మాజీ కేంద్ర మంత్రి పి శివశంకర్ మృతి

First Published Feb 27, 2017, 7:28 AM IST
Highlights

 ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలకు అత్యంత సన్నిహితుడిగా ఉండిన దక్షిణ భారత వెనకబడిన వర్గాల నాయకుడాయనే

మాజీ కేంద్ర మంత్రి, ఒకప్పటి కాంగ్రె స్ నాయకుడు,న్యాయకోవిదుడు పుంజాల శివశంకర్ (పి.శివశంకర్) హైదరాబాద్ లో మృతి చెందారు. కొద్ది రోజులగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. ఈ ఉదయం కన్ను మూశారు.  1929, ఆగస్టు పదిన   హైదరాబాద్ సమీపంలో ని మామిడి పల్లిలో ఆయన జన్మించారు. అమృత్ సర్ హిందూ కాలేజీ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.తర్వాత  ఉస్మానియా  యూనివర్శిటీ నుంచి ఎల్ ఎల్ బి పూర్తి చేశారు. 1955 లో ఆయనకు లక్ష్మిబాయ్ తో  వివాహం అయింది. అయనకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు.

 

1974-75లో  ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ న్యాయమూర్తిగా ఉన్నారు.  తర్వాత  1979లో సికిందరాబాద్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.  ఆ నియోజకవర్గం నుంచి 1980 లో రెండో దఫా ఎన్నికయ్యారు.  1981లో ఇందిరాగాంది మంత్రివర్గంలో చాలా కీలకమయిన నాయకుడిగా ఉన్నారు.  అపుడాయన న్యాయ శాఖమంత్రి. న్యాయ పాలనలో  ఒక కీలకమయిన సంస్కరణగా పేరుపొందిన లీగల్ఎయిడ్ ఆయన  ఆలోచనే. 1977 లో ఎమర్జీన్సీ తర్వాత ఆయన ఇందిగా గాంధీకి న్యాయవాదిగా కూడా ఉన్నారు. అపుడు మాజీ కర్నాటక గవర్నర్ హన్స్ రాజ్ భరద్వాజ్  శివశంకర్ కి సీనియర్ అసిస్టెంట్.

 

ఆయన ఇద్దరుకుమారులలో పెద్ద కుమార్ సుధీర్ చాలా కిందట చనిపోయారు. రెండవ కుమారుడు వినయ్ కాంగ్రెస్ పార్టీ లో ఉంటున్నారు.  ఆయన హైదరాబాద్ లో పేరున్న డాక్టర్.

 

ఆయన మొదటి సారి గా 1977 లో ఇందిరాగాంధీ ని కలుసుకున్నా తన అపార న్యాయ విజ్ఞానంతో ఆమె మ నసు చూరగొనడమే కాకుండా అతితక్కువ కాలంలో ఆమెకు అత్యంత సన్నిహితుడయ్యారు. ఆయన కీలకమయిన బాధ్యతలు నిర్వహించారు. ఆయన పెట్రోలియం మంత్రిగా  కూడా పనిచేశారు.

 

ప్రధాని నివాసానికి దగ్గరలో  5, సఫ్దర్ జంగ్ లేన్ బంగళాను ఆయన కేటాయించారు. ఒకసారి లోకసభ ఎన్నికలలో ఓడిపోయినా(మెదక్) చాలామంది లాగా ఆయన క్రియా శీల రాజకీయాలనుంచి  కనుమరుగు కాలేదు. కాంగ్రెస్ నాయకత్వం ఆయనను గుజరాత్ నుంచి రాజ్యసభ కు తీసుకువచ్చింది.  ఏ సభలో సభ్యత్వం లేని రోజులలో కూడా ఆయనకు ప్రధాని నివాసంతో గట్టి  సంబంధాలు ఉండేవి. అందుకే   సఫ్దర్ జంగ్ లేన్  నివాసం చాలాకాలం కొనసాగింది. ఇందిర, రాజీవ్ కాలంలో అన్నికీలకమయిన పార్టీ, ప్రభుత్వ నిర్ణయాలలో ఆయన పాత్ర వుండేది.

 

1985లో శివశంకర్  రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1993 దాకా రాజ్యసభలోనే కొనసాగారు. ఈ మద్యలో ఆయన  విదేశీ వ్యవహారాల శాఖ,  మానవ వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. కొద్ది రోజులు ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ ఛెయిర్మన్ గా కూడా పనిచేశారు. 1988-89 లో రాజ్యసభ కాంగ్రెస్ పక్ష నాయకుడి గా ఉన్నారు. తర్వాత సిక్కిం , కేరళ వర్నర్ గా నియమితులయ్యారు. 1998లో తెనాలి నుంచి లోక్ సభ కు పోటీచేసి గెలుపొందారు. 2004 లో ఆయన కాంగ్రెస్ ను వదిలేశారు. తర్వాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో చేరారు. ప్రజారాజ్యం తర్వాత కాంగ్రెస్ లో విలీనమయింది.

 

బలహీన వర్గాల నాయకుడి గా పేరున్న శివశంకర్ తెలంగాణా మూన్నూరు కాపు కులానికి చెందిన నాయకుడు.  రాజీవ్ గాంధీ  హాయంలో ప్రభుత్వంలో ప్రధాని తర్వాత చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి శివశంకరే. మరొక పేరు చెప్పుకుంటే అది  ఎం ఎల్ ఫోతే దార్.

 

రాజీవ్ హాయంలో చాలా కీలకమయిన నిర్ణయాలెన్నో తీసుకున్నా సరే ఆయన పనితీరు ఎపుడూ వివాదాస్పదం కాలేదు. ఆయనకూడా ఎపుడూ వార్త లకెక్కేప్రయత్నం చేయలేదు. రాజీవ్ దూతగా ఆయన నేపాల్, బంగ్లాదేశ్ లను సందర్శించి ఇరుగుపొరుగు దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడంలో ప్రధానికి బాగా సహకరించేవాడని ఆయన  మిత్రులు చెబుతారు. పంజాబ్ ఒప్పందంలో కూడా శివశంకర్ కీలక ప్రాత పోషించాడని చెబుతారు.

 

click me!