రియల్ సక్సెస్ స్టోరీ: రైల్వే స్టేషన్ నుంచి ఐఎఎస్ దాకా..

First Published Apr 28, 2018, 6:07 PM IST
Highlights

ఇదో స్ఫూర్తిదాయకమైన కథ. కథలాంటి జీవితం. జీవితంలో అన్నీ సినిమా కష్టాలే. కానీ లక్ష్యాన్ని వదలలేదు. యుపిఎస్సీ పరీక్షల్లో ర్యాంక్ కొట్టేశాడు.

చెన్నై: ఇదో స్ఫూర్తిదాయకమైన కథ. కథలాంటి జీవితం. జీవితంలో అన్నీ సినిమా కష్టాలే. కానీ లక్ష్యాన్ని వదలలేదు. యుపిఎస్సీ పరీక్షల్లో ర్యాంక్ కొట్టేశాడు. అతను తమిళనాడుకు చెందిన ఎం. శివగురు ప్రభాకరన్. 

అది 2004 సంవత్సరం. ఇంజనీర్ కావాలని కలగన్నాడు. అయితే చెన్నైలో జరిగిన కౌన్సెలింగ్ సెషన్ కు వెళ్లడానికి కూడా డబ్బుల్లేవు. తండ్రి తాగుబోతు. తంజావూరు జిల్లా మెలోట్టంకాడు గ్రామం. 

సెయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషన్ నుంచి ఐఐటి మద్రాసుకు చెరుకున్నాడు. త్వరలో ఐఎఎస్ ఆఫీసర్ కాబోతున్నాడు. గురువారం యుపిఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో అతను 101వ ర్యాంక్ సాధించాడు. 

ఆర్థిక పరిస్థితి వల్ల పన్నెండో తరగతి తర్వాత విద్యను కొనసాగిస్తాననే నమ్మకం అతనికి లేదు. తండ్రి తాగుబోతుగా మారి కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో భారమంతా తల్లిపైనా సోదరిపైనా పడింది. దాంతో కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండడానికి శివగురు చిన్న చిన్న పనులు చాలా చేశాడు. 

రెండేళ్ల పాటు కట్టెకోత యంత్రం ఆపరేటర్ గా పనిచేశాడు. పొలం పనులు చేశాడు. వచ్చినదాంట్లో కొంత కుటుంబానికి ఇస్తూ కొంత తన చదవు కోసం దాచిపెడుతూ వచ్చాడు. 

2008లో తమ్ముడి ఇంజనీరింగ్ చదువుకు, సోదరి పెళ్లికి సాయం చేశాడు. ఆ తర్వాత వెల్లూరులోని తాంతియా పెరియార్ సాంకేతిక ప్రభుత్వ సంస్థలో సివిల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు. ఇంగ్లీష్ సరిగా రాదు, విద్య అంతా తమిళ భాషలో నడిచింది. పైగా, మధ్యలో గ్యాప్. 

ఐఐటి కొట్టాలనే లక్ష్యంతో చెన్నై చేరుకున్నాడు. పేద పిల్లలకు శిక్షణ ఇచ్చే సెయింట్ థామస్ మౌంట్ లోని ట్యూటర్ వద్దకు వెళ్లాడు. ట్యూటర్ వద్ద శిక్షణ పొందుతూ వారాంతాల్లో రాత్రుళ్లు సెయింట్ థామస్ రైల్వే స్టేషన్లో పడుకునేవాడు. 

ఆ తర్వాత వెల్లూరు వెళ్లి అక్కడ మొబైల్ షాపులో పనిచేసేవాడు. తర్వాత ఐఐటి ప్రవేశ పరీక్ష రాసి ఐఐటి మద్రాసులో ఎంటెక్ చేశాడు. మధ్య మధ్యలో యుపిఎస్సీ పరీక్ష రాస్తూ వచ్చాడు. నాలుగోసారి అతను సివిల్స్ లో ర్యాంక్ సాధించాడు. 

అన్నీ ఉండి సివిల్స్ కొట్టడం కష్టం కాకపోవచ్చు. కానీ ఏమీ లేకుండా సివిల్స్ లో ర్యాంక్ సాధించిన శివగురు ప్రభాకరన్ ది నిజమైన సక్సెస్ స్టోరీ.

click me!