దేశద్రోహ చట్టంపై లా కమిషన్ సిఫార్సులు.. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ స్పందన ఇదే

By Siva KodatiFirst Published Jun 2, 2023, 6:12 PM IST
Highlights

దేశ ద్రోహ చట్టంపై లా కమీషన్‌ చేసిన సిఫార్సులపై కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ స్పందించారు. దీనిపై నిపుణులు, అన్ని వర్గాలతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. 

దేశద్రోహ చట్టం (భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 124A)పై తుది నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం అన్ని వాటాదారులతో సంప్రదింపులు జరుపుతుందన్నారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ . కొన్ని సవరణలు, పెరిగిన శిక్షలతో నిబంధనను కొనసాగించాలని భారత లా కమిషన్ చేసిన సిఫార్సుకు కట్టుబడి లేమని మంత్రి తెలిపారు. దేశ ద్రోహంపై లా కమీషన్ నివేదిక విస్తృతమైన సంప్రదింపు ప్రక్రియ దశల్లో ఒకటని మేఘ్వాల్ అన్నారు. నివేదికలో చేసిన సిఫార్సులకు తాము కట్టుబడి లేమన్నారు. నివేదిక ఇప్పుడే మా చేతికి అందిందని.. ఇతర వాటాదారులందరితో కూడా సంప్రదింపులు జరుపుతామని ఆయన పేర్కొన్నారు. తద్వారా ప్రజా ప్రయోజనాల కోసం సహేతుకమైన నిర్ణయం తీసుకుంటామని అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ట్వీట్ చేశారు. 

కాగా.. రాజద్రోహ చట్టం కేవలం వలసవాద కాలం నాటి చట్టమైనందుకు తొలగించాల్సిన అవసరం లేదని లా కమిషన్ పేర్కొంది. కేవలం వలస వాద చట్టం అని తొలగించడమంటే.. ప్రస్తుతం భారత దేశంలో నెలకొని ఉన్న వాస్తవ పరిస్థితులను చూడనిరాకరించినట్టే అవుతుందని తెలిపింది. ప్రస్తుత పరిస్థితులకు మన దేశంలో రాజద్రోహ చట్టం అవసరమే అని స్పష్టం చేసింది. అంతేకాదు, ఆ చట్టం మరింత కఠినతరంగా ఉండాలని సూచించింది. రాజద్రోహ చట్టం కింద శిక్షను మూడు సంవత్సరాలను పెంచాలని, కనీసం ఏడేళ్ల జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష వేయాలని తెలిపింది.

ALso Read: వలసవాద చట్టమైతే ఏంటీ? రాజద్రోహ చట్టం అవసరం.. శిక్ష మరింత కఠినంగా ఉండాలి: కేంద్ర ప్రభుత్వ ప్యానెల్ రిపోర్ట్

రాజద్రోహ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు గతేడాది ఈ చట్టం కింద క్రిమినల్ ట్రయల్స్, కోర్టు ప్రొసీడింగ్స్‌ను నిలిపేసింది. అదే సందర్భంలో ఈ నిర్ణయాన్ని సమీక్షించడానికి కేంద్ర ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని సమీక్షించాలని లా కమిషన్‌ను అడిగింది.

లా కమిషన్ తన రిపోర్టులో పై వివరాలు పేర్కొంది. రాజద్రోహ చట్టాన్ని తొలగిస్తే దేశ భద్రత, సమగ్రతకు ముప్పు ఏర్పడుతుందని, విద్రోహ శక్తులు వాటి ఎజెండాను మరింత విస్తృతం చేస్తాయని హెచ్చరించింది. జాతి ద్రోహ, వేర్పాటువాద శక్తులు హింసాత్మక, చట్ట విరుద్ధ మార్గాల్లో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాలు చేస్తే ప్రభుత్వాన్ని కాపాడటానికి ఐపీసీలోని సెక్షన్ 124ఏ కాపాడుతుందని వివరించింది.

దుర్వినియోగం గురించి పేర్కొంటూ.. కేసు నమోదు చేయడానికి ముందు కొన్ని సేఫ్‌గార్డులు చేర్చాలని ఆ రిపోర్టు పేర్కొంది. ఎస్ఐ ర్యాంకు, ఆ పై ర్యాంకు పోలీసు అధికారులు ప్రాథమిక దర్యాప్తు జరిపిన తర్వాతే కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కేసు నమోదు చేయాలని సూచనలు చేసింది. రాజద్రోహ చట్టం కేవలం వలసవాద కాలానిదనే కారణం ఆ చట్టాన్ని కూలదోయడానికి సరిపోదని వివరించింది. అలా ఆలోచిస్తే మన దేశంలోని మొత్తం లీగల్ సిస్టమ్ ఫ్రేమ్ వర్క్ అంతా అప్పటిదే అని వాదించింది. ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ వంటివీ బ్రిటీష్ కాలపు అవశేషాలనే చెప్పాలి. రాజద్రోహానికి బదులు ఉపా, ఎన్ఎస్ఏ చట్టాలను ఉపయోగించవచ్చుననే వాదనలూ సరికావని పేర్కొంది. 124ఏ కవర్ చేసిన అంశాలన్నింటినీ ఆ చట్టాలు కవర్ చేయలేవని తెలిపింది.
 

click me!