సర్వేపల్లి రాధాకృష్ణన్ కర్నూలు అనుభవం ఏమిటో తెలుసా?

First Published Sep 5, 2017, 10:43 AM IST
Highlights

భారత రాష్ట్రపతి కాన్వాయ్ కారు తగలి ఒక పిల్లవాడు గాయపడ్డాడు. అపుడు రాష్ట్రపతి పడిన అదుర్దా అంతా ఇంతా కాదు, అదేమిటో చదవండి

నేను  రెండు సార్లు రాధాకృష్ణన్ గారిని చూసినాను. హెలికాప్టర్ సంస్కృతి రాని రోజులు. ఒక సంఘటన నేను మర్చిపోలేనిది. శ్రీశైలం -హైదరాబాద్ రహదారి ఇంకా నిర్మాణానికి నోచుకొని రోజులు. 1964 లో  కర్నూలునుండి కారులోె వెళ్లాలి. కాన్వాయిలో ఐదారు కార్లు మాత్రమే. కర్నూలులో ఒక అపశ్రుతి దొర్లింది.  ఒక చిన్న పిల్లవాడికి ఒక కాన్వాయ్ కారు తగిలింది. అదృష్టవశాత్తు ,అది పెద్దాస్పత్రికి ఎదురుగా జరిగింది. కాన్వాయి ఆగింది. రాష్ట్రపతి అగాడు. పిల్లవాడిని ఆస్పత్రికి తరలించారు.భారత రాష్ట్రపతి రాధాకృష్ణన్ నడుచుకొంటూ ఆస్పత్రి అత్యవసర చికిత్సగదికి వెళ్లారు. అక్కడ ఆదుర్దాగా  కూర్చొన్నారు. పిల్లవాడిని పరీక్షించిన వైద్యులు చిన్న చిన్న గాయాలేనని తీర్మానించి ప్రథమ చికిత్సచేసి పిల్లవాడిని వారి సంరక్షకులకు అప్పజెప్పారు. అపుడు గాని రాష్ట్రపతి తేరుకోలేదు. తరువాత రాధాకృష్ణన్ గారు బయటకు నడుచుకుంటూ వచ్చి కారు ఎక్కబోతున్నారు. అపుడు జిల్లా పోలీస్ అధికారి విక్టర్ సిబ్బందిని ప్రమాదం మీద నిలదీస్తున్నారు.అది రాష్ట్రపతి కంట పడింది. అంతే, ఆయన  పోలీసు అధికారి దగ్గరకు పోయి, వీపు మీద చెయ్యేసి: "Be calm, cool yourself. They are also human beings," అన్నప్పుడు అధికారి తలవంచుకొన్నారు.  

సర్వేపల్లి   ధాకృప్ణయ్య జీవితంలో  అబ్బురపరిచే 14 అంశాలు ఇవి...

1.  1928, నవంబర్, 17,18 న  నంద్యాలలో ఆంధ్ర మహాసభ జరిగింది.దానికి అనిబిసెంట్ అధ్యక్షత వహించగా ప్రకాశం పంతులు, కట్టమంచి రామలింగా రెడ్డి, కొండా వెంకటప్పయ్య లతో పాటు ఆప్పటికే వేదాంతిగా ప్రపంచ ఖ్యాతి పొందిన సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా వచ్చారు. ఆయన తెలుగులోనే ప్రసంగించారు. చిలుకూరి నారాయణ రావు సూచన మేరకు "దత్త మండల జిల్లాలు" , ‘‘రాయలసిమ’’గా మారిందీ సభలోనే.

  2. మైసూరు విశ్వవిద్యాలయము నుండి  రాధాకృష్ణన్   కలకత్తా విశ్వవిద్యాలయానికి ఉద్యోగ రీత్యా వెళ్తున్నప్పుడు, విద్యార్థులు, అధ్యాపక బృందమే గాక సమస్త ప్రజానికం ఆయనను బండిలో (పూలరధం) కూర్చొబెట్టి రైల్వే నిల్దాణం(స్టేషన్) వరకు లాగి  గౌరవం ప్రకటించారు. దివానులకు, మహారాజులకు కూడాఇలాంటి గౌరవం దక్కి ఉండదు.

  3. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో  ఉపన్యాసాలివ్వడానికి ఆహ్వానం పొందిన ప్రథమ  భారతీయుడు సర్వెేపల్లి. అక్కడి సభాభవనం సరిపడక ప్రేక్షకులు బయట నిలుచుకొని సర్వేపల్లి ఉపన్యాసం విన్నారు. 

