సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి లైవ్ స్ట్రీమ్.. లైవ్ టెలికాస్ట్‌లో వాదనలు.. ఇక్కడ చూసేయండి..!

By Mahesh KFirst Published Sep 27, 2022, 12:52 PM IST
Highlights

సుప్రీంకోర్టులో వాదనలు చాలా మంది చూసి ఉండరు. చాలా కొద్ది మందికి మాత్రమే విచారణ, వాదనల తీరుపై అవగాహన ఉంటుంది. అయితే, రాజ్యాంగానికి సంబంధించిన కీలకమైన అంశాలపై విచారణను లైవ్ టెలికాస్ట్ చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ రోజు సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి విచారణను లైవ్‌లో అందుబాటులో ఉంచింది.

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి లైవ్ స్ట్రీమ్‌లో విచారణ అందుబాటులోకి వచ్చింది. మంగళవారం సుప్రీంకోర్టులో మూడు రాజ్యాంగ ధర్మాసనాలు కీలక కేసులను విచారిస్తున్నాయి. ఈ మూడు విచారణలను, సీనియర్ న్యాయవాదుల వాదనలను లైవ్‌లో వీక్షించవచ్చు. ఇందుకోసం సుప్రీంకోర్టు ప్రత్యేకంగా లైవ్ టెలికాస్ట్ కోసం ఒక ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి తెచ్చింది. అదే విధంగా యూట్యూబ్‌లోనూ అందుబాటులో ఉంచింది. ఈ మూడు రాజ్యాంగ ధర్మాసనాల విచారణను లైవ్‌లో ఈ లింక్ https://webcast.gov.in/scindia/ పై క్లిక్ చేసి చూడవచ్చు.

చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యూయూ లలిత్ సారథ్యంలోని రాజ్యాంగ ధర్మాసనం కోర్టు 1లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్యూఎస్) కోటా కేసు విచారిస్తున్నది. 103వ రాజ్యాంగ సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారిస్తున్నది.

రెండో రాజ్యాంగ ధర్మాసనం జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలో మహారాష్ట్రకు చెందిన శివసేన పార్టీ పిటిషన్‌లను విచారిస్తున్నది. మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, శివసేన పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేలు శివసేన పార్టీ తమదే అని దాఖలు చేసిన పిటిషన్‌లను విచారిస్తున్నది. ఈ పిటిషన్లకు సంబంధించి ఎనిమిది ప్రశ్నలను ఫ్రేమ్ చేసి సుప్రీంకోర్టు ఆగస్టు నెలలో రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది. ఇందులో పార్టీ ఫిరాయింపులు, విలీనం, అనర్హత వేటు వంటి అంశాలపై విచారణ చేస్తున్నది. అనర్హత వేటు, స్పీకర్, గవర్నర్‌ల అధికారులు, జ్యుడీషియల్ రివ్యూలు వంటి రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌కు సంబంధించిన కీలక విషయాలను విచారిస్తున్నది.

మూడో రాజ్యాంగ ధర్మాసనం జస్టిస్ ఎస్‌కే కౌల్ సారథ్యంలో ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్‌ చెల్లుబాటుకు సంబంధించిన అంశాలను విచారిస్తున్నది.

సరిగ్గా నాలుగేళ్ల క్రితం 2018 అప్పటి సీజేఐ దీపక్ మిశ్రా చరిత్రాత్మక తీర్పు వెలువరించారు. రాజ్యాంగపరంగా ముఖ్యమైన అంశాలపై విచారణను లైవ్ టెలికాస్ట్‌లో చేపట్టాలని ఆయన తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుకు సంబంధించి సీజేఐ యూయూ లలిత్ ఈ నెల 20వ తేదీన ఫుల్ కోర్టుతో సమావేశం అయ్యారు. ఈ నెల 27వ తేదీ నుంచి రాజ్యాంగ ధర్మాసనాల విచారణలను లైవ్ టెలికాస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

వాస్తవంగా సుప్రీంకోర్టులో జరిగే విచారణ 30 సెకండ్ల ఆలస్యంతో లైవ్‌లో అందుబాటులో ఉంటుంది.

click me!