దేశవ్యాప్తంగా ఎండ తీవ్రత క్రమంగా పెరిగింది. మార్చి నెల ప్రారంభంలో ఉష్ణోగ్రతలు ఓ రేంజ్‌లో పెరిగాయి. అయితే మండె ఎండ నుంచి ఉపశమనం లభించేలా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరులో కూడా వర్షం కురిసింది. అయితే వర్షం కురిసిన అనంతరం బెంగళూరు రోడ్లపై కనిపించిన అంతుచిక్కని నురుగు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది..
కొన్ని వారాలుగా తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ బెంగళూరు ప్రజలకు శనివారం ఉపశమనం లభించింది. నగరంలో కొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కురిసిన వర్షానికి నగర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
అయితే ఈ వర్షాల మధ్య ఓ విచిత్రమైన దృశ్యం నగర పౌరులను ఆశ్చర్యానికి గురి చేసింది. వర్షం తగ్గిన తర్వాత రోడ్లపై ఆకస్మాత్తుగా తెల్లటి నురుగు కనిపించింది. ఇది ఎలా ఏర్పడిందో ఎవరికీ అర్థం కాలేదు. అచ్చంగా మంచు కురిసినట్లు కనిపించింది. అయితే దీనికి కారణం ఏంటన్నది ఇప్పటికీ తెలియరాలేదు. కాగా పారిశుధ్య సమస్యల వల్ల లేదా కాలుష్యభరితమైన కాలువల వల్ల ఈ నురుగు ఏర్పడినట్టుగా అనుమానిస్తున్నారు. సంబంధిత అధికారులు దీనిపై విచారణ ప్రారంభించారు.
ఇదిలా ఉంటే ఈ దృశ్యాలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. బెంగళూరు రోడ్లపై కనిపిస్తున్న మిస్టీరియస్ వైట్ ఫోమ్ ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు స్పందిస్తూ ఇది ముమ్మాటికీ ప్రకృతిలో వస్తున్న మార్పుల వల్లే అంటూ స్పందిస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.