మళ్లీ తెలంగాణ పోరు షురూ?

First Published Dec 5, 2017, 1:51 PM IST
Highlights
  • చరిత్ర పునరావృతమవుతున్నాదా!
  • అవే నినాదాలు, అదే ఆగ్రహం,
  • అదే విధంగా  క్యాంపస్ లో  టెన్షన్, అవేలాఠీలు, అదే టియర్ గ్యాస్...
  • తెలంగాణ ఉద్యమం మళ్లీ మొదలువుతన్నట్లు లేదూ...

 

నిన్న సరూర్ నగర్ స్టేడియంలో  కొలువులకై కోట్లాట మీటింగ్ లో  అన్ని పార్టీల వాళ్లు కెసిఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉంటే ఉండు- పోతే పో అన్నారు. తెలంగాణ తెచ్చుకున్నది ‘నీ కుటుంబం కోసం కాదు, ప్రజల కోసం’ అన్నారు. పోరాటం సాగుతుందిక అన్నారు. ఇది కమిషన్ల ప్రభుత్వం అన్నారు. కాంట్రాక్టర్ల ప్రభుత్వం అన్నారు. రాష్ట్రమంతా అసాధారణ నిర్బంధం కొనసాగుతున్నదన్నారు. ఉద్యోగాలన్నీ నోటిఫై చేయన్నారు.

 మధ్యలో  ప్రజాగాయకుడు గద్దర్  ‘పొడుస్తున్నపొద్దు మీద నడుస్తున్న కాలమా...’ అంటూ గొంతెత్తారు. సభంతా నినాదాలో హోరు. ఈ పాటే ఆ రోజు ఉద్యమ కాలంలో ప్రతి తెలంగాణ సభని, ప్రతితెలంగాణ గుండెని భగ్గున మండించింది. సభలో ఉన్న జనంలో అదే ఆగ్రహం. కడుపు మండుతున్న అదే క్రోధం.

ఉద్యోగాల్లేక ఒక వైపు తల్లితండ్రులు, మరొకవైపు పిల్లలు ఎలా అల్లాడిపోతున్నారో జెఎసి ఛెయిర్మన్ ప్రొఫెసర్ కోదండ్ రాం  ఆ నాటి లాగే వివరించారు. ‘తెలంగాణలో రెండు లక్షల నుంచి 3లక్షల వరకు ఖాళీలు ఉన్నయనిసర్కార్ కు మేము అంకెలు ఇచ్చినం. మేము ఇచ్చిన అంకెలపై, గణాంకాలపై నిలబడేందుకు సిద్ధంగా ఉన్నాం. సర్కారు చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలు. మోసపూరిత లెక్కలు,’ అని ఆ నాటి లాగే ఆయన అన్నారు. ఇక విద్యావేత్త చుక్కారామయ్య  ఏమన్నారు, ‘ప్రజా సమస్యలు లేవనెత్తితే ఆ మనుషులను ఏవిధంగా(తెలంగాణ పాలకులు) టార్చర్ చేస్తున్నారో చూస్తున్నాను. పత్రికల్లో చదువుతున్నాను... ఆదే మాట ఆయన ఆంధ్రోళ్ల పాలన మీద కూడా  అన్నారు. ఇంకా ఏమన్నారు? ’తెలంగాణ భవిష్యత్తు ప్రకాశవంతంగా కనబడతలేదు నాకు.’ అని నాటి లాగే అవేదన చెందారు.

ఇక మేధావి ప్రొఫెసర్ నాగేశ్వర్ ‘ఇది ఇది కొలువులకై కొట్లాట కాదు ప్రజలకై కొట్లాట,’ అని ఉద్యమకాల భాషలో అన్నారు. అంతేనా, ‘నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఒక విధానం ప్రకటించేదాకా విద్యార్థులు, నిరుద్యోగులు కొట్లాడాల్సిందే.. మనలాంటి వాళ్లందరూ భాగస్వామ్యంతో పనిచేయాల్సిందే,’ అన్నారు. ఇదే భాష. ఉద్యమ భాష

ఈ ఆగ్రహం ఏమిటి? ఈ భాష, ఈ హెచ్చరికలు ఏమిటి?

ఇవన్నీ నాటి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తుచేస్తున్నాయి. ఆరోజు ఇదే నాయకులు, ప్రొఫెసర్ కోదండ రామ్, గద్దర్,చుక్కారామయ్య తదితరులు ఆంధ్ర పాలకులను ఇలాగే నిలదీశారు. ఇష్యూ కూడా ఇదే, ఉద్యోగాలు.పోరాటం ఇదే, పాట అదే. నిర్భంధం అదే. నినాదం అదే.

అంటే, రెండో తెలంగాణ ఉద్యమం మొదలయినట్లనిపిస్తుంది. చేజారిన తెలంగాణను చేజిక్కించుకునేందుకు , ఒక కుటుంబానికి తెలంగాణ జాగీరుగా మారకుండా, జనమందరి తెలంగాణ, విద్యార్థుల తెలంగాణా, రైతుల తెలంగాణ రావాలంటున్నారు... ఈ దోరణి కూడా నాటిదే.

ఇక అటు వైపు ఉస్మానియా యూనివర్శిటి క్యాంపస్ లో ఉన్న సీన్ ఏమిటి? అదీ నాటిదే.

 

ఆ రోజు ఆంధ్రపాలకులనుంచి తెలంగాణ విముక్తి కోసమని విద్యార్థులు ఆత్మబలిదానం చేసుకున్నారు. ఇపుడేమవుతున్నది, వచ్చిన తెలంగాణ  రాష్ట్రం ఒక కుటుంబం జాగీరు కాకూడదంటున్నారు.  తొలి తెలంగాణ ఉద్యమం నినాదం ‘ఉద్యోగాలు’ దీనిని నిజం చేయమని ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. ఉస్మానియ విద్యార్థి మురళి ఆత్మబలిదానం క్యాంపస్ ను రగిలించింది. ఓయూ మరోసారి రణరంగంగా మారింది. తమ తోటి విద్యార్థి నిరుద్యోగ సమస్యతో  ఆత్మహత్య చేసుకోవడం విద్యార్థులు జీర్ణంచుకోలేకపోయారు. క్యాంపసంతా నిరసన హోరు లేచింది. ఆడమగ విద్యార్థులంతా మళ్లీ రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మురళిది ఆత్మహత్య కాదు ప్రభుత్వం చేసిన హత్యేనన్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అచ్చం నాటి ఆంధ్రా పోలీసుల్లాగే ప్రవర్తించారు. గొడ్డును బాదినట్లు బాదారు. హాస్టల్ గదుల్లోకి చొరబడి లాఠీ ప్రయోగించారు. విద్యార్థుల హాహాకారాలు. పోలీసుల వేట. రాత్రంతా ఇదే తంతు. క్యాంపస్ పోలీస్ క్యాంపయింది. అంతటా ఒకటే టెన్షన్.

ఇదంతా ఏమిచెబుతుంది.  చరిత్ర పునరావృతమవుతున్నాదా! అవే నినాదాలు, అదే ఆగ్రహం, అదే విధంగా టెన్షన్, అవేలాఠీలు, అదే టియర్ గ్యాస్...తెలంగాణ ఉద్యమం మళ్లీ మొదలువుతన్నట్లు లేదూ...

 

 

click me!