4. సురవరం ప్రతాపరెడ్డిగారి పరిశోధనా గ్రంథం,  "హిందువుల పండుగలు"కు 1931 లోరాధాకృష్ణన్ ‘పరిచయ వాక్యములు’ రాశారు.

5. 1931-36 మధ్యకాలములొ, సర్కేపల్లి రాధాకృష్ణన్  ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ఉన్నారు.  దాని పురోభివృద్ధికి అంచనాకు మించి కృషిచెేశారు. ఒక వేదాంతి అయినా  గొప్ప గొప్ప విజ్ఞానులను అహ్వానించి వైజ్నానిక విషయాలను భోదించే శాఖలను ప్రారంభించారు. వారివల్ల విశ్వవిద్యాలయానికి వచ్చిన వారిలో  డా.టి.ఆరె.  శేషాద్రి, డా.సూరి భగవంతం, ఆచార్య హిరేన్ ముఖర్జీ, ఆచార్య హుమాయూన్ కబీర్, ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య, సి,వి.రామన్, తదితరులున్నారు.      

   6.  సోవియట్ రష్యాకు నియమితులైన  భారత దేశపు మొట్ట మొదటి దౌత్యవేత్త డా. రాధాకృష్ణన్. "దేవుడిని నమ్మని  దేశానికి, దేవుడే సర్వస్వం అనే మీరు రాయభారిగా పోతున్నారు. ఇదెలా పొత్తు కుదురుతుంది" అన్న ప్రశ్నకు "Truth, Eternity and Beauty, (సత్యం, శివం, సుందరం) are the symbols of the God. Russians believe in them." అని విమర్శకుల నోరు మూపించారు.

7.రష్యా దేశపు నియంత స్టాలిన్, తన అధికార నివాసం( క్రెమ్లిన్) లో, రాధాకృష్ణన్ కు స్వాగతం పలికేందుకు   లేచి వచ్చి స్వయంగా  వాకిలి తెరిచారు. రష్యానుంచి తిరిగొస్తున్నపుడు డా. రాధాకృష్ణన్ స్టాలిన్ దగ్గరవెళ్ళి, వీపు మీద చెయ్యేసి  క్షేమ సమాచారాలు  విచారించారు. అపుడు స్టాలిన్ చలించారు.  గద్గగ స్వరంతో, కన్నీళ్ళు కారుస్తూ: " రక్కసిగా కాక, మానవునిగా నన్ను చూచిన ప్రథమ వ్యక్తి మీరు. మా దేశమునించి వెళ్ళి పోవడం నాకెంతొ విచారం కలిగిస్తున్నది. మీరు చిరకాలం పాటు జీవించాలని నా కోర్కె. నేను మరెన్ని రోజులు బ్రతుకుతానో తెలియదు." అన్నారు. 

8.ఉపరాష్ట్రపతి ముఖ్య విధి రాజ్యసభ అధ్యక్షత. దానిని సమర్థవంతంగా పది సంవత్సాల పాటు నిర్వహించారు. వారి హాయాంలో సభలో ఉన్న ప్రముఖుల్లో కొందరు: అల్లాడి కృష్ణ స్వామి అయ్యర్, సత్యేంద్రనాథ బోస్, ప్రథ్విరాజ కపూర్, రుక్మిణి దేవి అరుండేల్, జకీర్ హుస్సైన్, మైథిలి శరణ్ గుప్త, కాకాసాహెబ్ కాలెల్కర్, రాధాకుముద్ ముఖర్జీ, పి.వి.కాణె, మోటూరి సత్యనారాయణ, వాడియా, తారాచంద్,  భూపెష గుప్తా, ఫణిక్కర్, జైరామదాస్ దౌలత్ రామ్, తారాశంకర్ బంద్యోపాధ్యాయ, మొహన్లాల సక్షేనా, వి.టి.కృష్ణమాచారి. ఈ గంభీరోపన్యాసకులను ఆయన సంస్కృత శ్లోకాలు ఉదహరించి శాంతపరిచే వారు.

