Rahul Gandhi: మరణించిన రైతుల డేటా మా దగ్గర ఉంది.. వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వండి.. లోక్‌సభలో రాహుల్ గాంధీ

By Sumanth KanukulaFirst Published Dec 7, 2021, 3:11 PM IST
Highlights

వ్యవసాయ చట్టాలకు (farm laws) వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో మరణించిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) లోక్‌సభలో డిమాండ్ చేశారు. మరణించిన రైతుల డేటా లేదని కేంద్ర మంత్రి చెప్పారని.. తన వద్ద ఆ జాబితాను ఉందని, వారి కుటుంబ సభ్యులకు పరిహారం అందజేయాలని కోరారు.
 

వ్యవసాయ చట్టాలకు (farm laws) వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో మరణించిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) లోక్‌సభలో డిమాండ్ చేశారు. మరణించిన రైతుల వివరాలేవీ తమ వద్ద లేవని వ్యవసాయ శాఖ మంత్రి సభలో చెప్పారని రాహుల్ గుర్తుచేశారు. అందుకే ఆ జాబితాను తాము అందజేస్తున్నామని తెలిపారు.  నేడు రాహుల్ గాంధీ లోక్‌సభలో (Lok Sabha) మాట్లాడుతూ.. ప్రభుత్వం వద్ద డేటా లేనందున.. మరణించిన రైతుల జాబితాను తాను అందజేస్తానని చెప్పారు. ‘సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన రైతు ఉద్యమంలో 700 మంది రైతులు అమరులయ్యారని దేశానికి తెలుసు. ప్రధాని రైతులకు క్షమాపణలు చెప్పారు. తప్పును అంగీకరించారు. ఉద్యమ సమయంలో అమరులైన రైతుల సంఖ్య గురించి వ్యవసాయ మంత్రిని ప్రశ్నించగా.. వారి వద్ద డేటా లేదని చెప్పారు’ అని రాహుల్ అన్నారు. 

‘పంజాబ్‌లో దాదాపు 400 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందించింది. మరణించిన 152 మంది రైతుల కుటుంబాల్లో నుంచి ఒక్కరి  చొప్పున ఉద్యోగాలు కల్పించింది. నా దగ్గర జాబితా ఉంది. దానిని సభ ముందు ఉంచుతాను. హర్యానాలో మరణించిన 70 మంది రైతుల జాబితా మా వద్ద ఉంది. ఓవైపు ప్రధానమంత్రి క్షమాపణలు చెబుతుంటే.. మీరు పేర్లు లేవని చెబుతున్నారు. ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి. వారికి పరిహారం, ఉద్యోగాలు ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా.. అది వారి హక్కు’ అని రాహుల్ గాంధీ అన్నారు. 

Also Read: Nagaland Firing: పొరపాటు జరిగింది.. ఉగ్రవాదులనే అనుమానంతోనే ఫైరింగ్.. లోక్‌సభలో అమిత్ షా

ఇక, సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన సమయంలో మరణించిన రైతుల డేటా తమ దగ్గర లేదని కేంద్ర ప్రభుత్వం రెండు సార్లు పార్లమెంట్ వేదికగా వెల్లడించింది. ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో రైతుల మరణాలపై తమ డేటా లేదని కేంద్రం తెలిపింది. తాజాగా శీతాకాల సమావేశాల్లో కూడా కేంద్రం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. గత వారం పార్లమెంట్‌లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ (Narendra Singh Tomar).. రైతుల సంబంధించిన డేటా తమ దగ్గర లేదని ప్రకటించారు.  డేటా తమ దగ్గర లేనందువల్ల రైతులకు పరిహారం ఇవ్వలేమని స్పష్టం చేశారు. 

అయితే సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఆందోళనల్లో దాదాపు 700 మంది రైతులు మరణించారని ప్రతిపక్షాలు, రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. వారిని కేంద్రం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. 

click me!