుడు విహరించిన స్థలమని ప్రతీతి. (ఆర్డికొప్ప పోవు ఉయ్యల వంతెన ఫోటో).

ఆర్డికొప్పకు సుమారు 55 కి.మీ. దూరములొ, శివమొగ్గ జిల్లా, తీర్థహళ్ళి తాలూకాలొ మృగవధె అనె పవిత్ర క్షేత్రం.  అక్కడ, తుంగా నది ఉపనదియైన బ్రాహ్మీ నది ఒడ్డున పురాతమైన మల్ల్లికార్జున స్వామి దేవాలయం. పేరే సూచిస్తున్నట్ళు, ఇక్కడ, (జింక ) మృగ రూపములొని మారిచికుడుని, శ్రీరామ చంద్రడు చంపినట్ళు, ఇక్కడికి పది కి.మీ. దూరములొ మండగద్దె ( ముండ - తల) ఆయన తల పడినట్లు, అక్కడికి దగ్గరలోని, కోలావర ( కొరళు  - మెడ) లొ జింక మెడ పడినట్లు స్థల పురాణం.  ఇక్కడ వార్షిక వాన: నూరు ఇంచులకు పైన ఉంటుంది. 

మృగవధె బ్రాహ్మీ నది దృశ్యం; మల్లికార్జున స్వామి దేవాలయం:

 

ఎంతో చరిత్ర గలిగిన ఇంకొక పవిత్ర స్థలం శివమొగ్గలోని కోటె (కోట) సీతారామాంజనేయ దేవాలయం( కిందిఫోటో). దీని ఐతిహ్యం కూడా రాములవారి అరణ్యవాసముతొ ముడిపడినది. ఒక జిల్లా ఒక తాలూకాలోనే ఇన్ని సాంస్కృతిక వారసత్వం గలిగి రామునితో అనుబంధమున్న ఇన్నిపవిత్ర క్షేత్రాలు ఉన్నప్పుడు, దేశ వ్యాప్తంగా ఎన్నుంటాయో మనం ఉహించలేము.

గుడి గోపురాలకంటె, జన జీవన స్రవంతిలొ రామాయణం వేలాది సంవత్సరాలుగా పోషిస్తున్న పాత్రం; అపారమైనది, అద్భుతమైనది. పద్యాలు, కావ్యాలు, పురాణాలు, నాటకాలు, హరికథలు, ప్రవచనాలు,  బుర్రకథలు, యక్షగానాలు, సినిమాలు, టీ.వి సీరియళ్లు, ;  గేరి, గేరిలలొ, పల్లె సీమలలొ జనాదరణ పొందిఉన్నవి. పాత రోజులలొ ఉన్నంత ఉండక పోవచ్చు, గాని నశించి పోలేదు; స్మిత్ పండితుడు దూర దృష్టితొ పలికిన పలుకులు నిజం. సాంస్కృతిక వారసత్వ్ం గురించి ఆలోచిస్తే: ఏక పత్ని వృతానికి శ్రీ రామ ,  పతిభక్తికి, సీతమ్మ, స్వామి భక్తికి హనుమంతుడు, కామ కేళికి రావణ, నిజాయితికి విభీషణ, గిరిపుత్రుల సంక్షేమానికి గుర్తులు. సుగ్రీవుని నాయకత్వములోని, కపి సైన్యానికి శ్రీరామచంద్రుల వారి అండదండలు, ఆధునిక "Welfare State" ఆదర్శముగా నిలిచిన సత్యం.  వైజ్ఞానికముగా: దేశ భూగోళం సుగ్రీవుడికు తెలుసు. సస్య శాస్త్రంలొ హనుమంతుడు నిష్ణాతుడు. రామ సేతు ఈ నాటికి నిలిచి పోయింది. భావనాత్మకముగా పరిశీలిస్తె, "ఉడుతా భక్తి; ఉడుతసేవ" వాస్తవమేమో అనుపిస్తుంది.  ఉడత వీపుపై మనదేశములొ  కనిపించె మూడు పట్టికలు అమెరికాలోని ఉడతల వీపుపై ఉండవు. ఇది నేను స్వయముగా చూసినది. ఇతర దేశాల గురించి నాకు తెలియదు. ప్రపంచములొ 285 రకముల ఉడుతలు గలవని, అవి దాదాపు ముప్పై మిలియన్ల సంవత్సరాల పురాతమైన జంతువులని, శాస్త్రజ్ఞుల అభిప్రాయం. రామాయణ కాలములొ అవి ఊహ కాదు. వాస్తవం. 