9.1953, జనవరి 11,12,13,14 తేదిలలొ గడియారం రామకృష్ణ శర్మ నేత్రత్వంలో  అలంపూరులో "ఆంధ్ర సారస్వత పరిషత్" సప్తమ వార్షికోత్సవాలు జరిగాయి. అపుడు అలంపూర్  రాయచూరు జిల్లాలో ఉండింది. తరువాత మహబూబ్ నగర్ జిల్లా కొచ్చింది.   ప్రస్తుతం జోగుళాంబా జిల్లాలో ఉంది.  సభ ప్రారంభోత్సవానికి, నిజామ్ గారి విశేష రైలు పెట్టెలొ, ప్రత్యేక రైలులొ ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు విచ్చేశారు. వారి తెలుగు ప్రసంగం విన్న తరువాత కొందరు సభికుల కోరిక మెరకు కొన్ని మాటలు ఆంగ్లంలో పలికారు. ఆయనతో పాటు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి, బూరుగుల రామకృష్ణ రావు సభకు వచ్చారు.

10. రాష్ట్రపతిగా వారి ఆగస్ట్, 14 వ రాత్రి, స్వాతంత్య్ర దినోత్సవ సందేశాన్ని, ఆకాశవాణిలో నేను  క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం విన్నాను. 1964 లొ హిందీ వ్యతిరేక ఉద్యమం ఉధృతంగా, హింసాత్మకముగా మారినఫ్పుడు, వారు సందేశంలో  "భాషలన్ని సరస్వతి దేవి యొక్క వివిధ స్వరూపములు " అనే భావం గలిగిన " సర్వజ్ఞమ్ తత అహం వందే/ పరంజ్యోతి తపావహమ్/ యన్ ముఖద్ దేవి/ సర్వ భాషా సరస్వతి" శ్లోకాన్ని ఉదహరించారు. 

11.   చాగ్లాగారు  ఇంగ్లాండ్ లో హైకమిషనర్ గా ఉన్నప్పుడు రాధాకృష్ణన్ అక్కడ పర్యటనకు వెళ్ళారు. ఒక రోజు కామన్ వెల్త్ సభ నుంచి వాపసు వస్తూ, వస్తూ, తన రచనల ప్రచురణ కర్త అల్లెన్ & ఉన్ విన్ (Allen & Unwin) అక్కడే ఉందని తెలిసుకున్నారు. సిబ్బంది, రక్షక భటులు ఎవ్వరు నచ్చజెప్పినా వినుపించుకొకుండా ఆ భవనానికి వెళ్ళి , మెట్లెక్కి మొదటి అంతస్తులో అల్లెన్ వాకిలు తట్టారు. అల్లెన్ బయటికి వచ్చినిశ్చేష్టుడయ్యాడు. ‘మీరు ఒక మాట ముందే చెప్పిఉంటె మీకు స్వాగతం పలకడానికి ఏర్పాటు చేసెవాడిని కదా,’ అన్నారు. "నేను భారత రాష్ట్రపతిగా మీదగ్గరకు రాలేదు. ఒక రచయితగా వచ్చాను. నా పుస్తకాలు ఎలా అమ్ముడు పోతున్నవి." అని నిరాడంబరంగా అడిగి తెలుసుకున్నారు.  

12.  ముగ్గురు ప్రధానులకు, నెహ్రూ , శాస్త్రి, ఇందిరా గాంధి లతో ప్రమాణం నిర్వహించిన ఏకైక రాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్. 

13.దేశంలో  అత్యున్నత పదవినలకరించినా, సమకాలీన  ప్రపంచములొ ఒక గొప్ప మేధావియైనా, ఎన్ని పురస్కారాలు పొందినా, నయ, వినయ, నమ్రతతో, పంచ కట్టు, తల పాగాతో పదహారాణాల తెలుగువాడిగా నిల్చారు. 

14. తెలుగులో సంతకం చేయాల్సి వచ్చినపుడు ఆయన సర్వేపల్లి రాధాకృష్ణయ్య అనే రాసేవారు. అదే ఆయన అసలు పేరు.

“అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను/ సజ్జనుండు బల్కు జల్లగాను / కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా/ విశ్వదాభి రామ వినుర వేమా!”

 

(రచయిత చంద్రశేఖర కల్కూర జీవనం కోసం హోటల్ నడిపారు.  కన్నడ, తెలుగు,  ఆంగ్ల పండితుడు. కర్నూలులో స్థిరపడ్డ ఉడుపి బ్రాహ్మణుడు. కన్నడ మహారచయిత శివరామకారంతకు స్నేహితుడు)

click me!