
Arvind Kejriwal criticizes PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యల తీసుకుంటున్నదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని దోచుకునే వారికి మద్దతివ్వడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. హోలీ వేడుకల సందర్భంగా దేశం కోసం ప్రార్థిస్తానని ప్రకటించారు. ఈ క్రమంలోనే మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ అరెస్టులను ప్రస్తావిస్తూ ప్రధాని పై విమర్శలతో విరుచుకుపడ్డారు.
వివరాల్లోకెళ్తే.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవిద్ కేజ్రీవాల్ తాజాగా ఓ వీడియో సందేశాన్ని పంచుకున్నారు. అందులో పలు విషయాలను ప్రస్తావిస్తూ కేంద్రంలోని బీజేపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. హోలీ వేడుకల సందర్భంగా దేశం కోసం ప్రార్థిస్తానని ప్రకటించిన కేజ్రీవాల్.. తన ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ అరెస్టులపై ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. ప్రజలకు మంచి విద్య, మంచి వైద్య సదుపాయాలు కల్పించే వారిని ప్రధాని జైళ్లలో పెట్టడం, దేశాన్ని దోచుకునే వారికి మద్దతు ఇవ్వడమనేది ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. "రేపు దేశం కోసం ధ్యానం చేసి ప్రార్థిస్తాను. ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్నది తప్పని మీరు కూడా భావిస్తే, మీరు కూడా దేశం గురించి ఆందోళన చెందుతుంటే, హోలీ జరుపుకున్న తర్వాత, దేశం కోసం ప్రార్థించడానికి సమయం కేటాయించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను" అని తన వీడియో సందేశంలో కేజ్రీవాల్ వెల్లడించారు.
మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ ల గురించి తాను ఆందోళన చెందడం లేదనీ, వారు ధైర్యవంతులని కేజ్రీవాల్ అన్నారు. 'వాళ్లు చాలా ధైర్యవంతులు. వారు దేశం కోసం చనిపోవచ్చు కానీ వారి సంకల్పాన్ని ఎవరూ విచ్ఛిన్నం చేయలేరు. దేశ స్థితిగతుల గురించి ఆందోళన చెందుతున్నాను. సామాన్యుల కోసం పనిచేసేవారు, సామాన్యుల మాట వినేవారు లేరు' అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. 75 ఏళ్ల తర్వాత ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉన్న విద్యను నిరుపేదలకు అందించిన వ్యక్తి ఉన్నారనీ, ఆయనే మనీష్ సిసోడియా అని పేర్కొన్నారు. "దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి అధ్వానంగా ఉందనీ, స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత, ఒక వ్యక్తి ఆరోగ్య సౌకర్యాల ముఖచిత్రాన్ని మార్చారు.. మొహల్లా క్లినిక్లతో కొత్త ఆరోగ్య నమూనాను అందించారు, ఆయనే సత్యేందర్ జైన్. కానీ వారిని తప్పుడు ఆరోపణలతో జైల్లో పెడుతున్నారు" అని కేంంద్రంపై మండిపడ్డారు.
కాగా, అవినీతి కేసులో సత్యేందర్ జైన్ ను గత ఏడాది మేలో అరెస్టు చేశారు. మనీష్ సిసోడియాను ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్టు చేసింది. ఈ క్రమంలోనే గత వారం ఇద్దరు మంత్రులు ఢిల్లీ కేబినెట్ నుంచి వైదొలిగారు. తమ పదవులకు రాజీనామా చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐ విచారణకు సిఫారసు చేసిన 9 నెలల్లోనే రద్దు చేసిన కొత్త మద్యం పాలసీలో ఆప్ నాయకులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. 2021 నవంబర్ లో కొత్త పాలసీని ప్రారంభించిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మద్యం లైసెన్స్ దారులకు చట్టవిరుద్ధ ప్రయోజనాలను ఇచ్చిందనే ఆరోపణలను ఎదుర్కొంటోంది. అయితే, అరెస్టుల వెనుక రాజకీయ ఎజెండా ఉందని ఆరోపిస్తూ ఆప్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.