మేకిన్ ఇండియా ఇన్షియేటివ్ చేపట్టినా ఐటీ, ఫైనాన్స్‌ల్లోనే కొలువులు

By Arun Kumar P  |  First Published Sep 12, 2019, 4:10 PM IST

మోదీ సర్కార్ దేశీయంగా పారిశ్రామిక ఉత్పత్తిని పరుగులు పెట్టించేందుకు ‘మేకిన్ ఇండియా’ నినాదాన్ని తీసుకొచ్చినా ఆచరణలో ఐటీ, ఫైనాన్స్ రంగాల్లో మాత్రమే ఉద్యోగాలు ఎక్కువగా లభిస్తున్నాయి. వాటిల్లోనూ మహిళలే ఎక్కువగా కొలువులు పొందుతున్నారు.
 


ముంబై: మేక్ ఇన్ ఇండియా నినాదంతో దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. అత్యధికంగా ఐటీ, ఆర్థిక సేవల సంస్థలే ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ఉపాధి కల్పనకు ఉత్పాదక రంగంపైనే మోదీ సర్కారు దృష్టి పెడుతున్న విషయం తెలిసిందే. 

కొలువుల కేంద్రాలుగా ఐటీ, ఫైనాన్స్ రంగాలే ఉంటున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లలోని 250 అగ్రశ్రేణి సంస్థలపై ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ సీఎల్‌ఎస్‌ఏ ఓ అధ్యయనం నిర్వహించింది. ఐటీ, ప్రభుత్వ-ప్రైవేట్ ఆర్థిక, ఎనర్జీ, కన్జ్యూమర్ డిస్క్రియేషనరీ, ఔట్‌సోర్సింగ్ జాబ్ సేవలు, టెలికం, నిర్మాణ, ఇతరత్రా రంగాల్లోని సంస్థల ఉద్యోగ ముఖచిత్రాన్ని సీఎల్‌ఎస్‌ఏ పరిశీలించింది. 

Latest Videos

undefined

51 శాతం ఉద్యోగాలు ఐటీ, ప్రభుత్వ-ప్రైవేట్ ఆర్థిక సంస్థల్లోనే ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. మొత్తం ఈ 250 సంస్థల్లో 45 లక్షల మంది ఉద్యోగులుండగా, ఐటీ రంగానికి చెందిన కంపెనీల్లోనే 26 శాతం (దాదాపు 13 లక్షల ఉద్యోగులు) పనిచేస్తున్నారు. ఇక ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల్లో 17 శాతం, ప్రైవేట్ రంగ ఆర్థిక సంస్థల్లో 8 శాతం ఉన్నారని తేలింది. అంతేగాక ఈ రెండు రంగాల్లోనే ఎక్కువగా మహిళా ఉద్యోగులున్నట్లు కూడా రుజువైంది.

ఇక మిగతా రంగాల్లో  వరుసగా ఔట్‌సోర్స్‌డ్ జాబ్ సర్వీస్ (15 శాతం), ఎనర్జీ (9 శాతం), కన్జ్యూమర్ డిస్క్రియేషనరీ (7 శాతం) ఉన్నాయి. ఇతర రంగాలకు చెందిన సంస్థల్లో 18 శాతం ఉద్యోగులు పనిచేస్తున్నారు.

గత ఆర్థిక సంవత్సరం (2018-19) ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగుల సంఖ్య 2.6 శాతం క్షీణించింది. ఇదే సమయంలో ప్రైవేట్ రంగ సంస్థల్లో 9.2 శాతం పెరుగడం గమనార్హం. ప్రభుత్వ రంగ బొగ్గు ఉత్పాదక దిగ్గజం కోల్ ఇండియా (సీఐఎల్)లో 4.4 శాతం, బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో 2.6 శాతం ఉద్యోగాలు పోయాయి. 
స్థూలంగా 2018-19లో అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2017-18)తో పోల్చితే ఉద్యోగులు పెరిగారు. 238 సంస్థల్లో గతంతో చూస్తే ఇది 1.4 శాతం నుంచి 4.1 శాతానికి ఎగిసినట్లు తాజా సర్వేలో సీఎల్‌ఎస్‌ఏ పేర్కొన్నది. ఇది మూడేండ్ల గరిష్ఠమని చెప్పింది. మూడు భారీ ఔట్‌సోర్సింగ్ జాబ్ సర్వీస్ సంస్థలనూ పరిగణనలోకి తీసుకుంటే ఈ వృద్ధిరేటు 6 శాతానికి చేరుతున్నది తెలిపింది.

టెలికం రంగం, ప్రస్తుతం సంక్షోభ సంకేతాల్ని ఎదుర్కొంటున్న నిర్మాణ రంగాల ప్రస్తావన తాజా సర్వేలో మచ్చుకైనా లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. టెలికం, రియల్ ఎస్టేట్ రంగాల వాటా 0గా సీఎల్‌ఎస్‌ఏ పేర్కొన్నది. ఈ రంగాల సంస్థల్లో ఉద్యోగావకాశాల పరిస్థితికి ఇది అద్దం పడుతున్నది. మరోవైపు గత ఆర్థిక సంవత్సరం స్టాక్ మార్కెట్ లిస్టింగ్ సంస్థల ఉద్యోగుల సగటు వేతనాలు దాదాపు 9.9 శాతం పెరిగాయి. దీంతో గడిచిన ఐదేండ్లలో ఇదే అత్యంత వృద్ధిదాయక సంవత్సరంగా నమోదైంది.

ఇదిలా ఉంటే భారత ఐటీ రంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్).. ఉద్యోగ కల్పనలో ముందున్నది. దాదాపు 4,20,000 మంది ఉద్యోగులు టీసీఎస్‌లో పనిచేస్తున్నారు. వీరిలో మహిళల సంఖ్యే 1,52,114గా ఉన్నది. 

మొత్తం ఉద్యోగుల్లో 36 శాతానికి సమానం. అయితే ఇన్ఫోసిస్‌లో ఇది 37 శాతంగా ఉండటం విశేషం. మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ఉద్యోగుల సగటు వయో పరిమితి 46 నుంచి 40కి పడిపోయిందని సీఎల్‌ఎస్‌ఏ తెలిపింది.
 

click me!