హోదాపై పోరు: చంద్రబాబుకు కౌంటర్, జగన్ ప్లాన్ ఇదీ

First Published Apr 23, 2018, 10:22 AM IST
Highlights

హోదాపై పోరు: చంద్రబాబుకు కౌంటర్, జగన్ ప్లాన్ ఇదీ

అమరావతి: ప్రత్యేక హోదా డిమాండుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేపట్టే కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కౌంటర్ సిద్ధం చేశారు. ఈ నెల 30వ తేదీన విశాఖపట్నంలో వంచన దినం పేరిట ఆందోళన చేపట్టాలని ఆయన నాయకులను ఆదేశించారు. 

చంద్రబాబు ఈ నెల 30వ తేీదన తిరుపతిలో దీక్ష చేపట్టే అవకాశం ఉంది. దానికి విరుగుడుగానే వంచన దినం కార్యక్రమాన్ని చేపట్టాలని జగన్ పార్టీ నాయకులను ఆదేశించినట్లు అర్థమవుతోంది. 

చంద్రబాబు దీక్ష చేపట్టే 30వ తేదీన విశాఖలో వంచన దినం పేరిట పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు 12 గంటల పాటు ఉపవాల దీక్ష చేపట్టాలని సూచించారు. చంద్రబాబు దీక్షల పేరిట ప్రజలను మోసం చేస్తున్నారని, చంద్రబాబు వంచనను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి నల్లదుస్తులు ధరించి వంచన దినం పాటించాలని ఆయన అన్నారు. 

ప్రత్యేక హోదా డిమాండుపై పార్లమెంటు సభ్యుల చేత రాజీనామాలు చేయించిన  జగన్మోహన్ రెడ్డి శాసనసభ్యుల చే రాజీనామా చేయించాలని ఆలోచిస్తున్నారు.తనతో పాటు తన పార్టీ శాసనసభ్యులందరి చేతా రాజీనామా చేయించి ప్రత్యేక హోదా పోరులో ముందు ఉండాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. 

ఆదివారం తన పాదయాత్ర ముగిసిన తర్వాత జగన్ కృష్ణా జిల్లా అరిగిపల్లిలో తన పార్టీ ఎంపీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల చివరి రోజున పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేసి ఆమరణ నిరాహారదీక్షకు దిగడం వల్ల హోదా కోసం చేస్తున్న పోరుకు ఊతం లభించిందని, గతంలో ప్రత్యేక ప్యాకేజీని ఆమోదించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని యూటర్న్ తీసుకునేలా చేసిందని ఆయన సమావేశంలో అన్నారు. 

శాసనసభ్యులు కూడా రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ఉద్యమానికి మరింత బలం వస్తుందని ఆయన అన్నారు. తనతో సహా శాసనసభ్యులమంతా సరైన సమయంలో రాజీనామాలు చేస్తామని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదా కోసం చేపట్టే ఉద్యమ రూపకల్పనపై రెండు గంటల పాటు చర్చ జరిగింది.
click me!