 

              రామాయణ కావ్యమనగానె దెశవ్యాప్తముగా, ఆదికవి వాల్మీకి రామాయణం తరువాత  జ్ఞాపపకం వచ్చె మొదటి గ్రంథం తులసీదాస్ ’రామచరిక మానస్’. తరువాతిది, తమిళములొ  ’కంబన్ రామాయణ’ మూడవది తెలుగులొని ’మొల్ల రామాయణం.’ ఈ నాలుగు గ్రంథాల ఆధారముగా రామానంద సాగర్ నిర్మించి, నిర్దేశించిన ’రామాయణ్’ హిందీ సీరియల్,  1987-88 లొ ప్రతి ఆదివారం ఉదయం 9నుండి 10 గం. వరకు దూరదర్శన్ లొ చూపించారు. విద్యుత్ కోత ఉండిన రోజులవి; ప్రభుత్వాల చొరవతొ, దేశాద్యంత ఆ సమయానికి సరఫరా ఆపేవారు కాదు. దేశ విదేశాలలొ కూడా అది జనాదరణ పొందింది.  మన దేశములోనే గాక  ప్రపంచములోనె అతి ఎక్కువ మంది చూసిన పురాణేతిహాస సీరియల్ గా చరిత్రకెక్కింది. గొప్ప, గొప్ప మేధావులు, తెలివి పరులు, జ్ఞానులెల్లరూ ఆసమయములొ టివికి దాసోహం కావడమే కాకుండా, టివికి పూజలు నిర్వహించారు; మడుగు కట్టుకొని కూర్చొన్నారు. ఇది మూడ నమ్మకం కాదు. రామాయణపై ప్రజలుకున్న భక్తి భావం. తరువాత  ఎన్.డి.టి.వి. 2008 లో చూపించింది. 

              జ్నాన పీఠ ప్రశస్తి పొందిన గ్రంథాలలొ 1967 లొ కన్నడ రచయిత కువెంపుగారి ’శ్రీ రామాయణ దర్శనం’ మరియు  1970 లొ తెలుగులొ విశ్వనాథ సత్యనారాయణ గారి ’రామాయణ కల్పవృక్షము’ గలవు. రామాయణ కథయే ఎందుకు వ్రాసినారో, విశ్వనాథవారు: 

వ్రాసిన రామచందృకథ వ్రాసితివనిపించుకో వృథా

యాసముగాక కట్టుకతలైహికమా! పరమా యటంచు దా
జేసిన తండ్రియాజ్ఞయును జీవునివేదన రెండు నేకమై
నాసకలోహ వైభవ సనాథము నాథకథన్ రచించెదన్

 

తండ్రి ఆనతి, జీవుని వేదన రెండూ ఏకమై ప్రేరేపించగా రామాయణ కల్పవృక్షం అవతరించిందని చెప్పుకున్నా రు..ఇందులో కావ్య ప్రేరణ (జీవునివేదన, తండ్రియాజ్ఞ, కావ్యేతివృత్తం, నాథకథన్ రచించెదన్, కావ్యరచన నా సకలోహవైభవ సనాథము) అనే అంశాలు ఈ పద్యంలో వ్యక్తమైనాయి. 

 

మరల నిదేల రామాయణం బన్నచో,
        నీ ప్రపంచకమెల్ల నెల్ల వేళ
తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు,
        తన రుచి బ్రదుకులు తనివి గాన
చేసిన సంసారమే చేయు చున్నది,

        తనదైన అనుభూతి తనది గాన
తలచిన రామునే తలచెద నేనును,
        నా భక్తి రచనలు నావి గాన
కవి ప్రతిభలోన నుండును గావ్యగత శ
తాంశములయందు తొంబదియైన పాళ్ళు
ప్రాగ్విపశ్చిన్మతంబున రసము వేయి
రెట్లు గొప్పది నవకథా దృతిని మించి.

