ట్విట్టర్ ఇండియా మాజీ హెడ్ మనీష్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

By telugu teamFirst Published Oct 22, 2021, 4:21 PM IST
Highlights

ట్విట్టర్ ఇండియా మాజీ హెడ్ మనీష్ మహేశ్వరికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్‌లో నమోదైన ఓ కేసులో దర్యాప్తునకు హాజరవ్వాలని పోలీసులు సమన్లు జారీ చేయగా, అరెస్టు చేయమనే హామీనివ్వాలని మనీష్ మహేశ్వరి కర్ణాటక హైకోర్టుకెక్కారు. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, తాజాగా మనీష్ మహేశ్వరికి నోటీసులు పంపింది.
 

న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సైట్ Twitter ఇండియా మాజీ హెడ్ మనీష్ మహేశ్వరికి సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. కర్ణాటక హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ Uttar Pradesh ప్రభుత్వం Supreme Courtను ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ సారథ్యంలోని ధర్మాసనం మనీష్ మహేశ్వరికి నోటీసులు జారీ చేసింది.

ఢిల్లీ సమీపంలో అబ్దుల్ సమద్ సైఫీపై కొందరు తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మత ఉన్మాదాన్ని పేర్కొంటూ ఈ వీడియో సంచలనానికి కేంద్రమైంది. దీనిపైనే ఓ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో భాగంగా ఉత్తరప్రదేశ్ Policeలు ట్విట్టర్ ఇండియా అప్పటి హెడ్ మనీష్ మహేశ్వరి, మరో ఎనిమిది మందికి సమన్లు జారీ చేశారు. ఆ వ్యక్తి అమ్మిని తాయత్తులకు సంబంధించిన వ్యవహారంలో ముస్లింలు, హిందువులు దాడి చేశారని పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మహేశ్వరి రెండు వర్గాల మధ్య చిచ్చుకు, అల్లర్లు సృష్టించే అభియోగాలను మోస్తున్నారు.

Also Read: ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరిపై బదిలీ వేటు

ఈ కేసులో ప్రశ్నించడానికి ఉత్తరప్రదేశ్ పోలీసులు ట్విట్టర్ ఇండియా మాజీ హెడ్ మనీష్ మహేశ్వరికి సమన్లు జారీ చేశారు. ఈ సమన్లపై మనీష్ మహేశ్వరి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణలో పాల్గొనడానికి తాను సిద్ధంగా ఉన్నారని, కానీ, పోలీసులు అందుకు తిరస్కరించారని మనీష్ మహేశ్వరి పేర్కొన్నారు. తాను స్వయంగా ఉత్తరప్రదేశ్ రావాలని చెబుతున్నారని వివరించారు. తనను అరెస్టు చేయరన్న హామీనిస్తే 24 గంటల్లో యూపీకి వెళ్లి రావడానికి సిద్ధంగా ఉన్నారని మనీష్ మహేశ్వరి న్యాయవాది కోర్టుకు తెలిపారు. మనీష్ మహేశ్వరిని అరెస్టు చేయవద్దని జూన్ 24న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఆదేశాలను సవాలు చేస్తూ ఉత్తరప్రదేశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 41ఏ కింద కేసు నమోదైందని ఉత్తరప్రదేశ్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టులో వాదించారు. ఈ సెక్షన్ కింద నిందితుడిని అరెస్టు చేయాల్సిన పని లేదని, కానీ, దర్యాప్తునకు సహకరించకుంటేనే అరెస్టు చేయాల్సి వస్తుందని వివరించారు. తాజాగా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పిటిషన్‌పై స్పందించాల్సిందిగా ట్విట్టర్ ఇండియా మాజీ హెడ్ మనీష్ మహేశ్వరికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

click me!