భీమా కోరేగావ్ కేసు.. సుప్రీంకోర్టులో సుధా భ‌ర‌ద్వాజ్‌కు ఊర‌ట‌

By Mahesh Rajamoni  |  First Published Dec 7, 2021, 3:44 PM IST

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్‌కు భీమా కోరేగావ్, ఎల్గర్ పరిషత్ కేసులో డిఫాల్ట్ బెయిల్ ను  ఇటీవలే బాంబే హైకోర్టు మంజూరు చేసింది. అయితే,  బాంబే హైకోర్టు  ఉత్తర్వులను సవాలు చేస్తూ జాతీయ దర్వాప్తు సంస్థ (NIA) సుప్రీంకోర్టు ఆశ్రయించింది. అయితే, దీనిని మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఎన్ఐఏ పిటిష‌న్‌ను కొట్టివేసింది. 


న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్‌కు భీమా కోరేగావ్, ఎల్గర్ పరిషత్ కేసులో సుప్రీంకోర్టులో ఊర‌ట ల‌భించింది. సుధా భరద్వాజ్‌కు బెయిల్ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎటువంటి కారణం లేదనీ, ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.  భీమా కోరేగావ్, ఎల్గర్ పరిషత్ కేసు నేప‌థ్యంలో 2018 నుంచి జైల్లో ఉన్న సుధా భరద్వాజ్‌కి బొంబాయి హైకోర్టు ఈ నెల డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది.  ఆమెపై విచారణను పొడిగించి.. నిర్బంధాన్ని పొడిగించే విధంగా న్యాయ‌స్థానాలు చేయ‌లేని కోర్టు పేర్కొంది. న్యాయమూర్తులు ఎస్‌ఎస్‌ షిండే, ఎన్‌జే జమాదార్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 8న ఆమెను ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరుస్తారు. అదేరోజు బెయిల్ షరతులపై ప్రతేక కోర్టు నిర్ణయం తీసుకుంటుంద‌ని ఆమె త‌ర‌ఫు న్యాయ‌వాది తెలిపారు. 

Also Read: 47 దేశాల‌కు వ్యాపించిన ఒమిక్రాన్..

Latest Videos

undefined

 

అయితే, ఆమె బెయిల్ పిటిష‌న్‌ను అడ్డుకుంటూ జాతీయ ద‌ర్వాప్తు సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మంగ‌ళ‌వారం దీనిపై విచార‌ణ జ‌రిపిన సుప్రీంకోర్టు.. సుధా భ‌ర‌ద్వాజ్‌కు బెయిల్ ఇవ్వొద్దు అని నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ  (NIA )దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమ‌ని సుప్రీం చెప్పింది. దీంతో దాదాపు రెండు సంవ‌త్స‌రాల త‌ర్వాత జైలు నుంచి రిలీజ్ అయ్యేందుకు సుధా భ‌ర‌ద్వాజ్‌కు  మార్గం సులువైంది. ఎన్ఐఏ చేసిన వాద‌న‌ల‌ను జ‌స్టిస్ యూయూ ల‌లిత్‌, ర‌వింద్ర భ‌ట్‌, బేలా ఎం త్రివేదిల‌తో కూడిన ధ‌ర్మాస‌నం తిర‌స్క‌రించింది.  NIA తరపున అదనపు సొలిసిటర్ జనరల్ అమన్ లేఖి వాద‌న‌లు వినిపిస్తూ..  డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసేటప్పుడు UAPA (చట్టవిరుద్ధమైన కార్యకలాపాల (నివారణ) చట్టం-1967లోని  కొన్ని సెక్షన్‌లను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. దర్యాప్తు సంస్థ దాఖ‌లు చేసిన సమర్పణను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు బెంచ్‌కు విజ్ఞప్తి చేశారు. 

Also Read: వ‌ర‌క‌ట్నంపై చ‌ట్టాలే కాదు.. సామాజికంగానూ మార్పు రావాలి: సుప్రీంకోర్టు 


అయితే, బెంచ్ ఎన్ఐఏ వాద‌న‌ల‌తో ఏకీభ‌వించ‌లేదు. " హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి మాకు ఎలాంటి కారణం కనిపించడం లేదు"  అని పేర్కొంటూ సుప్రీంకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. ఇదిలావుండ‌గా,  2018 భీమా కోరేగావ్ హింస కేసులో సుధా భరద్వాజ్‌తో పాటు వరవరరావు, సోమసేన్, సుధీర్ ధావలే, రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, మహేష్ రౌత్, వెర్నాన్ గోన్సాల్వేస్, అరుణ్ ఫెరీరా తరపున కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, సుధా భరద్వాజ్‌ మినహా అంద‌రి బెయిల్ తిర‌స్క‌రించ‌బ‌డింది. కాగా, 2017 డిసెంబర్ 31న పూణేలోలో జరిగిన ఎల్గర్ పరిషత్ సమావేశంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీని కార‌ణంగానే  ఆ త‌ర్వాతి రోజు భీమాకోరేగావ్‌లో అల్ల‌ర్లకు కార‌ణ‌మ‌య్యార‌ని పేర్కొంటూ పలువురు స‌మాజిక కార్య‌క‌ర్త‌ల‌పై కేసులు న‌మోదుచేయ‌బ‌డ్డాయి. మ‌రిన్ని ఆరోప‌ణ‌ల‌తో వారిపై ఉపా కింద ఎన్ఐఏ కేసులు మోపింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ప‌ర్యావ‌ర‌ణ, హ‌క్కుల కార్య‌క‌ర్త స్టాన్ స్వామీ ఇటీవ‌లే నిర్బంధంలోనే ప్రాణాలు కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. 

Also Read: మహారాష్ట్రలో ఒమిక్రాన్ అలజడి.. విదేశాల నంచి వచ్చినవారిలో 100 మంది ఆచూకీ లేదు: అధికారులు

click me!