ఎటుచూసినా అంబేద్కరే... అంబేద్కర్ న్యాయమెక్కడా కనిపించదు

First Published Apr 14, 2017, 6:45 AM IST
Highlights

దేశంలో అంబేద్కర్ ని సొంతం చేసుకొనని వాళ్లే లేరు. ఆ సర్వత్రా అంబేద్కర్ పండగలు జరుగుతున్నాయి. ఆయన విగ్రహాలకు పూలు, పాలాభిషేకాలకు లెక్కలేదు. సమాజమంతా ఇంతగా అంబేద్కర్  మయమయినా దళిత వాడలుపుట్టుకొస్తున్నాయి. దళితుల మీద అత్యాచారాలు సాగుతున్నాయి. లోపమెక్కడుంది, ఎవరు దీనికి బాధ్యత వహించాలి, అగ్రవర్ణాలు, బిసిలు,వొసి లు ఏంచేయాలిపుడు... దీని మీద హైదరాబాద్ లో శనివారం చర్చ జరుగుతూ ఉంది.

బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్. భారత ప్రజల ఆస్తి. భారత ప్రజల ఆశ.  ఒకవైపు ఆ మహనీయుడిని ప్రపంచ పీడిత ప్రజల హక్కుల సాధకుడిగా ఐక్యరాజ్య సమితి గుర్తిస్తూ ఉంటే, మన దేశంలోనూ ఆయన జయంతి ఉత్సవాలు ప్రభుత్వాలు జరుపుతూ ఉంటే... ఆయన భారత దేశంలో "అంటరాని జాతి"లో పుట్టాడు కాబట్టి దళితులలో కొన్ని వర్గాలకే ఆ మహనీయుడిని పరిమితం చేసే కుట్రను బద్దలు కొట్టాలి. ఓటు హక్కు, స్వేచ్చా సమానత్వాలు, భావ ప్రకటన హక్కు.. ఒక్క మాటలో ఆయన రాసిన రాజ్యాంగమే ఈ దేశప్రజలందరికీ గౌరవ జీవనం చూపే, దిశానిర్దేశం చేసే మేనిఫెస్టో, పవిత్ర గ్రంథం!

 

Ambedkar For All. అవును.అంబేద్కర్ అందరివాడు

 

బీసీలు కూడా సమాజంలో సేవక జాతులుగానే ఉన్నారు కాబట్టి తాను స్థాపించిన షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ ను బీసీలు కలసివస్తే బీసీ ఫెడరేషన్ గా మారుస్తానని అన్నవాడు... మహిళలకు ఆస్తి హక్కు సాధించే హిందూ కోడ్ చట్టం కోసం అమాత్య పదవి నుంచి వైదొలగినవాడు...  అందుకే ఆయన అందరివాడు. ఈ విషయం అందరికంటే ముఖ్యంగా ఓసీ-బీసీలే గుర్తించాల్సి ఉంది. ఆయన ప్రతిపాదించిన రిజర్వేషన్లు సహా స్వేచ్చా సమానత్వ భావనలతో భారత ప్రజాస్వామ్యం పరిపుష్ఠం కావలసి ఉంది. ఆ లక్ష్యంతో ఆ మహనీయుని గురించి మరికొంత తెలుసుకుందాం. ప్రచారంలో పెడదాం.

 

1.            చుండూరు, కారంచేడు, నీరుకొండ, పదిరికుప్పం, లక్షింపేట ఇక జరగొద్దు

2.            కంచికచర్ల కోటేశు, మంథని మధుకర్ హత్యలు ఇక సాగొద్దు

3.            రిజర్వేషన్ల వెనుక సామాజిక కోణాన్ని అర్థం చేసుకుందాం

4.            ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం వచ్చిన తరువాతే బాధితులకు దక్కుతున్న న్యాయాన్ని గుర్తిద్దాం. ఈ చట్టపు బలోపేతానికి పనిచేద్దాం.

5.            ఈ దేశ సమగ్రతకు, అఖండతకు పాటు పడదాం

6.            భారత రాజ్యాంగ నిర్మాత సాక్షిగా ఈ దేశ పౌరులందరినీ సొంత మనుషులుగా భావిద్దాం.

7.            ఆహార, ఆహార్య, ఆచార, వ్యవహారాలను గమనంలోకి తీసుకుందాం

8.            రాజకీయవేత్తలు, రచయితలు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు గా అంబేద్కర్ దృష్టికోణాన్ని అర్థం చేసుకుందాం

 

ఆర్.కృష్ణయ్య (ఎమ్మెల్యే), ప్రొఫెసర్ కోదండరాం, గాదె ఇన్నయ్య, చెరుకు సుధాకర్, జస్టిస్ చంద్ర కుమార్, శ్రవణ్ దాసోజు, అరవింద్ కుమార్ గౌడ్, ఒంటేరు ప్రతాప్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, దిలీప్ రెడ్డి, ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర రావు, ప్రొఫెసర్ రామయ్య, రాజారాం యాదవ్, సంధ్య, బాలలక్ష్మి, రచనా రెడ్డి, ఆర్. వెంకట రెడ్డి, సౌదా-అరుణ, మహెజబీన్ బేగ్, భాగ్యలక్ష్మి, గీతాంజలి భారతి, ఏకె ప్రభాకర్, బమ్మిడి జగదీశ్వర రావు, ఇంద్రవెల్లి రమేష్, భండారు విజయ, అరణ్యకృష్ణ, నాయిని రవీందర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, సజయ, సంతోష్ రెడ్డి... ఇంకా పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు, రచయితలు, కళాకారులు ఎందరో పాల్గొంటారు.

 

కొలంబియా యూనివర్శిటీలో పాఠ్యాంశంగా ఉన్న Ambedkar Autobiography బైలింగువల్ ఎడిషన్ (సౌదా అరుణల తెలుగు సేత, వ్యాఖ్యానం) పుస్తకాల పంపిణీ కూడా ఉంటుంది. విద్యార్థులకు ఉచితం. రూ. 50 చొప్పున కనీసం పది కాపీలు కొని, పంచగలిగే వారు ఉదారంగా ముందుకు రావాలని మనవి. అన్ని వర్గాల విద్యార్థులు, యువ కార్యకర్తలు తరలిరావాలని ప్రజా తెలంగాణా  విజ్ఞప్తి చేస్తున్నది.

click me!