మళ్ళీ రామాయణమే వ్రాయాలా అని అనుకునే వారికి ఎవరి అనుభూతి వారిదైనట్లుగా తన భక్తి రచనలు తనవి అని సమాధానం చెప్పాడు. ఇంత మంది వ్రాసిన రామాయణం మళ్ళీ వ్రాయడానికి విశ్వనాథ చెప్పిన కారణం ప్రతీ రోజూ తిన్న అన్నమే అని తినడం మానేయడం లేదు. సంసారంలో కష్ట సుఖాలున్నాయి కదా అని మనం మానేయడం లేదు. మన పిల్లల్నీ సంసార బంధంలోకి లాగుతున్నం కదా. అలాగే ఎవరి అనుభూతులు వారివి. ఈ రామాయణం నా అనుభూతి. నా రసాస్పందన” అని విశ్వనాధ వారు కావ్య రచనా హేతువును వివరించారు.

 

         ఆంధ్ర ప్రదేశ రాష్ట్ర విభజన తరువాత, భద్రాచలం తెలంగాణ రాష్ట్రం భాగమైనందున, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం,  కడప జిల్లాలోని కడపకి 25 కి.మీ. దూరములోని, విజయనగర శిల్ప కళావైభవానికి, నిలువెత్తు సాక్శి  భూతమైన, పదహరవ శతాబ్ధం కోదండరామ స్వామి దేవాలయాన్ని ఎన్నుకొంది. దానిని తిరుమల తిరుపతి దేవాలయ పాలక మడళి పరిపాలనకు ఒప్పజెప్పారు. వారు అభివృద్ధి చెయ్యడానికి పూనుకొన్నారు. ముఖ్యమంత్రిగారు మరియు గవర్నర్ గారు ముత్యాల తలంబ్రాలు, పట్టు బట్టలు సమర్పించనున్నారు.  భక్త కవి,  బమ్మెర పోతన తన భాగవాతాన్ని ఇక్కడే రచించాడని కొందరు పరిశోధకులు ఈ నాటికి, సాక్షాధారలు చూపుతున్నారు. ’ఆంధ్ర వాల్మీక’ బిరుదాంకితులైన వావిల కొలను సుభ్బా రావుగారు ఇక్కడే వాసముండెవారు.(ఒంటిమెట్ట కోదండరామాలాయం ఫోటో)

 

చిన్న వయస్సులొ, మొహన్ దాస్ కరమ్ చంద్ గాంధీగారు భయస్తుడు. పిరికి పందె అంటె తప్పుకాదు. భూతాలు దెయ్యాలు పేరెత్తితె,  భయబ్రాంతులతొ,  ఉచ్చ పోసుకునేవాడు. ఆయనకు రక్షకారులుగా ఉన్న ’ రంభ’ గాంధీకి ఉపదేశించింది: " నాయనా! దెయ్యాలు లేవు, భూతాలు లేవు. అది కేవలం నీ భ్రమ. అది మానసిక వ్యాధి. నీవు ’రామ నామం’ జపం చెయ్యి. అన్ని మాయమైపోతాయి."  ఆ రోజు మొదలు పెట్టిన రామ నామ స్మరణ జాతి పిత, మహాత్మా గాంధిజీ ’హే రామ్’ తొ జగత్ ప్రసిద్ధమైనది. (The life and death of MAHATMA GANDHI, Robert Payne, Page, 26 -30)

       మనం పూజించవలసిన రాముడు, ఎక్కడొ, అయోద్యాలోనో, భద్రాచలములోనో, ఒంటిమెట్టలోనో, ఆర్డికొప్పలోనో, మాత్రమే కాదు. వాల్మికి, తులసీదాస్, కంబన్, మొల్ల, విశ్వానాథ, కువెంపు, సృష్టించిన వాల్మీకి, విష్ణువే గదా: 

ఇందు గలడందు లేడను
సందేహంబు వలదు చక్రి సర్వోపగతున్
డెందెందు వెదెకి చూసిన
అందందే కలడు దానవాగ్రణి కంటే!

హే! రామ్. 

 

click me!