డ్రగ్స్ కేసు విచారణ ఫిబ్రవరి 10కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

By rajesh yFirst Published Sep 13, 2018, 9:04 PM IST
Highlights

తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఓ కుదుపు కుదిపేసిన మాదకద్రవ్యాల కేసుపై సి.బి.ఐ. దర్యాప్తు కోరుతూ సినీ నిర్మాత, దర్శకుడు, తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి గతంలో దాఖలు చేసిన పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం తిరిగి విచారించింది. 

ఢిల్లీ: తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఓ కుదుపు కుదిపేసిన మాదకద్రవ్యాల కేసుపై సి.బి.ఐ. దర్యాప్తు కోరుతూ సినీ నిర్మాత, దర్శకుడు, తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి గతంలో దాఖలు చేసిన పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం తిరిగి విచారించింది. 

ఈ ధర్మాసనం గతంలో కేంద్ర ప్రభుత్వంను మాదకద్రవ్యాల వాడకంను అరికట్టేందుకు ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించి వాటిని అమలుచేయలని ఆదేశించింది. అందుకు కొంత గడువును ప్రభుత్వం తరపున అదనపు సోలిసిటర్ జనరల్ మనిందర్ సింగ్ కోరారు. ఆ గడువు ముగియడంతో సోమవారం తిరిగి విచారణ జరిపింది. 

ఈ కేసు విచారణలో పిటిషనర్ తరపు నాయవాది శ్రావణ్ కుమార్ పాల్గొనగా వారితో పాటు ఎయిమ్స్ డైరెక్టర్ తరపున న్యాయవాది దుష్యంత్ పరిషర్ పాల్గొన్నారు. విధివిధానాలను రూపొందించుటకు కొంచెం సమయం కావాలని కోరారు. వారి వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసును ఫిబ్రవరి10 కి వాయిదా వేసింది. 

తాను ఒక చిత్ర నిర్మాత గా,దర్శకుడు గా ఈ కేసును సుప్రీంకోర్టు నందు దాఖలు చేయుటకు గల ప్రధాన కారణం పరిశ్రమలో ఉన్న కొందరు చేసిన తప్పులకు సినీపరిశ్రమను నిందించడం బాధకలిగించిందని అందుకే తాను సుప్రీం కోర్టును ఆశ్రయించినట్లు పిటిషనర్ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసులో పరిశ్రమకు చెందిన వ్యక్తుల ప్రమేయం ఉందా ? లేక ? ఈ డ్రగ్ మాఫియాకు చిత్ర పరిశ్రమకు చెందిన వారి సంబంధాలను నిగ్గు తేల్చేందుకే సీబీఐ సమగ్ర దర్యాప్తు చేపట్టాలని మెుట్టమెుదట ప్రధానమంత్రిని కోరడం జరిగిందని ఆ తర్వాత సుప్రీం కోర్టులో  పిటీషన్ వేసినట్లు తెలిపారు. 

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు, కేంద్రప్రభుత్వంతోపాటు 18 రాష్ట్రాలను ప్రతివాదులుగా చేర్చి కేసు వేసినట్లు తెలిపారు. ఈ పిటీషన్ లో ప్రధానంగా సీబీఐ దర్యాప్తుతోపాటు చలన చిత్రాలలో, టీవీ సీరియల్స్ లలో మాదక ద్రవ్యాల వాడకం సన్నివేశాలు ఉండకూడదని, పబ్స్ లలో మాదక ద్రవ్యాల అమ్మకం జరుగుతుందని కాబట్టి పబ్ లపై నిఘా ఏర్పాటు చెయ్యాలని, పాఠశాల విద్యార్థులకు మాదకద్రవ్యాల వాడకం వల్ల కలిగే ఇబ్బందులను తెలిపేలా పాఠం రూపంలో చర్చ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.  

మాదకద్రవ్యాలను వాడేవాళ్లపై, అమ్మేవాళ్లపై కఠిన శిక్షలు అమలుపరిచేలా కొత్త చట్టాన్ని రూపొంిచాలని మాదక ద్రవ్యాల వాడకం నిరోధించడంలో ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ఒకప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలు ఈ మాదకద్రవ్యాలను చాలా తక్కువ మంది వాడేవారని కానీ ఇప్పుడు చిన్న పిల్లలు, యువకులు ,అన్ని వర్గాల ప్రజలు ఈ మాదక ద్రవ్యాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు సరైన చట్టాలు లేకపోవడంతో విచ్చల విడిగా భారతదేశంలో వినియోగం జరుగుతుందని మండిపడ్డారు. డ్రగ్స్ రహిత భారత నిర్మాణం కోసం మనమంతా ఏకమై పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని సమాజానికి తమ సినిమాలు ద్వారా నీతిని బోధించే సినిమా వారే నీతి తప్పి బరి తేగించి ఈ డ్రగ్స్ ను వాడడం ఎంత వరకు కరెక్ట్ అని వారు తెలుసుకోవాలని సూచించారు. 

 భారత దేశంలో విదేశస్థులు ఎక్కువ మంది చదువుల పేరుతో దేశంలో చొరబడటమే ఈ డ్రగ్స్ రవాణాకు మూలకారణమన్నారు. దేశంలో ఎంత మంది విదేశస్థులు ఉన్నారో వారి లెక్కలు కూడా ప్రభుత్వం వద్ద లేవన్నారు. ముంబయి ,గోవా , హైదరాబాద్ లో విదేశీయులు చదువుపేరుతో వచ్చి డ్రగ్స్ దందా చేస్తుంటే కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నాయని మండిపడ్డారు. 

డ్రగ్స్ వినియోగం రాబోయే రోజుల్లో దేశభద్రతకు విఘాతం కలిగించే శక్తుల కుట్రలో భాగమేనని, ప్రస్తుతం తాను డ్రగ్స్ రహిత భారత నిర్మాణంలో భాగంగా న్యాయపోరాటం చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో ధర్మపోరాటం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అందుకు ప్రజలంతా సహకరించి ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు.  మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి. 
 

click me!