Online Fraud : రీ ఫండ్ కు ట్రై చేస్తే.. రూ.44వేలు కాజేశారు.. ఫుడ్ డెలివరీ యాప్ మోసం..

By SumaBala BukkaFirst Published Dec 9, 2021, 9:42 AM IST
Highlights

ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా క్యాన్సిల్ చేసిన రూ. 240 ఆర్డర్‌ను రీఫండ్ పొందేందుకు ప్రయత్నించిన మహిళ నిండా మోసపోయింది. కస్టమర్ కేర్ నెంబర్ పనిచేయకపోవడంతో.. గూగుల్ లో దొరికిన ఇంకో నెంబర్ కు కాల్ చేయడంతో ఆ నకిలీ కస్టమర్ కేర్ సిబ్బంది రూ. 44,000లు కాజేశారు. 

చెన్నై : అరచేతిలో Onlineతో ఎన్నో ఉపయోగాలు.. వాటితో పాటే మరెన్నో సమస్యలూ ఎదురవుతున్నాయి. ముఖ్యంగా డబ్బుల విషయంలో అనేక సార్లు మోసపోవాల్సి వస్తోంది. ఆన్ లైన్ Transactions విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా.. చాలాసార్లు సైబర్ కేటుగాళ్ల వలలో పడాల్సి వస్తోంది. 

అలాంటి సంఘటనే చెన్నైలో తాజాగా చోటు చేసుకుంది. ఓ మహిళ Food Delivery App లో ఫుడ్ ఆర్డర్ చేసింది. దీనికోసం రూ.240లు కట్టేసింది. అయితే డబ్బులు కట్ అయ్యాయి కానీ.. డెలివరీ యాప్ లో చూపించడం లేదు. దీంతో కంగారు పడింది. తాను కట్టిన డబ్బులు తనకు తిరిగి కావాలి కాబట్టి Refundకు ట్రై చేసింది. అదే ఆమె పాలిట శాపంలా మారింది. 

ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా క్యాన్సిల్ చేసిన రూ. 240 ఆర్డర్‌ను రీఫండ్ పొందేందుకు ప్రయత్నించిన సదరు మహిళ నుంచి నకిలీ కస్టమర్ కేర్ సిబ్బంది రూ. 44,000లు కాజేశారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెలూన్-కమ్-పార్లర్‌లో పనిచేస్తున్న వడపళనికి చెందిన బాధితురాలు కృతిక (23) ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్‌లో క్రెడిట్ కార్డ్  తీసుకుంది. ఆ తరువాత ఆదివారం నాడు ఆమె మొదటి సారిగా కొత్త కార్డును ఉపయోగించింది.

Covi-19 Treatment : 158 రోజుల తరువాత కిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయిన మహిళ..

ఆ క్రెడిట్ కార్డుతో ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయడానికి రూ.240 చెల్లించింది. అయితే ఆ పేమెంట్ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ఆమె కస్టమర్ కేర్ నంబర్‌కు డయల్ చేసింది. యాజ్ యూజ్ వల్ గా కస్టమర్ కేర్ సెంటర్ నుండి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఆమె ప్రత్యామ్నాయ సంప్రదింపు నంబర్‌ల కోసం గూగుల్‌లో వెతికింది. 

ఇంటర్నెట్ లో ఓ నంబర్ ఆమెకు దొరికింది. ఆమె ఆ నంబర్‌కు డయల్ చేసి, విషయం చెప్పింది. వెంటనే అతను తను సమస్యను సాల్వ్ చేస్తానని చెప్పాడు. ఆమె అభ్యర్థనను ప్రాసెస్ చేస్తున్నానంటూ చెప్పి.. ఒకటి తరువాత ఒకటి అనేక OTPలను షేర్ చేసుకున్నాడు. 

కాసేపట్లోనే కృతిక తన అకౌంట్ లో నుంచి రూ. 44,000 debit అయినట్లు గుర్తించింది. వెంటనే ఆ కాల్ ఆపేసింది. మళ్లీ ట్రై చేస్తే నెం. కలవలేదు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన కృతిక వడపళని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు వడపళని పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

ఆఫర్ల పేరిట ఫేస్ బుక్ లో వచ్చే లింకులు ఓపెన్ చేసి మోసపోయిన ఘటనలూ గతంలో జరిగాయి. అందుకే ఆన్ లైన్ ట్రాన్షాక్షన్స్, కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఓటీపీలు షేర్ చేసేముందు ఒకటికి రెండు సార్లు అవి దేనికి సంబంధించినవో చెక్ చేసుకోవాలి. ఇలాంటి మోసాలు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. ఈజీగా మోసం చేసి, సులువుగా డబ్బులు దండుకునే సైబర్ మోసగాళ్లు పెచ్చుమీరిపోతున్నారు. వీరి బారిన పడకుండా ఉండాలంటే వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండడం మినహా ఏమీ చేయలేం.  

click me!