ట్విట్టర్ లో అనేక మంది ప్రముఖల ఖాతాలు గురువారం బ్లూ టిక్ లను కోల్పోయాయి. ఇందులో రాజకీయ నాయకులు, సినీ సెలబ్రెటీలు, క్రీడాకారుల ఖాతాలు ఉన్నాయి. ఈ ఖాతాలు నెల వారీ రుసుము చెల్లించకపోవడంతో బ్లూటిక్ ను కోల్పోయాయి.
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ట్విట్టర్ గురువారం అనేక ఖాతాల నుంచి లెగసీ వెరిఫైడ్ బ్లూ టిక్లను తొలగించింది. ఇందులో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు మరెంతో మంది రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రెటీలు, క్రికెటర్లు ఉన్నారు. ఈ బ్లుూ టిక్ ప్రముఖులకు గుర్తింపునివ్వడంతో పాటు ట్విట్టర్ యూజర్లు మోసగాళ్ల బారిన పడకుండా సహాయపడుతుంది. అయితే ట్విట్టర్ తాజా చర్య వల్ల వారంతా బ్లూటిక్ ను కోల్పోయారు.
యువకుడిపై అత్యాచారం.. బస్సులో నుంచి దించి మరీ దారుణం.. వీడియో తీసి డబ్బులు వసూలు..
ఎందుకు ఇలా ?
ట్విట్టర్ ను కొంత కాలం కిందట ప్రపంచ వ్యాపార కుబేరుడు ఎలన్ మస్క్ కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి ఆయన ట్విట్టర్ లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ మైక్రో బ్లాగింగ్ సంస్థను లాభాల్లోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆయన బ్లూ టిక్ ఉన్న యూజర్లు నెల వారీ రుసుము చెల్లించాలని నిర్ణయించాడు. చెల్లించని వారు బ్లూ టిక్ ను కోల్పోతారు.
దీని ప్రకారం భారత్ లో ఐఫోన్లు, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు నెలకు రూ.900 చెల్లించాలి. అలాగే ట్విట్టర్ ను వెబ్ సైట్ లో ఉపయోగించేవారు నెలకు రూ.650 వరకు చెల్లించాలి. ఏడాది పాటు సబ్స్క్రిప్షన్ తీసుకునేవారికి కొంత తగ్గింపును అందిస్తోంది. అయితే నెలవారీ రుసుము చెల్లించని వారి ఖాతాల నుంచి బ్లూ టిక్ లను తొలగిస్తామని ట్విటర్ గతంలోనే ప్రకటించింది. అయితే దీనిని గురువారం నుంచి అమలు చేయడం ప్రారంభించింది.
ఒరిజినల్ బ్లూ-చెక్ సిస్టమ్ కింద ట్విట్టర్ లో సుమారు 300,000 వెరిఫైడ్ యూజర్లు ఉన్నారు. వీరిలో చాలా మంది జర్నలిస్టులు, సెలబ్రిటీలు అథ్లెట్స్, ప్రజాప్రతినిధులు, ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రభుత్వ సంస్థలు, లాభాపేక్షలేని సంస్థలు, పబ్లిక్ సర్వీస్ ఖాతాలు ఉన్నాయి. నెలవారి రుసుము చెల్లించకపోవడంతో ఇందులో చాలా ఖాతాలు ఇప్పటికే బ్లూ టిక్ ను కోల్పోయాయి.
బ్లూ టిక్ లను కోల్పోయిన ప్రముఖ రాజకీయ నాయకులు
ట్విట్టర్ లో ఇప్పటి వరకు అనేక మంది రాజకీయ నాయకులు ఖాతాలు బ్లూటిక్ ను కోల్పోయాయి. ఇందులో మమతా బెనర్జీ, అసదుద్దీన్ ఓవైసీ, మాయావతి, ఎం.వెంకయ్య నాయుడు, యోగి ఆదిత్యనాథ్, అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రమణ్ సింగ్, అమిత్ మాలవీయ, సిద్దరామయ్య, డీకే శివకుమార్, బసవరాజ్ ఎస్ బొమ్మై, మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ ఖాతాలు ఉన్నాయి.
జమ్మూకాశ్మీర్ పూంచ్ లో భారీ ఉగ్రదాడి.. ఐదుగురు జవాన్లు మృతి.. దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ
వీరితో పాటు క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సౌరవ్ గంగూలీ, బాట్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్, టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా, బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, అక్షయ్ కుమార్, అలియా భట్, దీపికా పదుకొణె, రణ్ వీర్ సింగ్ ల ఖాతాలు కూడా బ్లూ టిక్ ను కోల్పోయాయి.