తాజా ప్రీ పోల్ సర్వే: కర్ణాటకలో గెలుపెవరిది?

First Published Apr 28, 2018, 10:30 PM IST
Highlights

కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని తాజా ప్రీ పోల్ సర్వే తెలియజేస్తోంది

హైదరాబాద్: కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని తాజా ప్రీ పోల్ సర్వే తెలియజేస్తోంది. ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ఎన్టీవీ, ఎన్జీ మైండ్ ఫ్రేమ్ సంయుక్తంగా నిర్వహించిన తాజా సర్వే ఆ విషయాన్ని తెలియజేస్తోంది. ఆ సర్వే ఫలితాలను, విశ్లేషణను ఎన్టీవీ శనివారం సాయంత్రం వెల్లడించింది. 

దక్షిణాదిన అత్యంత కీలకమైన కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మే 12వ తేదీన జరగనున్నాయి. ముక్కోణపు పోటీ అనివార్యంగా మారిన కర్ణాటకలో అతి పెద్దగా పార్టీగా కాంగ్రెసు అవతరిస్తుందని, అయితే అధికారం చేపట్టడానికి అవసరమైన మెజారిటీకీ కొద్ది దూరంలో ఆగిపోతుందని ఆ సర్వే తేల్చింది.

బిజెపి రెండో స్థానంలో నిలుస్తుందని చెప్పింది. అయితే, జెడి (ఎస్) కింగ్ మేకర్ అవుతుందని చెప్పింది. బిజెపి, జెడిఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని కూడా తెలిపింది. 

కర్ణాటక శాసనసభ మొత్తం స్థానాలు 224 కాగా, అధికారం చేపట్టడానికి 113 స్థానాలు అవసరమవుతాయి. అయితే, ప్రస్తుత పాలక పార్టీ కాంగ్రెసుకు 95 నుంచి 105 స్థానాలు వస్తాయని, కాంగ్రెసు వైపు  39.47  శాతం మంది ఓటర్లు మొగ్గు చూపినట్లు తెలిపింది. 

బిజెపికి 75 నుంచి 85 సీట్లు వస్తాయని ప్రీ పోల్ సర్వే అంచనా వేసింది. ఆ పార్టీ వైపు 36.28 మంది ఓటర్లు మొగ్గు చూపుతున్నట్లు తెలిపింది. జెడిఎస్ 35 నుంచి 41 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని, ఆ పార్టీకి 21.83 శాతం మంది ఓటర్ల మద్దతు ఉందని తెలిపింది. ఇతరులు 2.42 శాతం ఓట్లతో 4-8 సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని తేల్చింది.

ఈ సర్వేను అత్యంత శాస్త్రీయంగా నిర్వహించినట్లు ఎన్టీవీ చెప్పుకుంది. 224 నియోజకవర్గాల్లో ఈ సర్వే నిర్వహించినట్లు తెలిపింది. అభిప్రాయ సేకరణకు యాప్ ను తయారు చేసి యాప్ సమాచారాన్ని నేరుగా ఆన్ లైన్ సర్వర్ కు అందించినట్లు తెలిపింది.

సర్వేకు సమగ్రమైన ప్రశ్నావళిని రూపొందించినట్లు చెప్పుకుంది. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది, ప్రస్తుత ప్రభుత్వ పాలన ఎలా ఉంది, ప్రభుత్వ పథకాలపై ప్రజాభిప్రాయం ఎలా ఉంది, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై ప్రజల అభిప్రాయం ఎలా ఉంది వంటి పలు ప్రశ్నలతో సర్వే నిర్వహించినట్లు తెలిపింది. 

ఇంటింటికీ వెళ్లి ఓటర్లను పలకరించినట్లు తెలిపింది. అయితే, చివర రోజుల్లో విస్తృతమైన ఎన్నికల ప్రచారం జరుగుతుంది కాబట్టి సర్వే ఫలితాల అంచనాలు మారే అవకాశం లేకపోలేదని కూడా చెప్పుకుంది. 

click me!