
కర్ణాటక, బిహార్ సహా అనేక రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలో అవకతవకలున్నాయంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు విపక్షాలు ఎన్నికల సంఘాన్ని (EC) విమర్శిస్తున్నాయి. ఈ ఆరోపణలకు సమాధానం ఇవ్వేందుకు ఈసీ ఈరోజు (ఆదివారం) ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయనుంది. యాదృచ్ఛికంగా అదే రోజు రాహుల్ బిహార్‌లో ‘ఓటు అధికార యాత్ర’ మొదలుపెట్టనుండటంతో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే సమయంలో తప్ప, ఇతర అంశాలపై ఈసీ మీడియా సమావేశం జరపడం అరుదు. అయితే ఇటీవల విపక్షాలు పదేపదే వినిపిస్తున్న ‘ఓటు చోరీ’ ఆరోపణలే ఈసీ ఈ అడుగు వెనుక ఉన్నాయని అధికారులు సూచించారు. తప్పుడు కథనాలకన్నా ఆధారాలు చూపాలని ఇప్పటికే ఈసీ స్పష్టం చేసింది.
రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్లలో నాలుగో వంతు ఖాళీగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. కన్వీనర్ కోటా కింద విద్యార్థుల కంటే సీట్లు ఎక్కువగా ఉండటంతో మొత్తం 34,298 సీట్లు భర్తీ కాలేదు. అందులో విశ్వవిద్యాలయాల్లో 1,361 సీట్లు ఖాళీగా ఉండగా, ప్రైవేట్ కళాశాలల్లోనే 31,811 సీట్లు భర్తీ కాలేదు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో 1,126 సీట్లు మిగిలాయి. ఈఏపీసెట్‌లో 1,84,248 మంది అర్హత సాధించినా, కన్వీనర్ కోటా కింద రిజిస్టర్ చేసుకున్నవారు 1,29,012 మంది మాత్రమే. వారిలో అర్హత సాధించిన వారు 1,28,712 మంది. కానీ సీట్లు మాత్రం మొత్తం 1,53,964 ఉండటంతో, అర్హులందరికీ కేటాయించినా 25 వేలకు పైగా సీట్లు మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. కోరుకున్న కళాశాలలు దొరకకపోవడంతో ఖాళీల సంఖ్య ఇంకా పెరిగింది.
అమాయక దంపతులు, చిన్నారుల జీవితాలతో అక్రమాలు చేసిన డాక్టర్ నమ్రత అసలు రూపం బయటపడుతోంది. తొలుత ఏం తెలియనట్టుగా నటించినా, పోలీసుల విచారణలో అన్ని విషయాలను తానే ఒప్పుకుంది. ఎందుకు చేసింది, ఎప్పటి నుంచి చేస్తోంది, ఎవరిని భాగస్వామ్యులను చేసింది, ఎన్ని కోట్లు సంపాదించింది అన్న ప్రతీ విషయాన్ని పూసగుచ్చినట్లు వివరించింది. నమ్రత కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో అనేక షాకింగ్ అంశాలు బయటపడ్డాయి.
ఉక్రెయిన్ యుద్ధం ఆగకపోయినా, తన బలాన్ని మరింత పెంచుకోవడంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విజయవంతమయ్యారని చెబుతున్నారు విశ్లేషకులు. అలాస్కా చర్చల కోసం వచ్చిన పుతిన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా స్వాగతించి, రష్యా శక్తిని కొనియాడారు. ప్రపంచంలో రెండో శక్తివంతమైన దేశమని ట్రంప్ పేర్కొన్నారు. ముందు కాల్పుల విరమణకే పట్టు పట్టిన ట్రంప్ ఇప్పుడు పూర్తిస్థాయి శాంతి ఒప్పందానికే మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. రష్యా చాలాకాలంగా కోరుకుంటున్నదే ఇదని విశ్లేషకులు అంటున్నారు. యుద్ధం ఆగకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ట్రంప్ చేసిన హెచ్చరికలు ఇప్పుడు వినిపించడం లేదు. అలాస్కా చర్చలు ట్రంప్‌కు పెద్దగా ప్రయోజనం ఇవ్వకపోయినా, పుతిన్ మాత్రం తనకావలసినదాంట్లో చాలావరకు సాధించారని రష్యాలో బ్రిటన్ మాజీ రాయబారి లారీ బ్రిస్టో అభిప్రాయపడ్డారు.
ఆసియా కప్ 2025కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ సారి టోర్నమెంట్ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలోని అబుదాబి, దుబాయ్ వేదికలుగా మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ క్రమంలో టీ20 ఆసియా కప్‌కు సంబంధించిన వివరాలు ఈరోజు తెలుసుకోండి.