అమానవీయం...మహిళపై గ్యాంగ్ రేప్... బాధితురాలిపైనే గ్రామ బహిష్కరణ

By Arun Kumar PFirst Published Dec 31, 2020, 4:27 PM IST
Highlights

అత్యాచార బాధితురాలే నేరం చేసినట్లు గ్రామం నుండి బహిష్కరించాలని గ్రామ పెద్దలు నిర్ణయించిన సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. 

ఔరంగాబాద్: తనపై లైంగికదాడి జరిగి తీవ్ర మనోవేదనకు గురయిన మహిళకు మనోధైర్యాన్ని నింపాల్సింది పోయి మరింత వేధనకు గురిచేశారు గ్రామస్తులు. బాధిత మహిళే నేరం చేసినట్లు గ్రామం నుండి బహిష్కరించాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. ఆ గ్రామం నుండి ఎక్కడ అత్యాచార మహిళ తమ గ్రామానికి వస్తుందేమోనని చుట్టుపక్కల మరో రెండు గ్రామాలు కూడా రానివ్వకూడదని తీర్మాణం చేశాయి. ఈ అమానవీయ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 30ఏళ్ళ మహిళపై అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువకులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఈ ఘటన 2015లో జరగ్గా ఇటీవల యువకులు అత్యాచారానికి పాల్పడినట్లు కోర్టులో రుజువయ్యింది. దీంతో యువకులకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఇలా యువకులకు శిక్ష పడటంతో గ్రామస్తులు బాధిత మహిళపై కోపాన్ని పెంచుకున్నారు. ఈ క్రమంలోనే అత్యాచార బాధితురాలు తమ గ్రామంలో వుండొద్దంటూ బహిష్కరించారు. చుట్టుపక్కల మరో రెండు గ్రామాలు కూడా సదరు మహిళను గ్రామంలోకి అనుమతించకుండా తీర్మానం చేశాయి. 

ఈ చర్యలతో తీవ్ర మనస్థాపానికి గురయిన మహిళ పోలీసులను ఆశ్రయించింది.  దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత మహిళ పట్ల అమానవీయంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.


 

click me!